wanderers stadium
-
ఎల్గర్ మళ్లీ ఆ తప్పు చేయలేదు.. టీమిండియాకు చేజారిపోయింది!
Ind Vs Sa 2nd Test 2022: మూడేళ్ల క్రితం... భారత్‌తో ఇదే మైదానంలో చివరి టెస్టు. 241 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా స్కోరు ఒక దశలో 124/1...అయితే 177 పరుగులకే కుప్పకూలిన సఫారీ టీమ్ చివరకు 63 పరుగులతో ఓడింది... నాడు డీన్ ఎల్గర్ 86 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ సారి అదే వాండరర్స్‌లో దాదాపు అదే లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఎల్గర్ మళ్లీ ఆ తప్పు చేయలేదు. నాటి ఇన్నింగ్స్‌ను కొనసాగింపుగానా అన్నట్లు కెప్టెన్ హోదాలో ఎల్గర్ కఠినమైన పిచ్‌పై మరింత పట్టుదలగా నిలబడ్డాడు. సహచర బ్యాటర్లు అండగా నిలవడంతో 96 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపలేదని అనిపిస్తున్నా... మొత్తంగా చూస్తే జట్టు బ్యాటింగ్ వైఫల్యమే ఈ పరాజయానికి కారణమనేది వాస్తవం. జొహన్నెస్‌బర్గ్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ తుది ఫలితం మూడో టెస్టుకు చేరింది. గురువారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. వాండరర్స్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. 240 పరుగుల లక్ష్యఛేదనలో విజయం కోసం మరో 122 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డీన్ ఎల్గర్ (188 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...వాన్ డర్ డసెన్ (40), తెంబా బవుమా (23 నాటౌట్) అండగా నిలిచారు. మూడో టెస్టు ఈ నెల 11నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది. వర్షం ఆలస్యం చేసినా... ఓవర్‌నైట్ స్కోరు 118/2తో మైదానంలోకి దిగేందుకు దక్షిణాఫ్రికా సిద్ధం కాగా, వాన ఆ అవకాశం ఇవ్వలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముందు తొలి సెషన్ రద్దు కాగా, ఆపై లంచ్ తర్వాతి సెషన్లో ఆటకు అవకాశం లేకుండా పోయింది. ఆపై వర్షం తగ్గాక మైదానం సిద్ధమైంది. పిచ్‌ను పరిశీంచిన అంపైర్లు కనీసం 34 ఓవర్ల ఆట జరిగే అవకాశం ఉందని తేల్చారు. చివరకు దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలుచుకుంది. ఎల్గర్, వాన్ డర్ డసెన్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. మన బౌలర్లు అప్పుడప్పుడు అద్భుతమైన బంతులు వేసినా... పట్టుదలగా నిలిచిన సఫారీ బ్యాటర్లు వాటికి లొంగలేదు. ఎల్గర్, డసెన్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఎట్టకేలకు డసెన్‌ను అవుట్ చేసి షమీ కాస్త ఆశలు రేపాడు. అయితే తర్వాత వచ్చిన బవుమా కూడా తగ్గలేదు. ‘సున్నా’ వద్ద తన బౌలింగ్‌లోనే శార్దుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన బవుమా తర్వాత ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అశ్విన్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా ఆడి ఎల్గర్ బౌండరీ కొట్టడంతో దక్షిణాఫ్రికా గెలుపు పూర్తయింది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 202; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 229; భారత్ రెండో ఇన్నింగ్స్ 266; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (ఎల్బీ) (బి) శార్దుల్ 31; ఎల్గర్ (నాటౌట్) 96; కీగన్ పీటర్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 28; వాన్ డర్ డసెన్ (సి) పుజారా (బి) షమీ 40; బవుమా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (67.4 ఓవర్లలో 3 వికెట్లకు) 243. వికెట్ల పతనం: 1–47, 2–93, 3–175. బౌలింగ్: బుమ్రా 17–2– 70–0, షమీ 17–3–55–1, శార్దుల్ 16–2–47–1, సిరాజ్ 6–0–37–0, అశ్విన్ 11.4–2–26–1. -
Ind Vs Sa: మూడో రోజు ముగిసిన ఆట..
Ind Vs Sa 2nd Wanderers Test: Day 3 Updates మూడో రోజు ముగిసిన ఆట.. లక్ష్యం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికా 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. కెప్టెన్ డీన్ ఎల్గర్(46 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతనికి తోడుగా వాన్ డర్ డస్సెన్(11) క్రీజ్‌లో ఉన్నాడు. రేపటి ఆటలో సఫారీ జట్టు మరో 122 పరుగులు చేస్తే మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్ ఆశలను కూడా సజీవంగా ఉంచుకోగలుగుతుంది. మరోవైపు టీమిండియాకు సైతం చరిత్ర సృష్టించేందుకు అవకాశాలు లేకపోలేదు. నాలుగో రోజు భారత బౌలర్లు మరో ఎనిమిది వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా వశమవుతుంది. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా లక్ష్యం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అడ్డుకట్ట వేశాడు. 93 పరుగుల వద్ద కీగన్ పీటర్సన్(28)ను ఎల్బీడబ్లూ చేయడంతో ఆ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో అశ్విన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వాండరర్స్ మైదానంలో కుంబ్లే తర్వాత వికెట్ తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 28 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 93/2. క్రీజ్‌లో ఎల్గర్(32), వాన్ డర్ డస్సెన్ ఉన్నారు. టార్గెట్ 240.. దక్షిణాఫ్రికా 66/1 7: 16 PM: 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మార్క్రమ్(31) వికెట్‌ను మాత్రమే కోల్పోయి నిలకడగా ఆడుతుంది. మార్క్రమ్ను శార్ధూల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 17 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 66/1. క్రీజ్‌లో ఎల్గర్(21), కీగన్ పీటర్సన్(13) ఉన్నారు. దక్షిణాఫ్రికా టార్గెట్ 240 5: 30 PM: ఇన్నింగ్స్ ఆఖర్లో హనుమ విహారి(40 నాటౌట్) రాణించడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్, రబాడ, ఎంగిడి తలో మూడు వికెట్లు పడగొట్టగా ఒలీవియర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులకు ఆలౌటైంది. 218 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.. తొమ్మిదో వికెట్ డౌన్ 5: 11 PM: 245 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో బుమ్రా 7 పరుగులు చేసి జన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బుమ్రా ఔటైన అనంతరం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 4: 49 PM: జన్సెన్ టీమిండియాను మరో దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి టీమిండియా భారీ స్కోర్ ఆశలకు గండి కొట్టాడు. వెర్రిన్ క్యాచ్ పట్టడంతో షమీ.. సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 228 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో విహారి (12), బుమ్రా ఉన్నారు. శార్ధూల్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా 4: 38 PM: బౌలింగ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సఫారీలను గడగడలాడించిన శార్ధూల్ ఠాకూర్.. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. కేవలం 24 బంతుల్లోనే 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 28 పరుగులు స్కోర్ చేశాడు. అనంతరం జన్సెన్ బౌలింగ్‌లో కేశవ్ మహారాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 225 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో విహారి(10), షమీ ఉన్నారు. 3: 27 PM: మూడో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌కు లంచ్‌కు ముందు మరో షాక్ తగిలింది. ఎంగిడి బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్(16) ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 184 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి టీమిండియా 161 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. విహారి(6), శార్ధూల్ ఠాకూర్(4) క్రీజ్‌లో ఉన్నారు. 3: 07 PM: రిషభ్ పంత్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్‌లో వెరెనెకు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 2: 50 PM: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా రబడ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ టీమిండియాను దెబ్బకొట్టాడు. కాగా ఫామ్‌లోకి వచ్చి అర్ధ సెంచరీలు బాదిన భారత సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజారాను పెవిలియన్‌కు పంపాడు. 02: 42 PM: అజింక్య రహానే రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కగిసో రబడ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరెనెకు క్యాచ్ ఇచ్చి రహానే 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 155/3. ఆధిక్యం 128 పరుగులు. 2: 30 PM: అజింక్య రహానే కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు: 149/2. కాగా పుజారా, రహానే కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం 122 పరుగుల ఆధిక్యం. 2: 15 PM: తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన నయా వాల్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2: 08 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు: 134/2. అజింక్య రహానే(42), పుజారా(48) అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. 1: 30 PM: టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య వాండరర్స్ వేదికగా రెండో టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ఆరంభమైంది. 85/2 ఓవర్‌నైట్ స్కోరుతో భారత జట్టు ఆట మొదలుపెట్టింది. అజింక్య రహానే 11, ఛతేశ్వర్ పుజారా 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటిస్ జట్టును 229 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది. తుది జట్లు: భారత్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి. చదవండి: KL Rahul Vs Dean Elgar: డసెన్ తరహాలోనే కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై వివాదం.. కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్! -
Ind Vs Sa: వారెవ్వా.. వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ..
Ind Vs Sa 2nd Test: Shardul Thakur 5 Wicket Haul Wonders At Wanderers: గత ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టు... తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 186/6తో కష్టాల్లో పడిన స్థితిలో శార్దుల్ ఠాకూర్ కీలక అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. శార్దుల్, వాషింగ్టన్ సుందర్ 123 పరుగుల భాగస్వామ్యం చివర్లో భారత్ గెలుపునకు కీలకంగా మారింది. ఆ తర్వాత ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై మెరుపు బ్యాటింగ్‌తో రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు (57, 60) జట్టు విజయానికి కారణంగా నిలిచాయి. అయితే బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న శార్దుల్ నుంచి తొలి ఐదు టెస్టుల్లో సరైన బౌలింగ్ ప్రదర్శన ఇంకా రాలేదని భావిస్తుండగా తనేంటో అతను వాండరర్స్‌లో చూపించాడు. మొదటి స్పెల్‌లో 14 పరుగుల వ్యవధిలో 3 ప్రధాన వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టిన అతను, ప్రమాదకరంగా మారుతున్న నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసి మ్యాచ్‌ను మళ్లీ భారత్ వైపు తిప్పాడు. అదే జోరులో తర్వాతా మరో మూడు వికెట్లు శార్దుల్ ఖాతాలో చేరాయి. వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ అనూహ్యంగా అతను వికెట్లు పడగొట్టడం, మ్యాచ్‌లను మలుపు తిప్పిన క్షణాల కారణంగా సహచరులు ‘లార్డ్’ అంటూ అతనికి ముద్దు పేరు పెట్టారు. స్వల్ప కెరీర్లోనే శార్దుల్‌కు భిన్నమైన అనుభవాలు ఉన్నాయి. అప్పుడు తొలి టెస్టులో 10 బంతులు వేయగానే.. ఆరేళ్ల పాటు ముంబై తరఫున ప్రధాన పేసర్‌గా శార్దుల్ రాణించాడు. అయితే హైదరాబాద్‌లో ఆడిన తన తొలి టెస్టులో 10 బంతులు వేయగానే గాయం కారణంగా తప్పుకోవాల్సి రాగా, రెండేళ్ల తర్వాత గానీ మరో టెస్టు ఆడే అవకాశం రాలేదు. భారత జట్టు తరఫున తొలి వన్డే ఆడినప్పుడు సచిన్ జెర్సీ నంబర్ ‘10’ వేసుకొని బరిలోకి దిగినప్పుడు ‘అంత మొనగాడివా’ అంటూ భారత క్రికెట్ అభిమానులే తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తే బిత్తరపోయి వెంటనే నంబర్ మార్చుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ టీమ్ పంజాబ్ ఇక నీ అవసరం లేదంటూ లీగ్ మధ్యలో ఇంటికి పంపిస్తే బెదరకుండా ఫ్రాంచైజీపై బహిరంగ విమర్శలు చేసి మళ్లీ రంజీ ట్రోఫీకి వెళ్లి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. పట్టుదలతో ప్రతికూలతలను అధిగమించి జట్టులో రెగ్యులర్‌గా మారాడు. తాజా ప్రదర్శన బౌలర్‌గా శార్దుల్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని గొప్ప ప్రదర్శనలు చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ శార్దూల్! చదవండి: Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్‌లో ప్రొటిస్ ఆటగాడు అవుట్.. వివాదం! -
Ind Vs Sa 2nd Test: శార్దుల్ సప్తమి.. 7 వికెట్లు పడగొట్టిన పేసర్
Ind vs sa 2nd Test: India Lead By 58 Runs End Of Day 2: వాండరర్స్ మైదానంలో శార్దుల్ ఠాకూర్ వండర్ఫుల్ ప్రదర్శనతో మెరిశాడు. సఫారీ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్‌గా నిలుస్తూ ఏడు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కకుండా టీమిండియా నిలువరించగలిగింది. చేతిలో 8 వికెట్లతో మన జట్టు 58 పరుగులు ముందంజలో ఉండగా మూడో రోజు బ్యాటింగ్ కీలకం కానుంది. భారత బ్యాటర్లు ఎంత స్కోరు చేసి దక్షిణాఫ్రికాకు లక్ష్యం నిర్దేశిస్తారనేది ఆసక్తికరం. జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతూ 20 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మయాంక్ (23), రాహుల్ (8) అవుట్ కాగా... పుజారా (35 బ్యాటింగ్; 7 ఫోర్లు), రహానే (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన 27 పరుగులు పోగా, ప్రస్తుతం భారత్‌కు 58 పరుగుల ఆధిక్యం ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 35/1తో ఆట మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పీటర్సన్ (118 బంతుల్లో 62; 9 ఫోర్లు), తెంబా బవుమా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్ (7/61) చిరస్మరణీయ బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఎల్గర్ (120 బంతుల్లో 28; 4 ఫోర్లు), పీటర్సన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. అతి జాగ్రత్తగా ఆడిన ఎల్గర్ రెండో రోజు 32వ బంతికి గానీ మొదటి పరుగు తీయలేకపోగా, పీటర్సన్ కొన్ని చక్కటి షాట్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించగా, 103 బంతుల్లో పీటర్సన్ అర్ధ సెంచరీ పూర్తయింది. మంగళవారం రోజు భారత్ వేసిన తొలి 18 ఓవర్లలో శార్దుల్‌కు ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు. అయితే ఆ తర్వాత బంతిని అందుకున్న అతను అద్భుత స్పెల్‌తో ఆటను మార్చేశాడు. తన రెండో ఓవర్లోనే అతను ఎల్గర్‌ను వెనక్కి పంపాడు. మరో రెండు ఓవర్ల తర్వాత చక్కటి బంతితో పీటర్సన్‌ను అవుట్ చేసిన శార్దుల్... మరుసటి ఓవర్లో డసెన్ (1) పని పట్టాడు. లంచ్ సమయానికి శార్దుల్ స్పెల్ 4.4–3–8–3 కావడం విశేషం. ఆదుకున్న బవుమా... స్కోరు 102/4గా నిలిచిన స్థితిలో సఫారీ జట్టు ఇన్నింగ్స్‌ను బవుమా, కైల్ వెరీన్ (21) నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 60 పరుగులు జత చేశారు. అయితే శార్దుల్ మరోసారి రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. వెరీన్, బవుమా లను శార్దుల్ అవుట్ చేశాడు. టీ విరామం తర్వాత కేశవ్ (21), జాన్సెన్ (21) వేగంగా 38 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాకు ఆధిక్యాన్ని అందించారు. ఈ దశలో శార్దుల్ చెలరేగి ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు తీసి సఫారీల ఇన్నింగ్స్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 202; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పంత్ (బి) శార్దుల్ 28; మార్క్రమ్ (ఎల్బీ) (బి) షమీ 7; పీటర్సన్ (సి) మయాంక్ (బి) శార్దుల్ 62; డసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 1; బవుమా (సి) పంత్ (బి) శార్దుల్ 51; వెరీన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 21; జాన్సెన్ (సి) అశ్విన్ (బి) శార్దుల్ 21; రబడ (సి) సిరాజ్ (బి) షమీ 0; కేశవ్ (బి) బుమ్రా 21; ఒలీవియర్ (నాటౌట్) 1; ఎన్గిడి (సి) పంత్ (బి) శార్దుల్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 229. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–101, 4–102, 5–162, 6–177, 7–179, 8–217, 9–228, 10–229. బౌలింగ్: బుమ్రా 21–5–49–1, షమీ 21–5–52–2, సిరాజ్ 9.5–2–24–0, శార్దుల్ 17.5–3–61–7, అశ్విన్ 10–1–35–0. భారత్ రెండో ఇన్నింగ్స్: 85/2 -
Rahul Dravid: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్‌కోచ్!
సెంచూరియన్‌లో చారిత్రాత్మక విజయంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సన్నద్ధమవుతోంది టీమిండియా. వాండరర్స్‌లో తమకున్న అద్బుత రికార్డును కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి డుమ్మా కొట్టాడు. దీంతో బోర్డుతో కోహ్లికి మళ్లీ విభేదాలేమైనా తలెత్తాయా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ద్రవిడ్ మాట్లాడుతూ... ‘‘కోహ్లి గైర్హాజరీకి ప్రత్యేకంగా కారణాలేమీ లేవు. వందో టెస్టుకు ముందు తను మాట్లాడతాడేమో. ఆ అరుదైన మైలురాయిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. 100వ టెస్టు నేపథ్యంలో మీరు తనను ప్రశ్నలు అడగవచ్చు’’ అని సమాధానమిచ్చాడు. ఇక వాండరర్స్ పిచ్ గురించి చెబుతూ... సెంచూరియన్‌లో ఉన్నంత బౌన్సీగా వికెట్ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా జనవరి 3న ఆరంభం కానున్న రెండో టెస్టు కోహ్లికి 99వది. ఇక ఈ టెస్టులో గనుక టీమిండియా విజయం సాధిస్తే సఫారీ గడ్డమీద టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత జట్టుగా కోహ్లి సేన సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. చదవండి: Vamika Kohli: మ.. మ్మా అంటున్న వామిక... ఎంత క్యూట్‌గా ఉందో... ఫొటో కూడా షేర్ చేయండి వదినా అంటూ Ind Vs Sa 2nd Test: అక్కడ ఒక్కసారి కూడా భారత్ టెస్టు ఓడలేదు.. వాళ్లిద్దరికీ సూపర్ రికార్డు.. కాబట్టి -
Ind Vs Sa 2nd Test: ప్రొటిస్‌కు అత్యధిక పరాజయాలు ఇక్కడే.. మరి ఈసారి?
Ind Vs Sa Test Series: ఆత్మవిశ్వాసంతో టీమిండియా... ఎదురుదెబ్బల నడుమ దక్షిణాఫ్రికా రెండో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్నాయి. జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ ఇందుకు వేదిక. ఈ మైదానంలో టీమిండియా ఇంతవరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మరి.. ప్రొటిస్ రికార్డు ఇక్కడ ఎలా ఉందంటే... ►అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాక స్వదేశంలో వాండరర్స్ మైదానంలోనే దక్షిణాఫ్రికా అత్యధిక పరాజయాలు చవిచూసింది. ఓవరాల్‌గా ఈ వేదికపై దక్షిణాఫ్రికా 31 టెస్టులు ఆడింది. 11 టెస్టుల్లో ఓడి, 14 టెస్టుల్లో గెలిచింది, ఆరు టెస్టులు ‘డ్రా’ చేసుకుంది. ఇక రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు నమోదు చేయగలిగే రికార్డులు ఇవే ► ఈ మ్యాచ్‌లో మరో 6 వికెట్లు తీస్తే కపిల్‌దేవ్ (434 వికెట్లు)ను మూడో స్థానానికి నెట్టి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (ప్రస్తుతం 429 వికెట్లు) గుర్తింపు పొందుతాడు. 619 వికెట్లతో అనిల్ కుంబ్లే టాపర్‌గా ఉన్నాడు. ► మరో 146 పరుగులు సాధిస్తే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. కోహ్లి ఇప్పటివరకు 98 టెస్టులు ఆడి 7,854 పరుగులు సాధించాడు. చదవండి: SA vs IND: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు Ind Vs Sa 2nd Test: అక్కడ ఒక్కసారి కూడా భారత్ టెస్టు ఓడలేదు.. వాళ్లిద్దరికీ సూపర్ రికార్డు.. కాబట్టి -
Ind Vs Sa 2nd Test: అక్కడ భారత్ ఒక్క టెస్టు కూడా ఓడలేదు.. కాబట్టి...
Ind Vs Sa 2nd Test At Wanderers Stadium: సెంచూరియన్ నుంచి జొహన్నస్‌బర్గ్‌కు దూరం కేవలం 41 కిలోమీటర్లు. కానీ... ఈ ప్రయాణంలో టీమిండియా టెస్టు జట్టుకు దక్కిన మధురానుభూతులు మాత్రం వెలకట్టలేనివి. డిసెంబరు 30 వరకు సూపర్‌స్పోర్ట్ పార్కులో ఇంతవరకు ఏ ఆసియా జట్టు సాధించలేని ఘనతను తొలి టెస్టు విజయంతో అందుకుంది కోహ్లి సేన. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు రెండో టెస్టుకు వేదికైన వాండరర్స్‌కు పయనమైంది. ఇక్కడ ఇంతవరకు టీమిండియా ఒక్క టెస్టు కూడా ఓడిపోకపోవడం విశేషం. జనవరి 3 నుంచి దక్షిణాఫ్రికా- భారత్ మధ్య రెండో టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జొహన్నస్‌బర్గ్‌లో ఉన్న రికార్డును గనుక కొనసాగిస్తే సరికొత్త సృష్టించడం ఖాయం. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి టీమిండియా సారథిగా విరాట్ కోహ్లి రికార్డులకెక్కుతాడు. మరి వాండరర్స్‌లో టీమిండియా టెస్టు రికార్డు ఎలా ఉందంటే! ►ఇప్పటివరకు ఈ మైదానంలో భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడింది. ►ఇందులో 2 టెస్టులు గెలవగా.. మూడింటిని డ్రా చేసుకుంది. ఒక్కటి కూడా ఓడిపోలేదు. ►ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కోహ్లికి మంచి మంచి రికార్డు ఉంది. వీళ్లిద్దరికీ ఇది లక్కీ గ్రౌండ్ అని చెప్పవచ్చు. ►1997 నాటి సిరీస్‌లో భాగంగా ద్రవిడ్ ఇక్కడ 148 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అదే విధంగా 2006లో టీమిండియా కెప్టెన్‌గా ఇదే మైదానంలో మొట్టమొదటి టెస్టు విజయం నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. సదరు మ్యాచ్‌లో 123 పరుగులతో భారత్ జయకేతనం ఎగురవేసింది. ►ఇక విరాట్ కోహ్లికి కూడా ఈ మైదానం ప్రత్యేకమే. సారథిగా 2018లో వాండరర్స్‌లో గెలుపుతోనే విదేశీ గడ్డమీద విజయపరంపర మొదలైంది. ►ఇక మొదటి టెస్టులో జోరు మీదున్న కోహ్లి సేన... తమకు అచ్చొచ్చిన వాండరర్స్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందనడంలో సందేహం లేదు. చదవండి: IPL 2022 Auction: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని కోరుకుంటున్నారు... ఇప్పటికే రాయుడు, అశ్విన్... -
‘పూర్’ వాండరర్స్!
దుబాయ్: అనూహ్యమైన బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఒక ఆటాడుకున్న జొహన్నెస్‌బర్గ్ పిచ్‌పై ఊహించినట్లుగానే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టుకు వేదికగా నిలిచిన వాండరర్స్ మైదానాన్ని ‘నాసిరకం’గా గుర్తిస్తూ ఐసీసీ హెచ్చరిక జారీ చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు క్రికెటర్లు పలు మార్లు గాయాలకు గురి కావడంతో అంపైర్లు, రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ‘వాండరర్స్ స్టేడియం పిచ్ నాసిరకంగా ఉందని ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ గుర్తిస్తూ ‘పూర్’ రేటింగ్ ఇచ్చారు. ఈ పిచ్‌కు మూడు డీ మెరిట్ పాయింట్లు శిక్షగా విధించారు’ అని ఐసీసీ ప్రకటించింది. సాధారణంకంటే తక్కువ ప్రమాణాలతో ఉండే పిచ్‌లకే ఐసీసీ ఒక డీ మెరిట్ పాయింట్ శిక్షగా విధిస్తున్న నేపథ్యంలో మూడు డీ మెరిట్ పాయింట్లు ఇవ్వడం వాండరర్స్ పరిస్థితికి ఉదాహరణ. ఐదేళ్ల వ్యవధిలో డీ మెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరితే ఆ మైదానంలో ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచ్ జరగకుండా నిషేధం పడుతుంది. -
టీమిండియా అసంతృప్తి.. వెంటనే ఫిర్యాదు!
జొహన్నెస్‌బర్గ్ : అసలే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలపాలైన విరాట్ కోహ్లీ సేన జొహన్నెస్ బర్గ్‌లో జరగనున్న మూడో టెస్టులో విజయం సాధించాలని భావిస్తోంది. 24న వాండరర్స్ మైదానంలో ప్రారంభం కానున్న మూడో టెస్ట్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. బౌలర్లు భువనేశ్వర్, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ కొంతసేపు బౌలింగ్ సాధన చేశారు. అయితే అక్కడే ఉన్న బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రాక్టీస్ పిచ్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేందుకు పిచ్ అనుకూలంగా లేదని క్యూరేటర్లకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నుంచి టీమిండియా కసరత్తులు మొదలుపెట్టగా.. ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసిన మూడు పిచ్‌లను పరిశీలించిన బంగర్ భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. చీఫ్ క్యూరేటర్ బూటియల్ బూటెలెజితో సమస్యను చర్చించిన రవిశాస్త్రి ప్రాక్టీస్ వికెట్లను మళ్లీ రోలింగ్ చేసి సిద్ధం చేయాలని సూచించారు. రీ రోలింగ్ చేసి ప్రాక్టీస్ పిచ్ మళ్లీ తయారు చేయగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం. బంతి బౌన్స్ అవ్వడం లేదని, బ్యాట్‌పైకి కూడా రాకపోవడంతో బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడతారని గమనించి రీ రోలింగ్ చేయమని సూచించినట్లు కోచ్ బృందం వెల్లడించింది. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం ఫాస్ట్, బౌన్సీ పిచ్ భారత ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తోందని సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. చీఫ్ క్యూరేటర్ సైతం డుస్లెసిస్ నిర్ణయానికి కట్టుబడి పిచ్ సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరి టెస్టుల్లో నెగ్గి సిరీస్ దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించాలని కోహ్లీ సేన భావిస్తోంది. -
ప్రాక్టీస్ జోరుగా...
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ మూడో టెస్టులోనైనా మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉంది. ఈ నెల 24 నుంచి ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆదివారం వారంతా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. సెంచూరియన్ పరాజయం తర్వాత మూడు రోజులు విశ్రాంతి తీసుకొని సరదాగా విహరించిన జట్టు సభ్యులంతా నెట్స్‌కు హాజరై చెమటోడ్చారు. ఫుట్‌బాల్ ఆడి వార్మప్ చేసిన తర్వాత ముందుగా జట్టు ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టింది. పార్థివ్, రాహుల్, రహానే, రోహిత్, దినేశ్ కార్తీక్‌లతో కోచ్ ఆర్. శ్రీధర్ స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించారు. మంగళవారమే జొహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రాక్టీస్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని బంతులు విసరగా రాహుల్, విజయ్, పుజారా ఒకేసారి సాధన చేశారు. విజయ్, రాహుల్‌కు స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ఎక్కువ సేపు బౌలింగ్ చేశారు. అనంతరం కోహ్లి, రహానే, పాండ్యా బ్యాటింగ్‌కు దిగారు. తొలి రెండు టెస్టులకు జట్టులో స్థానం లభించని రహానే చాలా సేపు ఆడటం విశేషం. ప్రధాన పేసర్లు భువీ, షమీ వీరికి బౌలింగ్ చేశారు. మరో వైపు పిచ్‌పై ఉన్న పచ్చికను ఆదివారం కొంతవరకు తొలగించారు. ‘వికెట్‌పై తగినంత పచ్చిక ఉంచాం. మ్యాచ్‌కు ముందు దీనిని తగ్గించకపోవచ్చు. సరిపోయేంత నీటిని కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి సెంచూరియన్ తరహాలో పొడిబారిపోయే ప్రమాదం లేదు. దక్షిణాఫ్రికా జట్టు కోరిక మేరకే దీనిని సిద్ధం చేశాం. పేస్, బౌన్స్‌కు పిచ్ అనుకూలంగా ఉంటుంది’ అని వాండరర్స్ క్యురేటర్ బేతుల్ బుతెలెజి చెప్పారు. -
‘యువ’ శాసనం
ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం... దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పరుగుల ప్రవాహం సృష్టించారు. భారత అభిమానులే నమ్మలేకపోయినా ఇది నిజం... సఫారీలను వాళ్ల సొంతగడ్డపై ధోనిసేన శాసించే స్థితిలో ఉంది. మహామహుల్లాంటి భారత క్రికెట్ దిగ్గజాలు తడబడ్డ చోట... యువకులు కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. భారత భవిష్యత్‌కు పరీక్షలా భావించిన సిరీస్‌లో దుమ్మురేపుతున్నారు. సంచలన ఆటతీరుతో దక్షిణాఫ్రికాపై అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తొలి టెస్టులో భారత్ విజయం సాధించడం లాంఛనమే అనుకోవాలి. జొహన్నెస్‌బర్గ్: తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 36 పరుగుల ఆధిక్యం... రెండో ఇన్నింగ్స్‌లో ధోనిసేన స్కోరు ఇప్పటికే 284/2... మూడో రోజు ముగిసేసరికే మొత్తం 320 పరుగుల ఆధిక్యం... ఈ అంకెలు చాలు సఫారీ గడ్డపై యువ భారత్ ఎంత అద్భుతంగా ఆడిందో చెప్పడానికి. దక్షిణాఫ్రికాతో వాండరర్స్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ శాసించే స్థితికి చేరింది. మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (221 బంతుల్లో 135 బ్యాటింగ్; 18 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి (132 బంతుల్లో 77 బ్యాటింగ్; 8 ఫోర్లు) మరో శతకం దిశగా సాగుతున్నాడు. పుజారా, కోహ్లి జోడి మూడో వికెట్‌కు అజేయంగా 191 పరుగులు జోడించింది. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 75.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటయింది. దీంతో ధోనిసేనకు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యం లభించింది. ‘కమ్‌బ్యాక్ హీరో’ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ నాలుగేసి వికెట్లతో చెలరేగి భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. చుట్టేసిన జహీర్: 213/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టును జహీర్ వణికించాడు. పిచ్‌పై ఉండే తేమను తనకు అనుకూలంగా మల్చుకుంటూ రౌండ్ ద వికెట్ బౌలింగ్‌తో చెలరేగాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ (77 బంతుల్లో 20; 1 ఫోర్) నెమ్మదిగా ఆడేందుకు ప్రాధాన్యమిస్తే... ఫిలాండర్ (86 బంతుల్లో 59; 7 ఫోర్లు) దూకుడును ప్రదర్శించినా... జహీర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏడో వికెట్‌కు నెలకొన్న 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రెండో ఎండ్‌లో ఇషాంత్ కూడా మెరుగ్గా బౌలింగ్ చేయడంతో సఫారీ వికెట్ల పతనం వేగంగా కొనసాగింది. కేవలం గంటలోపే దక్షిణాఫ్రికా ఓవర్‌నైట్ స్కోరుకు మరో 31 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లను చేజార్చుకుంది. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. వికెట్ కోల్పోయినా...: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో లంచ్‌కు కొద్ది ముందు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను ఆరంభంలోనే ప్రొటీస్ పేసర్లు దెబ్బతీశారు. ధావన్ (21 బంతుల్లో 15; 1 ఫోర్) ఫిలాండర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ దశలో విజయ్ (94 బంతుల్లో 39; 5 ఫోర్లు)తో జతకలిసిన పుజారా ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా కుదురుగానే ఆడాడు. ఈ ఇద్దరూ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించాక కలిస్ బౌలింగ్‌లో విజయ్ అవుటయ్యాడు. పుజారాతో జత కట్టిన కోహ్లి టీ విరామానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ద్వయం దంచేసింది: టీ విరామం తర్వాత భారత జోడి పుజారా, కోహ్లి దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించింది. 127 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన పుజారా... ఆ తర్వాత మరింత వేగంగా ఆడి 168 బంతుల్లో సెంచరీ చేశాడు. అంటే రెండో 50 పరుగులు పుజారా కేవలం 41 బంతుల్లోనే చేశాడు. మరో ఎండ్‌లో కోహ్లి తొలి ఇన్నింగ్స్ ఫామ్‌ను కొనసాగించాడు. 74 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. పుజారా, కోహ్లిలకు ఒక్కో లైఫ్ లభించింది. ఈ ఒక్క పొరపాటు మినహా భారత జోడి ఆటలో వంక పెట్టడానికి కూడా వీలు లేదు. అంత చక్కగా ఆడారు. చివరి సెషన్లో ఈ జోడీ దూకుడుతో భారత్ ఏకంగా 175 పరుగులు చేసింది. పుజారా ఒక్కడే చివరి సెషన్లో 96 పరుగులు చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 280; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 68; పీటర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 21; ఆమ్లా (బి) ఇషాంత్ 36; కలిస్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 13; డుమిని (సి) విజయ్ (బి) షమీ 2; డు ప్లెసిస్ (సి) ధోని (బి) జహీర్ 20; ఫిలాండర్ (సి) అశ్విన్ (బి) జహీర్ 59; స్టెయిన్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 10; మోర్నీ మోర్కెల్ (బి) జహీర్ 7; తాహిర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (75.3 ఓవర్లలో ఆలౌట్) 244. వికెట్ల పతనం: 1-37; 2-130; 3-130; 4-130; 5-145; 6-146; 7-226; 8-237; 9-239; 10-244. బౌలింగ్: జహీర్ 26.3-6-88-4; షమీ 18-3-48-2; ఇషాంత్ 25-5-79-4; అశ్విన్ 6-0-25-0 భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) కలిస్ (బి) ఫిలాండర్ 15; విజయ్ (సి) డివిలియర్స్ (బి) కలిస్ 39; పుజారా బ్యాటింగ్ 135; కోహ్లి బ్యాటింగ్ 77; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (78 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 284 వికెట్ల పతనం: 1-23; 2-93. బౌలింగ్: స్టెయిన్ 21-4-64-0; ఫిలాండర్ 18-5-53-1; మోర్నీ మోర్కెల్ 2-1-4-0; కలిస్ 14-4-51-1; తాహిర్ 11-0-55-0; డివిలియర్స్ 1-0-5-0; డుమిని 11-0-42-0. మోర్కెల్‌కు గాయం దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ భారత రెండో ఇన్నింగ్స్‌లో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేశాడు. లంచ్‌కు ముందు ఫీల్డింగ్ చేస్తుండగా అతడి కుడి చీలమండ బెణికింది. దీంతో ఆటగాళ్లు బయటకు మోసుకెళ్లారు. ఇక ఈ ఇన్నింగ్స్‌లో తను బౌలింగ్ చేయలేడు. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని జట్టు వర్గాలు తెలిపాయి. ఫిలాండర్ రికార్డు దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో వేగంగా వంద వికెట్లు తీసిన బౌల ర్గా ఫిలాండర్ రికార్డు సాధిం చాడు. 19వ టెస్టులో తను ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్లలో జాబితా లో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నాడు. సువర్ణావకాశం దక్షిణాఫ్రికాలో టెస్టు గెలవడానికి భారత్‌కు ఇంతకంటే మంచి అవకాశం రాదు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో... చేతిలో ఎనిమిది వికెట్లు, 320 పరుగుల ఆధిక్యం ఉన్నాయి. వరుసగా రెండు, మూడు రోజుల ఆట గమనిస్తే... తొలి గంట ఆట కీలకం కానుంది. ఉదయం సెషన్లోనే వికెట్లు టపటపా పడుతున్నాయి. కాకపోతే రెండు రోజుల్లోనూ టెయిలెండర్ల వికెట్లు ఎక్కువగా పడ్డాయి. ఇక నాలుగో రోజు ఉదయం సెషన్ ఆట చాలా కీలకం. భారత ఆటగాళ్లు ఈ సెషన్లో జాగ్రత్తగా ఆడితే... రెండో సెషన్లో ఒక గంటసేపు బ్యాటింగ్ చేసినా... ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాకు 450 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. ఇంత లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా కష్టమే కాబట్టి... భారత్ సురక్షితంగా ఉంటుంది. తొలి ఇన్నింగ్స్ తరహాలో మన బౌలర్లు చెలరేగితే ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించొచ్చు. అటు మోర్కెల్ లేకపోవడం దక్షిణాఫ్రికాకు పెద్ద సమస్య అయితే... పిచ్ క్రమంగా నెమ్మదిస్తుండటం భారత బౌలర్లను ఊరిస్తోంది. జహీర్, షమీ రివర్స్ స్వింగ్ రాబట్టడంలో నిపుణులు. ఇక పిచ్ నెమ్మదిస్తే అశ్విన్ ఉండనే ఉన్నాడు. కాబట్టి భారత్‌కు ఇది సువర్ణావకాశం. ఈ మ్యాచ్ గెలిస్తే... 1-0 ఆధిక్యంతో రెండో టెస్టుకు డర్బన్ వెళ్లొచ్చు. ఆ మ్యాచ్‌ను జాగ్రత్తగా ఆడి డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఈ సువర్ణావకాశాన్ని ధోనిసేన జారవిడుచుకోకూడదు. 299 జహీర్‌ఖాన్ టెస్టుల్లో 299 వికెట్లు తీశాడు. మరొక్క వికెట్ తీస్తే 300 మైలురాయిని చేరుకున్న నాలుగో భారత బౌలర్ అవుతాడు. 6 టెస్టుల్లో పుజారాకు ఇది ఆరో సెంచరీ. దక్షిణాఫ్రికాపై మొదటిది సెషన్-1 ఓవర్లు: 9.3; పరుగులు: 31; వికెట్లు: 4 (దక్షిణాఫ్రికా) ఓవర్లు: 14; పరుగులు: 31; వికెట్లు: 1 (భారత్) సెషన్-2 ఓవర్లు: 26; పరుగులు 78; వికెట్లు: 1 సెషన్-3 ఓవర్లు: 38; పరుగులు: 175; వికెట్లు: 0 -
తొలి వన్డేలో భారత్ చిత్తు
జొహన్నెస్‌బర్గ్‌లో గురువారం తుపాన్‌కు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అసలు తుపాన్ అయితే రాలేదు కానీ... దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పరుగుల సునామీ సృష్టించారు. డి కాక్, ఆమ్లా పునాది వేస్తే... దానిపై డివిలియర్స్, డుమిని పరుగుల పండుగ చేసుకున్నారు. బేలగా మారిన భారత బౌలర్లను సఫారీలు ఆటాడుకున్నారు. భారత బ్యాటింగ్ సరికొత్త హీరో రోహిత్ శర్మ బంతిని బ్యాట్‌తో తాకించడానికి 16 బంతులు తీసుకుంటే... ఇన్నింగ్స్ తొలి బౌన్సర్కే ధావన్ వెనుదిరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది... దక్షిణాఫ్రికాలో తమకు లభించిన ఈ తరహా స్వాగతానికి భారత బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. ఐదుగురు పేసర్లు వేస్తున్న బంతులు బుల్లెట్ల తరహాలో దూసుకొస్తుంటే ఈసారి ఇంతే అనుకుంటూ కాడి పడేశారు. జొహన్నెస్‌బర్గ్: వరుసగా ఆరు వన్డే టోర్నీ విజయాలతో అద్భుత ఫామ్‌తో దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన భారత కుర్రాళ్లు వాస్తవంలోకి వచ్చేశారు. మొదటినుంచి భయపడ్డట్లుగానే అక్కడి బౌన్స్, స్వింగ్ జట్టు జోరుకు బంధనాలు వేశాయి. ఫలితంగా ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా 141 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారత్ 41 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. క్వాంటన్ డి కాక్ (121 బంతుల్లో 135; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాషిమ్ ఆమ్లా (88 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 152 పరుగులు జోడించగా... చివర్లో డివిలియర్స్ (47 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుమిని (29 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోయారు. భారత ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (71 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం డర్బన్‌లో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే పెద్దగా అనుభవం లేని భారత స్వింగ్ బౌలర్లు మోహిత్ శర్మ, భువనేశ్వర్ పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాంతో దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఆమ్లా, డి కాక్ తమ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్‌తో వీరిద్దరు అవుట్ కాకుండా తప్పించుకోగలిగారు. అతి దగ్గరినుంచి ధావన్ రనౌట్ చేయలేకపోగా...క్యాచ్ పట్టడంలో రోహిత్ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఓపెనర్లలో ఆమ్లా ఎక్కువగా నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిస్తే... 20 ఏళ్ల కుర్రాడు డి కాక్ దూకుడుగా ఆడాడు. జోడిని విడదీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ప్రభావం చూపలేకపోయారు. చివరకు భారీ భాగస్వామ్యం తర్వాత 30వ ఓవర్లో ఆమ్లాను అవుట్ చేసి షమీ జట్టుకు తొలి వికెట్ అందించాడు. ఆ వెంటనే కలిస్ (10) కూడా వెనుదిరిగాడు. సిక్సర్ల మోత... మరోవైపు ధాటిగా ఆడిన డి కాక్ 101 బంతుల్లో కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి రెండో ఎండ్‌లో డివిలియర్స్ కూడా జోరు పెంచాడు. చివరకు పార్ట్ టైమర్ కోహ్లి, డి కాక్‌ను పెవిలియన్ పంపించాడు. అయితే భారత్ ఆనందం అక్కడే ఆవిరైంది. 44 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోరు 258/3. ఆఖరి 6 ఓవర్లు టీమిండియాపై సఫారీలు సవారీ చేశారు. డివిలియర్స్, డుమిని కలిసి సిక్సర్ల మోత మోగించారు. ఫలితంగా చివరి ఆరు ఓవర్లలో వరుసగా 16, 16, 20, 12, 23, 13 (మొత్తం 100 పరుగులు) వచ్చాయి. ఇందులో డుమిని 5 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు బాదగా... తనకే సాధ్యమైన వైవిధ్యమైన షాట్లతో డివిలియర్స్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు కలిసి 46 బంతుల్లోనే 105 పరుగులు జోడించడం విశేషం. మెరుపు బౌలింగ్... వరుసగా శుభారంభాలు ఇస్తూ వచ్చిన రోహిత్ శర్మ (43 బంతుల్లో 18; 2 ఫోర్లు), ధావన్ (12) జోడి ఈ మ్యాచ్‌లో తడబడింది. రోహిత్ అయితే ప్రతీ బంతికి తడబడ్డాడు. స్టెయిన్ వేసిన తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌గా ఆడిన రోహిత్ ఎట్టకేలకు 17వ బంతికి మొదటి పరుగు తీశాడు. ధావన్‌ను మోర్కెల్ అవుట్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద డి కాక్ క్యాచ్ వదిలేయడంతో బయటపడ్డ కోహ్లి (35 బంతుల్లో 31; 5 ఫోర్లు) కొన్ని చక్కని షాట్లతో అలరించాడు. అయితే కోహ్లితో పాటు యువరాజ్ (0)ను ఒకే ఓవర్లో అవుట్ చేసి మెక్లారెన్ దెబ్బ తీశాడు. తర్వాతి ఓవర్లోనే రోహిత్... కొద్ది సేపటికి రైనా (14) రనౌటయ్యారు. ఈ దశలో ధోని, జడేజా (30 బంతుల్లో 29; 6 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా భారత్ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (బి) షమీ 65; డి కాక్ (సి) అండ్ (బి) కోహ్లి 135; కలిస్ (సి) జడేజా (బి) షమీ 10; డివిలియర్స్ (బి) షమీ 77; డుమిని (నాటౌట్) 59; మిల్లర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 358 వికెట్ల పతనం: 1-152; 2-172; 3-247; 4-352. బౌలింగ్: మోహిత్ శర్మ 10-0-82-0; భువనేశ్వర్ 9-0-68-0; షమీ 10-1-68-3; అశ్విన్ 10-0-58-0; జడేజా 8-0-58-0; రైనా 1-0-7-0; కోహ్లి 2-0-15-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 18; ధావన్ (సి) డి కాక్ (బి) మోర్కెల్ 12; కోహ్లి (సి) కలిస్ (బి) మెక్లారెన్ 31; యువరాజ్ (బి) మెక్లారెన్ 0; రైనా (రనౌట్) 14; ధోని (బి) స్టెయిన్ 65; జడేజా (బి) కలిస్ 29; అశ్విన్ (సి) డి కాక్ (బి) మెక్లారెన్ 19; భువనేశ్వర్ (సి) కలిస్ (బి) స్టెయిన్ 0; మోహిత్ (నాటౌట్) 0; షమీ (సి) అండ్ (బి) స్టెయిన్ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 217 వికెట్ల పతనం: 1-14; 2-60; 3-60; 4-65; 5-108; 6-158; 7-183; 8-190; 9-217; 10-217. బౌలింగ్: స్టెయిన్ 8-3-25-3; సోట్సోబ్ 9-0-52-0; మోర్కెల్ 8-1-29-1; మెక్లారెన్ 8-0-49-3; పార్నెల్ 5-0-37-0; కలిస్ 3-0-20-1. వాండరర్స్ గులాబీమయం తొలి వన్డే జరిగిన వాండరర్స్ మైదానమంతా గులాబీ రంగుతో నిండిపోయింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలో భాగంగా నిర్వాహకులు ఈ గురువారాన్ని ‘పింక్ డే’గా నిర్వహించారు. దక్షిణాఫ్రికా జట్టు మొత్తం పింక్ డ్రెస్ వేసుకోవడంతో పాటు హెల్మెట్, బ్యాట్లపై గ్రిప్‌ను కూడా పింక్‌తో నింపేశారు. భారత ఆటగాళ్లు తమ భుజాలకు గులాబీ రంగు రిబ్బన్ ధరించారు. స్పాన్సర్ హోర్డింగ్‌లను కూడా అదే రంగుతో ముంచెత్తారు.