Ind Vs Sa 2nd Test 2022: మూడేళ్ల క్రితం... భారత్‌తో ఇదే మైదానంలో చివరి టెస్టు. 241 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా స్కోరు ఒక దశలో 124/1...అయితే 177 పరుగులకే కుప్పకూలిన సఫారీ టీమ్ చివరకు 63 పరుగులతో ఓడింది... నాడు డీన్ ఎల్గర్ 86 పరుగులతో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. ఈ సారి అదే వాండరర్స్‌లో దాదాపు అదే లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఎల్గర్ మళ్లీ ఆ తప్పు చేయలేదు.
నాటి ఇన్నింగ్స్‌ను కొనసాగింపుగానా అన్నట్లు కెప్టెన్ హోదాలో ఎల్గర్ కఠినమైన పిచ్‌పై మరింత పట్టుదలగా నిలబడ్డాడు. సహచర బ్యాటర్లు అండగా నిలవడంతో 96 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపలేదని అనిపిస్తున్నా... మొత్తంగా చూస్తే జట్టు బ్యాటింగ్ వైఫల్యమే ఈ పరాజయానికి కారణమనేది వాస్తవం.
జొహన్నెస్‌బర్గ్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ తుది ఫలితం మూడో టెస్టుకు చేరింది. గురువారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. వాండరర్స్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. 240 పరుగుల లక్ష్యఛేదనలో విజయం కోసం మరో 122 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డీన్ ఎల్గర్ (188 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...వాన్ డర్ డసెన్ (40), తెంబా బవుమా (23 నాటౌట్) అండగా నిలిచారు. మూడో టెస్టు ఈ నెల 11నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది.
వర్షం ఆలస్యం చేసినా...
ఓవర్‌నైట్ స్కోరు 118/2తో మైదానంలోకి దిగేందుకు దక్షిణాఫ్రికా సిద్ధం కాగా, వాన ఆ అవకాశం ఇవ్వలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముందు తొలి సెషన్ రద్దు కాగా, ఆపై లంచ్ తర్వాతి సెషన్‌లో ఆటకు అవకాశం లేకుండా పోయింది. ఆపై వర్షం తగ్గాక మైదానం సిద్ధమైంది. పిచ్‌ను పరిశీంచిన అంపైర్లు కనీసం 34 ఓవర్ల ఆట జరిగే అవకాశం ఉందని తేల్చారు. చివరకు దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలుచుకుంది. ఎల్గర్, వాన్ డర్ డసెన్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.
మన బౌలర్లు అప్పుడప్పుడు అద్భుతమైన బంతులు వేసినా... పట్టుదలగా నిలిచిన సఫారీ బ్యాటర్లు వాటికి లొంగలేదు. ఎల్గర్, డసెన్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఎట్టకేలకు డసెన్‌ను అవుట్ చేసి షమీ కాస్త ఆశలు రేపాడు. అయితే తర్వాత వచ్చిన బవుమా కూడా తగ్గలేదు. ‘సున్నా’ వద్ద తన బౌలింగ్‌లోనే శార్దుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన బవుమా తర్వాత ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అశ్విన్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా ఆడి ఎల్గర్ బౌండరీ కొట్టడంతో దక్షిణాఫ్రికా గెలుపు పూర్తయింది.
స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 202; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 229;
భారత్ రెండో ఇన్నింగ్స్ 266; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (ఎల్బీ) (బి) శార్దుల్ 31; ఎల్గర్ (నాటౌట్) 96; కీగన్ పీటర్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 28; వాన్ డర్ డసెన్ (సి) పుజారా (బి) షమీ 40; బవుమా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (67.4 ఓవర్లలో 3 వికెట్లకు) 243.
వికెట్ల పతనం: 1–47, 2–93, 3–175.
బౌలింగ్: బుమ్రా 17–2– 70–0, షమీ 17–3–55–1, శార్దుల్ 16–2–47–1, సిరాజ్ 6–0–37–0, అశ్విన్ 11.4–2–26–1.
Comments
Please login to add a commentAdd a comment