Ind Vs Sa 2nd Wanderers Test: Day 3 Updates
మూడో రోజు ముగిసిన ఆట.. లక్ష్యం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికా
240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. కెప్టెన్ డీన్ ఎల్గర్(46 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతనికి తోడుగా వాన్ డర్ డస్సెన్(11) క్రీజ్‌లో ఉన్నాడు. రేపటి ఆటలో సఫారీ జట్టు మరో 122 పరుగులు చేస్తే మ్యాచ్ గెలవడంతో పాటు సిరీస్ ఆశలను కూడా సజీవంగా ఉంచుకోగలుగుతుంది. మరోవైపు టీమిండియాకు సైతం చరిత్ర సృష్టించేందుకు అవకాశాలు లేకపోలేదు. నాలుగో రోజు భారత బౌలర్లు మరో ఎనిమిది వికెట్లు పడగొడితే మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా వశమవుతుంది.
రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
లక్ష్యం దిశగా సాగుతున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అడ్డుకట్ట వేశాడు. 93 పరుగుల వద్ద కీగన్ పీటర్సన్(28)ను ఎల్బీడబ్లూ చేయడంతో ఆ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో అశ్విన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వాండరర్స్ మైదానంలో కుంబ్లే తర్వాత వికెట్ తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 28 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 93/2. క్రీజ్‌లో ఎల్గర్(32), వాన్ డర్ డస్సెన్ ఉన్నారు.
టార్గెట్ 240.. దక్షిణాఫ్రికా 66/1
7: 16 PM: 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మార్క్రమ్(31) వికెట్‌ను మాత్రమే కోల్పోయి నిలకడగా ఆడుతుంది. మార్క్రమ్‌ను శార్ధూల్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 17 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 66/1. క్రీజ్‌లో ఎల్గర్(21), కీగన్ పీటర్సన్(13) ఉన్నారు.
దక్షిణాఫ్రికా టార్గెట్ 240
5: 30 PM: ఇన్నింగ్స్ ఆఖర్లో హనుమ విహారి(40 నాటౌట్) రాణించడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్, రబాడ, ఎంగిడి తలో మూడు వికెట్లు పడగొట్టగా ఒలీవియర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 229 పరుగులకు ఆలౌటైంది.
218 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.. తొమ్మిదో వికెట్ డౌన్
5: 11 PM: 245 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో బుమ్రా 7 పరుగులు చేసి జన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బుమ్రా ఔటైన అనంతరం టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
4: 49 PM: జన్సెన్ టీమిండియాను మరో దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి టీమిండియా భారీ స్కోర్ ఆశలకు గండి కొట్టాడు. వెర్రిన్ క్యాచ్ పట్టడంతో షమీ.. సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 228 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో విహారి (12), బుమ్రా ఉన్నారు.
శార్ధూల్ ఔట్.. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
4: 38 PM: బౌలింగ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సఫారీలను గడగడలాడించిన శార్ధూల్ ఠాకూర్.. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. కేవలం 24 బంతుల్లోనే 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 28 పరుగులు స్కోర్ చేశాడు. అనంతరం జన్సెన్ బౌలింగ్‌లో కేశవ్ మహారాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 225 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో విహారి(10), షమీ ఉన్నారు.
3: 27 PM: మూడో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌కు లంచ్‌కు ముందు మరో షాక్ తగిలింది. ఎంగిడి బౌలింగ్‌లో వెర్రిన్‌కు క్యాచ్ ఇచ్చి అశ్విన్(16) ఔటయ్యాడు. ఫలితంగా టీమిండియా 184 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. లంచ్ విరామం సమయానికి టీమిండియా 161 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. విహారి(6), శార్ధూల్ ఠాకూర్(4) క్రీజ్‌లో ఉన్నారు.
3: 07 PM: రిషభ్ పంత్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్‌లో వెరెనెకు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
2: 50 PM: నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
రబడ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ టీమిండియాను దెబ్బకొట్టాడు. కాగా ఫామ్‌లోకి వచ్చి అర్ధ సెంచరీలు బాదిన భారత సీనియర్ ఆటగాళ్లు రహానే, పుజారాను పెవిలియన్‌కు పంపాడు.
02: 42 PM:
అజింక్య రహానే రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కగిసో రబడ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వెరెనెకు క్యాచ్ ఇచ్చి రహానే 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. హనుమ విహారి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 155/3. ఆధిక్యం 128 పరుగులు.
2: 30 PM:
అజింక్య రహానే కూడా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు: 149/2. కాగా పుజారా, రహానే కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం 122 పరుగుల ఆధిక్యం.
2: 15 PM:
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన నయా వాల్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
2: 08 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు: 134/2.
అజింక్య రహానే(42), పుజారా(48) అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 107 పరుగుల ఆధిక్యంలో ఉంది.
1: 30 PM: టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య వాండరర్స్ వేదికగా రెండో టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ఆరంభమైంది. 85/2 ఓవర్‌నైట్ స్కోరుతో భారత జట్టు ఆట మొదలుపెట్టింది. అజింక్య రహానే 11, ఛతేశ్వర్ పుజారా 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 58 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటిస్ జట్టును 229 పరుగులకు టీమిండియా ఆలౌట్ చేసింది.
తుది జట్లు:
భారత్:
కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా:
డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్ కీపర్), మార్కో జాన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువానే ఒలివర్, లుంగి ఎంగిడి.
Comments
Please login to add a commentAdd a comment