South Africa vs India, 1st Test Day 2 Update: టీమిండియాతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సరికి పదకొండు పరుగుల లీడ్‌లో ఉంది. కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై వెటనర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో.. ప్రొటిస్ జట్టు టీమిండియాపై పైచేయి సాధించింది.
బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ సేన 208/8 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆటను ఆరంభించింది. కేఎల్ రాహుల్ సెంచరీ(101) పూర్తి చేసుకోగా.. 245 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. అరంగేట్ర ఫాస్ట్‌బౌలర్ నండ్రీ బర్గర్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సెన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ వికెట్ కోల్పోయింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు నిష్క్రమించాడు.
అయితే, మరో ఓపెనర్ డీన్ ఎల్గర్, యువ బ్యాటర్ టోనీ డీ జోర్జితో కలిసి మెరుగైన స్కోరుకు పునాది వేశాడు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో తొలుత టోనీని 28 పరుగులకు.. ఆ తర్వాత అతడి స్థానంలో వచ్చిన కీగాన్ పీటర్సన్ 2 పరుగులకే వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికా మరో రెండు రెండు వికెట్లు కోల్పోయింది.
ఇలాంటి దశలో ఎల్గర్‌కు జతకలిసిన అరంగేట్ర బ్యాటర్ డేవిడ్ బెడింగ్హామ్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో ఎల్గర్.. 42.1 ఓవర్ వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఎల్గర్‌తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన బెడింగ్హామ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 60.1వ ఓవర్ వద్ద సిరాజ్ అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఎల్గర్- బెడింగ్హామ్ 131 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
దీంతో రోహిత్ సేనకు కాస్త ఊరట లభించగా.. ఆ మరుసటి రెండో ఓవర్లో అరంగేట్ర బౌలర్ ప్రసిద్ కృష్ణ వికెట్ తీసి జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. 61.5వ ఓవర్ వద్ద వెరైన్‌ను అవుట్ చేసి అంతర్జాతీయ టెస్టుల్లో తొలి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. వెరైన్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా డ్రింక్స్ బ్రేక్(64వ ఓవర్) సమయానికి 254 పరుగులు సాధించింది.
ఈ క్రమంలో సెంచరీ వీరుడు ఎల్గర్‌కు జతైన మార్కో జాన్సెస్ వికెట్ పడకుండా జాగ్రత్త పడగా.. ఎల్గర్ సైతం ఆచితూచి ఆడాడు. అయితే, సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 66వ ఓవర్ వద్ద వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత రెండో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు.
అప్పటికి సౌతాఫ్రికా పదకొండు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్నాయి. డీన్ ఎల్గర్ 140, జాన్సెన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలోనూ సౌతాఫ్రికా టీమిండియాపై ఇలా ఆధిపత్యం చాటుకుంది.
Comments
Please login to add a commentAdd a comment