Shardul Thakur 7 Wickets: IND Vs SA 2nd Test, Shardul Thakur Wanderers With Seven Wickets - Sakshi
Sakshi News home page

Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్‌.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు!

Published Wed, Jan 5 2022 7:19 AM | Last Updated on Wed, Jan 5 2022 9:27 AM

Shardul Thakur: From Lords To Wanderers Did Wonders 5 Wicket Haul - Sakshi

Ind Vs Sa 2nd Test: Shardul Thakur 5 Wicket Haul Wonders At Wanderers: గత ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌ టెస్టు... తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 186/6తో కష్టాల్లో పడిన స్థితిలో శార్దుల్‌ ఠాకూర్‌ కీలక అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. శార్దుల్, వాషింగ్టన్‌ సుందర్‌ 123 పరుగుల భాగస్వామ్యం చివర్లో భారత్‌ గెలుపునకు కీలకంగా మారింది. ఆ తర్వాత ఓవల్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై మెరుపు బ్యాటింగ్‌తో రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు (57, 60) జట్టు విజయానికి కారణంగా నిలిచాయి.

అయితే బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న శార్దుల్‌ నుంచి తొలి ఐదు టెస్టుల్లో సరైన బౌలింగ్‌ ప్రదర్శన ఇంకా రాలేదని భావిస్తుండగా తనేంటో అతను వాండరర్స్‌లో చూపించాడు. మొదటి స్పెల్‌లో 14 పరుగుల వ్యవధిలో 3 ప్రధాన వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టిన అతను, ప్రమాదకరంగా మారుతున్న నాలుగో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీసి మ్యాచ్‌ను మళ్లీ భారత్‌ వైపు తిప్పాడు.

అదే జోరులో తర్వాతా మరో మూడు వికెట్లు శార్దుల్‌ ఖాతాలో చేరాయి. వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ అనూహ్యంగా అతను వికెట్లు పడగొట్టడం, మ్యాచ్‌లను మలుపు తిప్పిన క్షణాల కారణంగా సహచరులు ‘లార్డ్‌’ అంటూ అతనికి ముద్దు పేరు పెట్టారు. స్వల్ప కెరీర్‌లోనే శార్దుల్‌కు భిన్నమైన అనుభవాలు ఉన్నాయి.

అప్పుడు తొలి టెస్టులో 10 బంతులు వేయగానే..
ఆరేళ్ల పాటు ముంబై తరఫున ప్రధాన పేసర్‌గా శార్దుల్‌ రాణించాడు. అయితే హైదరాబాద్‌లో ఆడిన తన తొలి టెస్టులో 10 బంతులు వేయగానే గాయం కారణంగా తప్పుకోవాల్సి రాగా, రెండేళ్ల తర్వాత గానీ మరో టెస్టు ఆడే అవకాశం రాలేదు. భారత జట్టు తరఫున తొలి వన్డే ఆడినప్పుడు సచిన్‌ జెర్సీ నంబర్‌ ‘10’ వేసుకొని బరిలోకి దిగినప్పుడు ‘అంత మొనగాడివా’ అంటూ భారత క్రికెట్‌ అభిమానులే తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తే బిత్తరపోయి వెంటనే నంబర్‌ మార్చుకోవాల్సి వచ్చింది.

ఐపీఎల్‌ టీమ్‌ పంజాబ్‌ ఇక నీ అవసరం లేదంటూ లీగ్‌ మధ్యలో ఇంటికి పంపిస్తే బెదరకుండా ఫ్రాంచైజీపై బహిరంగ విమర్శలు చేసి మళ్లీ రంజీ ట్రోఫీకి వెళ్లి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. పట్టుదలతో ప్రతికూలతలను అధిగమించి జట్టులో రెగ్యులర్‌గా మారాడు. తాజా ప్రదర్శన బౌలర్‌గా శార్దుల్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని గొప్ప ప్రదర్శనలు చేయాలని కోరుకుందాం. ఆల్‌ ది బెస్ట్‌ శార్దూల్‌!

చదవండి: Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్‌లో ప్రొటిస్‌ ఆటగాడు అవుట్‌.. వివాదం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement