Ind vs sa 2nd Test: India Lead By 58 Runs End Of Day 2: వాండరర్స్ మైదానంలో శార్దుల్ ఠాకూర్ వండర్‌ఫుల్ ప్రదర్శనతో మెరిశాడు. సఫారీ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్‌గా నిలుస్తూ ఏడు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కకుండా టీమిండియా నిలువరించగలిగింది. చేతిలో 8 వికెట్లతో మన జట్టు 58 పరుగులు ముందంజలో ఉండగా మూడో రోజు బ్యాటింగ్ కీలకం కానుంది. భారత బ్యాటర్లు ఎంత స్కోరు చేసి దక్షిణాఫ్రికాకు లక్ష్యం నిర్దేశిస్తారనేది ఆసక్తికరం.
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతూ 20 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మయాంక్ (23), రాహుల్ (8) అవుట్ కాగా... పుజారా (35 బ్యాటింగ్; 7 ఫోర్లు), రహానే (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన 27 పరుగులు పోగా, ప్రస్తుతం భారత్‌కు 58 పరుగుల ఆధిక్యం ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 35/1తో ఆట మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు ఆలౌటైంది.
ఫలితంగా ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పీటర్సన్ (118 బంతుల్లో 62; 9 ఫోర్లు), తెంబా బవుమా (60 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్ (7/61) చిరస్మరణీయ బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగాడు. ఓవర్‌నైట్ బ్యాటర్లు ఎల్గర్ (120 బంతుల్లో 28; 4 ఫోర్లు), పీటర్సన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. అతి జాగ్రత్తగా ఆడిన ఎల్గర్ రెండో రోజు 32వ బంతికి గానీ మొదటి పరుగు తీయలేకపోగా, పీటర్సన్ కొన్ని చక్కటి షాట్లు కొట్టాడు.
వీరిద్దరు రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించగా, 103 బంతుల్లో పీటర్సన్ అర్ధ సెంచరీ పూర్తయింది. మంగళవారం రోజు భారత్ వేసిన తొలి 18 ఓవర్లలో శార్దుల్‌కు ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు. అయితే ఆ తర్వాత బంతిని అందుకున్న అతను అద్భుత స్పెల్‌తో ఆటను మార్చేశాడు. తన రెండో ఓవర్లోనే అతను ఎల్గర్‌ను వెనక్కి పంపాడు. మరో రెండు ఓవర్ల తర్వాత చక్కటి బంతితో పీటర్సన్‌ను అవుట్ చేసిన శార్దుల్... మరుసటి ఓవర్లో డసెన్ (1) పని పట్టాడు. లంచ్ సమయానికి శార్దుల్ స్పెల్ 4.4–3–8–3 కావడం విశేషం.
ఆదుకున్న బవుమా...
స్కోరు 102/4గా నిలిచిన స్థితిలో సఫారీ జట్టు ఇన్నింగ్స్‌ను బవుమా, కైల్ వెరీన్ (21) నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 60 పరుగులు జత చేశారు. అయితే శార్దుల్ మరోసారి రెండు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. వెరీన్, బవుమా లను శార్దుల్ అవుట్ చేశాడు. టీ విరామం తర్వాత కేశవ్ (21), జాన్సెన్ (21) వేగంగా 38 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాకు ఆధిక్యాన్ని అందించారు. ఈ దశలో శార్దుల్ చెలరేగి ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు తీసి సఫారీల ఇన్నింగ్స్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 202; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (సి) పంత్ (బి) శార్దుల్ 28; మార్క్‌రమ్ (ఎల్బీ) (బి) షమీ 7; పీటర్సన్ (సి) మయాంక్ (బి) శార్దుల్ 62; డసెన్ (సి) పంత్ (బి) శార్దుల్ 1; బవుమా (సి) పంత్ (బి) శార్దుల్ 51; వెరీన్ (ఎల్బీ) (బి) శార్దుల్ 21; జాన్సెన్ (సి) అశ్విన్ (బి) శార్దుల్ 21; రబడ (సి) సిరాజ్ (బి) షమీ 0; కేశవ్ (బి) బుమ్రా 21; ఒలీవియర్ (నాటౌట్) 1; ఎన్‌గిడి (సి) పంత్ (బి) శార్దుల్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 229.
వికెట్ల పతనం: 1–14, 2–88, 3–101, 4–102, 5–162, 6–177, 7–179, 8–217, 9–228, 10–229.
బౌలింగ్: బుమ్రా 21–5–49–1, షమీ 21–5–52–2, సిరాజ్ 9.5–2–24–0, శార్దుల్ 17.5–3–61–7, అశ్విన్ 10–1–35–0.
భారత్ రెండో ఇన్నింగ్స్: 85/2
Comments
Please login to add a commentAdd a comment