‘యువ’ శాసనం | Cheteshwar Pujara slams first Test ton on foreign soil | Sakshi
Sakshi News home page

‘యువ’ శాసనం

Published Sat, Dec 21 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

పుజారా, విరాట్ కోహ్లి

పుజారా, విరాట్ కోహ్లి

ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం... దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పరుగుల ప్రవాహం సృష్టించారు. భారత అభిమానులే నమ్మలేకపోయినా ఇది నిజం... సఫారీలను వాళ్ల సొంతగడ్డపై ధోనిసేన శాసించే స్థితిలో ఉంది. మహామహుల్లాంటి భారత క్రికెట్ దిగ్గజాలు తడబడ్డ చోట... యువకులు కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. భారత భవిష్యత్‌కు పరీక్షలా భావించిన సిరీస్‌లో దుమ్మురేపుతున్నారు. సంచలన ఆటతీరుతో దక్షిణాఫ్రికాపై అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తొలి టెస్టులో భారత్ విజయం సాధించడం లాంఛనమే అనుకోవాలి.
 
 జొహన్నెస్‌బర్గ్: తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 36 పరుగుల ఆధిక్యం... రెండో ఇన్నింగ్స్‌లో ధోనిసేన స్కోరు ఇప్పటికే 284/2... మూడో రోజు ముగిసేసరికే మొత్తం 320 పరుగుల ఆధిక్యం... ఈ అంకెలు చాలు సఫారీ గడ్డపై యువ భారత్ ఎంత అద్భుతంగా ఆడిందో చెప్పడానికి. దక్షిణాఫ్రికాతో వాండరర్స్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ శాసించే స్థితికి చేరింది.
 
 
  మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (221 బంతుల్లో 135 బ్యాటింగ్; 18 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి (132 బంతుల్లో 77 బ్యాటింగ్; 8 ఫోర్లు) మరో శతకం దిశగా సాగుతున్నాడు. పుజారా, కోహ్లి జోడి మూడో వికెట్‌కు అజేయంగా 191 పరుగులు జోడించింది. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 75.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటయింది. దీంతో ధోనిసేనకు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యం లభించింది. ‘కమ్‌బ్యాక్ హీరో’ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ నాలుగేసి వికెట్లతో చెలరేగి భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు.
 
 చుట్టేసిన జహీర్: 213/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టును జహీర్ వణికించాడు. పిచ్‌పై ఉండే తేమను తనకు అనుకూలంగా మల్చుకుంటూ రౌండ్ ద వికెట్ బౌలింగ్‌తో చెలరేగాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ (77 బంతుల్లో 20; 1 ఫోర్) నెమ్మదిగా ఆడేందుకు ప్రాధాన్యమిస్తే... ఫిలాండర్ (86 బంతుల్లో 59; 7 ఫోర్లు) దూకుడును ప్రదర్శించినా... జహీర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏడో వికెట్‌కు నెలకొన్న 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రెండో ఎండ్‌లో ఇషాంత్ కూడా మెరుగ్గా బౌలింగ్ చేయడంతో సఫారీ వికెట్ల పతనం వేగంగా కొనసాగింది.  కేవలం గంటలోపే దక్షిణాఫ్రికా ఓవర్‌నైట్ స్కోరుకు మరో 31 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లను చేజార్చుకుంది. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు.
 వికెట్ కోల్పోయినా...: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో లంచ్‌కు కొద్ది ముందు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను ఆరంభంలోనే ప్రొటీస్ పేసర్లు దెబ్బతీశారు. ధావన్ (21 బంతుల్లో 15; 1 ఫోర్) ఫిలాండర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ దశలో విజయ్ (94 బంతుల్లో 39; 5 ఫోర్లు)తో జతకలిసిన పుజారా ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా కుదురుగానే ఆడాడు. ఈ ఇద్దరూ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించాక కలిస్ బౌలింగ్‌లో విజయ్ అవుటయ్యాడు. పుజారాతో జత కట్టిన కోహ్లి టీ విరామానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.
 
 ద్వయం దంచేసింది: టీ విరామం తర్వాత భారత జోడి పుజారా, కోహ్లి దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించింది. 127 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన పుజారా... ఆ తర్వాత మరింత వేగంగా ఆడి 168 బంతుల్లో సెంచరీ చేశాడు. అంటే రెండో 50 పరుగులు పుజారా కేవలం 41 బంతుల్లోనే చేశాడు. మరో ఎండ్‌లో కోహ్లి తొలి ఇన్నింగ్స్ ఫామ్‌ను కొనసాగించాడు. 74 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. పుజారా, కోహ్లిలకు ఒక్కో లైఫ్ లభించింది. ఈ ఒక్క పొరపాటు మినహా భారత జోడి ఆటలో వంక పెట్టడానికి కూడా వీలు లేదు. అంత చక్కగా ఆడారు. చివరి సెషన్‌లో ఈ జోడీ దూకుడుతో భారత్ ఏకంగా 175 పరుగులు చేసింది. పుజారా ఒక్కడే చివరి సెషన్‌లో 96 పరుగులు చేశాడు.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 280; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 68; పీటర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 21; ఆమ్లా (బి) ఇషాంత్ 36; కలిస్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 13; డుమిని (సి) విజయ్ (బి) షమీ 2; డు ప్లెసిస్ (సి) ధోని (బి) జహీర్ 20; ఫిలాండర్ (సి) అశ్విన్ (బి) జహీర్ 59; స్టెయిన్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 10; మోర్నీ మోర్కెల్ (బి) జహీర్ 7; తాహిర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (75.3 ఓవర్లలో ఆలౌట్) 244.
 వికెట్ల పతనం: 1-37; 2-130; 3-130; 4-130; 5-145; 6-146; 7-226; 8-237; 9-239; 10-244.
 
 బౌలింగ్: జహీర్ 26.3-6-88-4; షమీ 18-3-48-2; ఇషాంత్ 25-5-79-4; అశ్విన్ 6-0-25-0
 భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) కలిస్ (బి) ఫిలాండర్ 15; విజయ్ (సి) డివిలియర్స్ (బి) కలిస్ 39; పుజారా బ్యాటింగ్ 135; కోహ్లి బ్యాటింగ్ 77; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (78 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 284
 వికెట్ల పతనం: 1-23; 2-93.
 బౌలింగ్: స్టెయిన్ 21-4-64-0; ఫిలాండర్ 18-5-53-1; మోర్నీ మోర్కెల్ 2-1-4-0; కలిస్ 14-4-51-1; తాహిర్ 11-0-55-0; డివిలియర్స్ 1-0-5-0; డుమిని  11-0-42-0.
 
 మోర్కెల్‌కు గాయం
 దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ భారత రెండో ఇన్నింగ్స్‌లో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేశాడు. లంచ్‌కు ముందు ఫీల్డింగ్ చేస్తుండగా అతడి కుడి చీలమండ బెణికింది. దీంతో ఆటగాళ్లు బయటకు మోసుకెళ్లారు. ఇక ఈ ఇన్నింగ్స్‌లో తను బౌలింగ్ చేయలేడు. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని జట్టు వర్గాలు తెలిపాయి.
 
 ఫిలాండర్ రికార్డు
 దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో వేగంగా వంద వికెట్లు తీసిన బౌల ర్‌గా ఫిలాండర్ రికార్డు సాధిం చాడు. 19వ టెస్టులో తను ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్లలో జాబితా లో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నాడు.
 
 సువర్ణావకాశం
 దక్షిణాఫ్రికాలో టెస్టు గెలవడానికి భారత్‌కు ఇంతకంటే మంచి అవకాశం రాదు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో... చేతిలో ఎనిమిది వికెట్లు, 320 పరుగుల ఆధిక్యం ఉన్నాయి. వరుసగా రెండు, మూడు రోజుల ఆట గమనిస్తే... తొలి గంట ఆట కీలకం కానుంది. ఉదయం సెషన్‌లోనే వికెట్లు టపటపా పడుతున్నాయి. కాకపోతే రెండు రోజుల్లోనూ టెయిలెండర్ల వికెట్లు ఎక్కువగా పడ్డాయి. ఇక నాలుగో రోజు ఉదయం సెషన్ ఆట చాలా కీలకం. భారత ఆటగాళ్లు ఈ సెషన్‌లో జాగ్రత్తగా ఆడితే... రెండో సెషన్‌లో ఒక గంటసేపు బ్యాటింగ్ చేసినా... ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాకు 450 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు.
 
 
 ఇంత లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా కష్టమే కాబట్టి... భారత్ సురక్షితంగా ఉంటుంది. తొలి ఇన్నింగ్స్ తరహాలో మన బౌలర్లు చెలరేగితే ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించొచ్చు. అటు మోర్కెల్ లేకపోవడం దక్షిణాఫ్రికాకు పెద్ద సమస్య అయితే... పిచ్ క్రమంగా నెమ్మదిస్తుండటం భారత బౌలర్లను ఊరిస్తోంది. జహీర్, షమీ రివర్స్ స్వింగ్ రాబట్టడంలో నిపుణులు. ఇక పిచ్ నెమ్మదిస్తే అశ్విన్ ఉండనే ఉన్నాడు. కాబట్టి భారత్‌కు ఇది సువర్ణావకాశం. ఈ మ్యాచ్ గెలిస్తే... 1-0 ఆధిక్యంతో రెండో టెస్టుకు డర్బన్ వెళ్లొచ్చు. ఆ మ్యాచ్‌ను జాగ్రత్తగా ఆడి డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఈ సువర్ణావకాశాన్ని ధోనిసేన జారవిడుచుకోకూడదు.
 
 299 జహీర్‌ఖాన్ టెస్టుల్లో 299 వికెట్లు తీశాడు. మరొక్క వికెట్ తీస్తే 300 మైలురాయిని చేరుకున్న నాలుగో భారత బౌలర్ అవుతాడు.
 
 6 టెస్టుల్లో  పుజారాకు ఇది ఆరో సెంచరీ. దక్షిణాఫ్రికాపై మొదటిది
 
 సెషన్-1     ఓవర్లు: 9.3; పరుగులు: 31; వికెట్లు: 4 (దక్షిణాఫ్రికా)
                  ఓవర్లు: 14; పరుగులు: 31; వికెట్లు: 1 (భారత్)
 
 సెషన్-2    ఓవర్లు: 26; పరుగులు 78; వికెట్లు: 1
 
 సెషన్-3    ఓవర్లు: 38; పరుగులు: 175; వికెట్లు: 0
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement