బోల్ట్‌కంటే ధోనికే ఎక్కువ!
‘ఫోర్బ్స్’ విలువైన ఆటగాళ్ల జాబితా
జొహన్నెస్‌బర్గ్: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ‘ఆర్థికంగా విలువైన ఆటగాళ్ల’ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ ప్రకటించిన వివరాల ప్రకారం 2013లో ధోని 21 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 126 కోట్లు) ఆర్జించాడు. ఈ జాబితాలో ప్రపంచంలో ఫాస్టెస్ట్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌ను కూడా ధోని స్వల్ప తేడాతో వెనక్కి నెట్టడం విశేషం.
బోల్ట్ సంపాదన 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 120 కోట్లు)గా ఉంది. ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్, గోల్ఫ్ ఆటగాడు టైగర్‌వుడ్స్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరు ఒక్కొక్కరు 46 మిలియన్ డాలర్లు (రూ. 276 కోట్లు) ఆర్జిస్తున్నారు. బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ రెండో స్థానంలో ఉండగా... ఫిల్ మికెల్సన్ (గోల్ఫ్), షరపోవా (టెన్నిస్) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.