కూర్పు కోసం కసరత్తు
భారత్ తొలి వార్మప్ మ్యాచ్ నేడు
పటిష్టమైన శ్రీలంకతో ఢీ
టి20 ప్రపంచకప్
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లు... జట్టులో పెరిగిన ఆల్‌రౌండర్లు... కావలసినంత మంది పార్ట్‌టైమ్ బౌలర్లు... ఈ నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌లో ఎలాంటి కూర్పుతో భారత్ బరిలోకి దిగాలి..? ఇదే ధోని ముందున్న పెద్ద సమస్య. దీనిని పరిష్కరించుకోవడానికి భారత్‌కు రెండు అవకాశాలు ఉన్నాయి. ప్రధాన మ్యాచ్‌లకు ముందు శ్రీలంక, ఇంగ్లండ్‌లతో ధోనిసేన వార్మప్ మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇందులో భాగంగా నేడు తొలి వార్మప్ మ్యాచ్‌లో పటిష్టమైన శ్రీలంకతో తలపడుతుంది.
మిర్పూర్: వరుస పరాజయాలతో కుదేలైన భారత జట్టు టి20 ప్రపంచకప్‌ను తాజాగా ప్రారంభించాలని భావిస్తోంది. ఐపీఎల్ పుణ్యమాని తమకు బాగా అలవాటైన పొట్టి ఫార్మాట్‌తో తిరిగి గాడిలో పడాలని యోచిస్తోంది.
ఇటీవలీ కాలంలో బాగా పెరిగిన విమర్శలకు అడ్డుక ట్ట వేయాలంటే ధోనిసేనకు ఓ మంచి విజయం అవసరం. దానికి సరైన వేదిక టి20 ప్రపంచకప్. పాకిస్థాన్‌తో 21న జరిగే తమ తొలి మ్యాచ్‌కు ముందు ఆటతీరును సరిచూసుకోవడానికి వార్మప్ మ్యాచ్‌లను భారత్ ఉపయోగించుకోవాలి. షేర్ ఎ బంగ్లా స్టేడియంలో సోమవారం శ్రీలంకతో జరిగే తొలి వార్మప్ మ్యాచ్ ధోనిసేన సత్తాకు పరీక్షగా భావించాలి. చండీమల్ సారథ్యంలోని లంక జట్టు పటిష్టంగా ఉంది.
15 మందికీ అవకాశం
వార్మప్ మ్యాచ్ కాబట్టి 11 మందినే ఆడించాలనే నిబంధన ఉండదు. ఎవరైనా 11 మంది బ్యాటింగ్ చేయొచ్చు. ఎవరైనా 11 మంది ఫీల్డింగ్ చేయొచ్చు. అంటే జట్టులో ఉండే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అందరూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే బౌలర్లంతా కూడా 20 ఓవర్లలోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి దాదాపుగా జట్టులో ఉన్న ఆటగాళ్లలో కొందరికైనా సత్తా నిరూపించుకునే అవకాశం ఉంటుంది.
ఆల్‌రౌండర్లు ఫుల్
ప్రస్తుతం భారత జట్టులో ఆల్‌రౌండర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. యువరాజ్, జడేజా, బిన్నీ రూపంలో ముగ్గురు అందుబాటులో ఉన్నారు. అలాగే అశ్విన్‌నూ ఆల్‌రౌండర్‌గానే పరిగణిస్తే ఈ సంఖ్య నాలుగుకు చేరుతుంది. అలాగే రోహిత్, రైనా పార్ట్‌టైమర్లుగా పనికొస్తారు. ఎలాగూ 20 ఓవర్లే కాబట్టి కేవలం ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, పార్ట్‌టైమ్ బౌలర్లు కలిసి కోటా పూర్తి చేయొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ తుది జట్టులో స్థానం కోసం తీవ్రంగానే పోటీ ఉంది. కాబట్టి వార్మప్ మ్యాచ్‌లలో రాణించడం కీలకం.
సమతూకంతో శ్రీలంక
అటు శ్రీలంక జట్టు సీనియర్లు, కొత్తవాళ్లతో సమతూకంగా కనిపిస్తోంది. సంగక్కర, జయవర్ధనేలతో పాటు... గాయం నుంచి కోలుకున్న దిల్షాన్ జట్టులోకి వచ్చాడు. ఆల్‌రౌండర్లు మాథ్యూస్, తిషార పెరీరా ఆ జట్టుకు పెద్ద బలం.
ఇక బౌలింగ్‌లో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే సేననాయకే, మెండిస్, హెరాత్‌ల రూపంలో ముగ్గురు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు సిద్ధంగా ఉన్నారు ఎలాంటి పిచ్‌పైనైనా మలింగ బౌలింగ్‌లో ఆడటం కష్టమే. కాబట్టి బలమైన శ్రీలంకతో భారత్ తొలి వార్మప్ మ్యాచ్ ఆడబోతుండటం ఒక రకంగా సత్తాను సరిచూసుకోవడానికి సరైన అవకాశంగా భావించాలి.
జట్లు
భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, యువరాజ్, రైనా, రహానే, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఆరోన్, బిన్నీ, మిశ్రా, మోహిత్ శర్మ.
శ్రీలంక: చండీమల్ (కెప్టెన్), దిల్షాన్, కుశాల్ పెరీరా, సంగక్కర, జయవర్ధనే, మాథ్యూస్, తిషార పెరీరా, మెండిస్, మలింగ, సేననాయకే, హెరాత్, కులశేఖర, లక్మల్, ప్రసన్న, తిరిమన్నె.
ప్రాక్టీస్‌కు కొత్త ‘రంగు: ఫతుల్లా: భారత క్రికెటర్లు హోళీకి ముందు కొత్త ‘రంగు’లో కనిపించారు. ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు పసుపు పచ్చ రంగు జెర్సీలతో పాల్గొన్నారు. మ్యాచ్‌ల్లో భారత జట్టు ఆడే దుస్తుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా... ప్రాక్టీస్ సెషన్స్ కోసం ధరించే దుస్తులను కొత్తగా డిజైన్ చేశారు.
షర్ట్ ముందు భాగంలో పసుపు రంగులో, వెనక భాగం పర్షియన్ బ్లూ రంగులో డిజైన్ చేశారు. ట్రాక్ ప్యాంట్స్‌ను స్కై బ్లూ రంగులో తయారు చేశారు. దుస్తుల మార్పు వెనక ప్రత్యేక కార ణమేం లేదని, ప్రాక్టీస్‌కు కొత్త కళ రావడం కోసమేనని జట్టు మీడియా మేనేజర్ చెప్పారు.