‘తీస్రా’... అంటే మైండ్‌గేమే: నరైన్
మిర్పూర్: స్పిన్ బౌలింగ్‌లో ‘తీస్రా’ అనేదే లేదని కేవలం అది మైండ్‌గేమ్ మాత్రమేనని వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు తీస్రా అజ్మల్ (పాక్) చేతిలో ఉన్న అస్త్రమేమీ కాదని బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేసేందుకు పన్నిన మైండ్‌గేమే అని వివరించాడు.
సంప్రదాయ ఆఫ్ స్పిన్‌కు దూస్రా, తీస్రాలేవీ భిన్నమైనవి కావని అన్నాడు. ‘బ్యాట్స్‌మెన్‌ను బంతితో కంటే బుర్రతో పడేసే ఆటే ‘తీస్రా’. క్రికెట్ అనేది బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ గేమ్. బౌలర్లకే తక్కువ అవకాశాలు. అందుకనే ఇలాంటి మైండ్‌గేమ్‌లను ఆడతారు. నా బౌలింగ్‌లో ఆశ్యర్యకర డెలివరీలు, అంతుచిక్కని బంతులంటూ ఉండవు. కేవలం సాధ్యమైనంత మెరుగ్గా బౌలింగ్ చేయడమే నా లక్ష్యం.
ఆసియాకప్‌లో భారత స్పిన్నర్ అశ్విన్ నా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించినట్లు విన్నాను. నేనైతే అతని బౌలింగ్ యాక్షన్ చూడలేదు. కాబట్టే కామెంట్ చేయను. అయినా ఎవరి ఇష్టం మేరకు వారి బౌలింగ్ శైలి ఉంటుంది.
ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. పొలార్డ్ లేకపోయినా సత్తాగల ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.