పారాలింపిక్ విజేతలకు నజరానా
సచిన్ చేతుల మీదుగా రూ.15 లక్షల చొప్పున అందజేత
ముంబై: రియో పారాలింపిక్స్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో రాణించిన నలుగురు విజేతలకు సోమవారం ఘనసన్మానం జరగడంతో పాటు నజరానా అందించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. స్వర్ణాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర జజారియాలతో పాటు రజతం అందుకున్న దీపా మలిక్, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ భటిలకు రూ.15 లక్షల చొప్పున చెక్‌లను అందించారు. అంతేకాకుండా ఇంతకుముందు జరిగిన పారాలింపిక్స్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారికి కూడా ఈ నజరానా అందనుంది.
వీరిలో మురళీకాంత్ పేట్కర్ (1972), భీమ్‌రావ్ కేస్కర్, జోగిందర్ సింగ్ బేడి (1984), రాజిందర్ సింగ్ రహేలు (2004), హెచ్‌ఎన్ గిరీష (2012) ఉన్నారు. అలాగే పారాలింపిక్ అథ్లెట్లకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న గోస్పోర్‌ట్స ఫౌండేషన్‌కు రూ.35 లక్షలను అందించారు. ‘ఇది చాలా ప్రత్యేక సమయం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ఓ భారతీయుడిగా మీ నలుగురు విజేతలను చూసి గర్విస్తున్నాను. మొత్తం ప్రపంచమంతా మిమ్మల్ని అంగవైకల్యం ఉన్న వారిగా పిలిచినా నా దృష్టిలో మాత్రం అత్యద్భుతమైన శక్తిసామర్థ్యంగలవారు’ అని సచిన్ కొనియాడారు.
అలాగే ప్రతిసారి ఈ గేమ్స్‌ను పారాలింపిక్స్‌గా పిలవడం బాధిస్తోందని, నిజానికి వీటిని ఒలింపిక్స్ పారాలింపిక్స్‌గా పిలవాలని దీపా మలిక్ అభిప్రాయపడింది. ఇవి కూడా ఒలింపిక్ స్థాయి పోటీలేనని గుర్తుచేసింది. ఇక విజేతలకు ఇచ్చిన నజరానాల మొత్తాన్ని సచిన్‌తోపాటు వి.చాముండేశ్వరీనాథ్ (హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు), నిమ్మగడ్డ ప్రసాద్ (కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని.. పారిశ్రామికవేత్త), డాక్టర్ ఆజాద్ మూపెన్ (ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ సీఎండీ), సం జయ్ ఘోడవత్ (సంజయ్ ఘోడవత్ గ్రూప్ చైర్మన్), అభయ్ గాడ్గిల్ (అభయ్ గాడ్గిల్ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్) కలిసి నిధిగా ఏర్పాటు చేశారు.
రియో పారాలింపిక్స్ విజేతలకు నజరానాలతో పాటు స్మార్ట్రాన్ మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను బహూకరించారు. దీంతోపాటు వారికి జీవితకాలం ఆరోగ్య సేవలను అందిస్తామని ఏస్టర్ డీఎం హెల్త్‌కేర్ ప్రకటించింది.