Rio Paralympics
-
దీపకు రూ. 4 కోట్ల నజరానా
గుర్గావ్ (హరియాణా): రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించిన హరియాణా షాట్‌పుట్ క్రీడాకారిణి దీపా మలిక్‌కు రూ. 4 కోట్ల నజరానా అందజేశారు. హరియణా రాష్ట్ర స్వర్ణోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో దీపా మలిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ భారీ మొత్తాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి, ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, క్రీడల మంత్రి అనిల్ విజ్ పాల్గొన్నారు. రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్ షాట్‌పుట్‌లో ఇనుప గుండును 4.61 మీటర్ల దూరం విసిరి రజతం సాధించింది. తద్వారా ఈ మెగా ఈమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. -
పారాలింపియన్లకు సన్మానం
నగదు బహుమతులు అందజేసిన ‘సుమధుర’ గ్రూపు హైదరాబాద్: రియో పారాలింపిక్స్ పతక విజేతలను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. బంగారు పతకాలు గెలిచిన దేవేంద్ర జజారియా (జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (హైజంప్)తో పాటు కాంస్యం నెగ్గిన వరుణ్ సింగ్ భటి (హైజంప్)లను ‘సుమధుర’ అక్రొపొలిస్ గ్రూప్ ఘనంగా సన్మానించింది. శనివారం పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేయగా, గౌరవ అతిథిగా ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. మంత్రి మహేందర్, వేణుగోపాలాచారి చేతుల మీదుగా విజేతలకు రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. తంగవేలు కోచ్ సత్యనారాయణకు రూ. 4 లక్షలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సుమధుర గ్రూపు చైర్మన్ జి.మధుసూదన్, వైస్ చైర్మన్ రామారావు, డెరైక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. వైకల్యాన్ని లెక్కజేయకుండా పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారంటూ అథ్లెట్లపై అతిథులు ప్రశంసల వర్షం కురిపించారు. -
పారాలింపిక్ విజేతలకు నజరానా
సచిన్ చేతుల మీదుగా రూ.15 లక్షల చొప్పున అందజేత ముంబై: రియో పారాలింపిక్స్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో రాణించిన నలుగురు విజేతలకు సోమవారం ఘనసన్మానం జరగడంతో పాటు నజరానా అందించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. స్వర్ణాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, దేవేంద్ర జజారియాలతో పాటు రజతం అందుకున్న దీపా మలిక్, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ భటిలకు రూ.15 లక్షల చొప్పున చెక్‌లను అందించారు. అంతేకాకుండా ఇంతకుముందు జరిగిన పారాలింపిక్స్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారికి కూడా ఈ నజరానా అందనుంది. వీరిలో మురళీకాంత్ పేట్కర్ (1972), భీమ్రావ్ కేస్కర్, జోగిందర్ సింగ్ బేడి (1984), రాజిందర్ సింగ్ రహేలు (2004), హెచ్ఎన్ గిరీష (2012) ఉన్నారు. అలాగే పారాలింపిక్ అథ్లెట్లకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న గోస్పోర్‌ట్స ఫౌండేషన్‌కు రూ.35 లక్షలను అందించారు. ‘ఇది చాలా ప్రత్యేక సమయం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ఓ భారతీయుడిగా మీ నలుగురు విజేతలను చూసి గర్విస్తున్నాను. మొత్తం ప్రపంచమంతా మిమ్మల్ని అంగవైకల్యం ఉన్న వారిగా పిలిచినా నా దృష్టిలో మాత్రం అత్యద్భుతమైన శక్తిసామర్థ్యంగలవారు’ అని సచిన్ కొనియాడారు. అలాగే ప్రతిసారి ఈ గేమ్స్‌ను పారాలింపిక్స్‌గా పిలవడం బాధిస్తోందని, నిజానికి వీటిని ఒలింపిక్స్ పారాలింపిక్స్‌గా పిలవాలని దీపా మలిక్ అభిప్రాయపడింది. ఇవి కూడా ఒలింపిక్ స్థాయి పోటీలేనని గుర్తుచేసింది. ఇక విజేతలకు ఇచ్చిన నజరానాల మొత్తాన్ని సచిన్‌తోపాటు వి.చాముండేశ్వరీనాథ్ (హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు), నిమ్మగడ్డ ప్రసాద్ (కేరళ బ్లాస్టర్స్ సహ యజమాని.. పారిశ్రామికవేత్త), డాక్టర్ ఆజాద్ మూపెన్ (ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ సీఎండీ), సం జయ్ ఘోడవత్ (సంజయ్ ఘోడవత్ గ్రూప్ చైర్మన్), అభయ్ గాడ్గిల్ (అభయ్ గాడ్గిల్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్) కలిసి నిధిగా ఏర్పాటు చేశారు. రియో పారాలింపిక్స్ విజేతలకు నజరానాలతో పాటు స్మార్ట్రాన్ మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను బహూకరించారు. దీంతోపాటు వారికి జీవితకాలం ఆరోగ్య సేవలను అందిస్తామని ఏస్టర్ డీఎం హెల్త్‌కేర్ ప్రకటించింది. -
అటు నిషేధం... ఇటు బహుమతి
మాస్కో: డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవలి రియో పారాలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల ప్రారంభోత్సవంలో మాత్రం అనూహ్యంగా రష్యా పతాకం కనిపించింది. బెలారస్ క్రీడా, పర్యాటక శాఖకు చెందిన ప్రతినిధి ఆండ్రే ఫొమోచ్కిన్ ఆ దేశ అథ్లెట్లకు సంఘీభావంగా పతాకాన్ని చేతపట్టి పరేడ్‌లో పాల్గొన్నాడు. దీనికి ఎంతగానో సంతోషపడిన రష్యా అతడికి ఏకంగా ఉచితంగా అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ధృవీకరించారు. అన్ని విషయాలను పూర్తిగా ఇప్పుడు చెప్పలేకపోయినా అపార్ట్మెంట్ ఇచ్చేది మాత్రం నిజమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఫొమోచ్కిన్ చర్యకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. నిషేధానికి గురైన దేశ పతాకాన్ని ప్రదర్శించినందుకు నిర్వాహకులు అతడి గుర్తింపును రద్దుచేసి స్వదేశానికి పంపారు. -
పారాలింపిక్స్ విజేతలకు పద్మ అవార్డులు!
న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్ల పేర్లను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల కోసం ప్రతిపాదించనున్నారు. ‘పారాలింపిక్స్ విజేతలను మేం గౌరవించదలుచుకున్నాం. అందుకే పద్మ పురస్కారాల కోసం వారి పేర్లను హోం మంత్రిత్వ శాఖకు పంపించనున్నాం’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో తంగవేలు, దేవేంద్రలకు స్వర్ణాలు, దీపా మలిక్ రజతం, వరుణ్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. -
స్వదేశానికి తంగం
పీఎం అభినందనలు అమ్మకు కృతజ్ఞతలు రియో పారాలింపిక్స్‌లో మెరిసిన తమిళ తంగం(బంగారం) గురువారం స్వదేశంలో అడుగు పెట్టాడు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అభినందనలు అందుకున్న తంగం తమిళనాడులోకి అడుగు పెట్టనున్నాడు. సాక్షి, చెన్నై :రియో పారాలింపిక్స్ హైజంప్ విభాగంలో మారియప్పన్ తంగ వేలు బంగారం కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం తమిళనాట ఆనందోత్సాల్ని నింపాయి. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని పెరియవడగం పట్టి గ్రామంలో పేదరిక కుటుంబంలో జన్మించిన మారియప్పన్ ప్రస్తుతం తమిళనాట రియల్ హీరోగా, తంగ మారిగా అవతరించి ఉన్నాడు. తమిళనాడుకు , స్వస్థలానికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ తంగమారిని ఘనంగా ఆహ్వానించేందుకు సేలం పెరియవడగం పట్టిలో ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఎప్పుడెప్పుడు తమ వాడు స్వస్థలానికి వస్తాడో అన్న ఎదురు చూపుల్లో అక్కడి యువత ఉన్నారు. ఆ మేరకు గురువారం ఉదయం రియో నుంచి స్వదేశంలోకి ఈ తంగం అడుగు పెట్టాడు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ నేతృత్వంలో ఘన స్వాగతమే లభించింది. రియోలో పతకాలు సాధించిన ఇతర క్రీడా కారులతో కలిసి ఢిల్లీలో ప్రస్తుతం మారియప్పన్ ఉన్నాడు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అభినందనలు అందుకున్నాడు. ఈసందర్భంగా తమిళ మీడియాతో మారియప్పన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి , సీఎం జయలలితకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అమ్మ జయలలిత క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నారని, ఆమె సహకారం మరువలేనిదని వ్యాఖ్యానించాడు. తాను బంగారం సాధించడం కోచ్‌కు మహదానందంగా ఉందని, ఆయన ఇచ్చిన శిక్షణతో మున్ముందు మరిన్ని పతకాల సాధన, 2020లో జపాన్ టోకియలో జరిగే ఒలింపిక్స్‌లో బంగారం లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. ఇక, మారియప్పన్ స్వస్థలానికి ఎప్పుడు వస్తాడన్న సమాచారం సక్రమంగా అందక, అక్కడి వారు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండొచ్చని లేదా, బెంగళూరులో ఓ రోజు ఉండి శనివారం రావొచ్చంటూ పెరియవడగం పట్టి యువత ఎదురు చూపుల్లో ఉన్నారు. కాగా, మారియప్పన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన కేంద్ర మంత్రి విజయ్ గోయల్ తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా సీఎం జయలలిత తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఇలాంటి ప్రోత్సాహంతో మరెందరో క్రీడాకారులు తమ ప్రతిభను చాటగలరని పేర్కొన్నారు. -
పారా అథ్లెట్లకు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లు గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. పతకాలు సాధించిన నలుగురు ఆటగాళ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘పారాలింపిక్స్‌లో దేశం గర్వించే విధంగా చేసిన అథ్లెట్లను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే ప్రతీ అథ్లెట్‌తో ఆయన ఫొటో దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 19 మందితో కూడిన బృందం రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం సాధించిన విషయం తెలిసిందే -
చైనా... చమక్ చమక్
107 స్వర్ణాలతో టాప్ ముగిసిన పారాలింపిక్స్ భారత్ మెరుగైన ప్రదర్శన రియో డి జనీరో: పదకొండు రోజుల పాటు ఆసక్తిదాయకంగా సాగిన రియో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. ఈ గేమ్స్ నిర్వహణకు ముందు కాస్త అనిశ్చితి కొనసాగినా నిర్వాహకులు మాత్రం విజయవంతం చేయగలిగారు. అయితే చివరి రోజు ఇరాన్ సైక్లిస్ట్ దుర్మరణం అందరినీ కలిచివేసింది. ఇక పోటీల్లో చైనా పారా అథ్లెట్లు ఆధిపత్యం ప్రదర్శించారు. పతకాల పట్టికలో తమ దేశాన్ని అగ్రస్థానంలో నిలిపి ఒలింపిక్స్‌లో సాధించనిది ఇక్కడ సాధించి చూపారు. మొత్తంగా చైనా 239 పతకాల (107 స్వర్ణం, 81 రజతం, 51 కాంస్యం)తో అదరగొట్టగా... బ్రిటన్, ఉక్రెయిన్, అమెరికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇదిలావుండగా ఈ గేమ్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు కొన్ని అద్వితీయ రికార్డులతో అందరి మనసులు దోచుకున్నారు. బ్రెజిల్ స్టార్ స్విమ్మర్ డానియల్ డయాస్ ఏకంగా నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో మెరిశాడు. తొలిసారిగా బీజింగ్ గేమ్స్‌లో బరిలోకి దిగిన తను ఇప్పటిదాకా 24 పతకాలు సాధించి మరో మైకేల్ ఫెల్ప్స్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక 1500మీ. రేసులో అబ్దెల్లతీఫ్ బాకా (అల్జీరియా) అరుదైన ఘనత సాధించాడు. ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో విజేతగా నిలిచిన మాథ్యూ సెంట్రోవిజ్కన్నా తక్కువ సమయంలోనే పరిగెత్తి రికార్డు సృష్టించాడు. అరుుతే లండన్ గేమ్స్‌లో 102 పతకాలతో రాణించిన రష్యా డోపింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కోవడంతో ఇందులో పాల్గొనలేకపోయింది. మరోవైపు కఠిన పరిస్థితిలోనూ ఒలింపిక్స్, పారాలింపిక్స్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించి తమకు ప్రేరణగా నిలిచారని టోక్యో 2020 గేమ్స్ నిర్వహణ కమిటీ సీఈవో టొహిరో ముటో అన్నారు. గేమ్స్‌కు అనేక భయాలు ఉన్నా వాటిని అధిగమించిన తీరు అద్భుతమని కొనియాడారు. పెద్దగా అంచనాలు లేకుండానే వెళ్లిన భారత అథ్లెట్లు తమ పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రెండు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యంతో నాలుగు పతకాలు కొల్లగొట్టారు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో 43వ స్థానంలో నిలిచారు. -
ఒలింపిక్స్‌లో సైక్లిస్ట్ మృతి
రియో డీ జనీరో: రియోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఇరాన్‌కు చెందిన సైక్లిస్ట్ సర్ఫరాజ్ బహ్మాన్(48) గుండె పోటు గురై ప్రాణాలు కోల్పోయాడు. మౌంటైన్ స్ట్రెచ్‌లో భాగంగా సీ4-5 ఈవెంట్లో పాల్గొన్న సమయంలో సర్ఫరాజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని స్థానిక అథ్లెట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే డాక్టర్లు చేసిన కృషి ఫలించకపోవడంతో అతను అసువులు బాసాడు. ఈ ఘటనపై అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ(ఐపీసీ) విచారం వ్యక్తం చేసింది. ఆ సైక్లిస్ట్ గుండె పోటుకు గురికావడంతో హుటాహుటీనా బర్రాలోని రియో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికే సర్ఫరాజ్ మృతి చెందినట్లు ఒలింపిక్ కమిటీ ధృవీకరించింది. బుధవారం తొలి రేస్ లో పాల్గొన్న సర్ఫరాజ్ కు ఇది రెండో రేస్ కాగా, పారా ఒలింపిక్స్ 56 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఇలా పోటీలో పాల్గొన్న అథ్లెట్ మృతి చెందడం ఇదే తొలిసారి. 1980లో జరిగిన ఓ యుద్ధంలో సర్పరాజ్ ఒక కాలును కోల్పోయాడు. అనంతరం 2002లో సైక్లింగ్ గేమ్‌ను ఎంచుకున్న అతను సత్తాచాటుకున్నాడు. రియోకు ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన అతను దుర్మరణం చెందడం పట్ల స్నేహితుడు హషీమ్ సంతాపం వ్యక్తం చేశాడు. ఎప్పుడు సంతోషంగా ఉండే సర్ఫరాజ్ ఇలా తమను వదిలి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. -
చేతులతో సైకిల్ తొక్కారు..
-
సంకల్పమే సెల్యూట్ చేసేలా...
అందరికీ స్ఫూర్తి దేవేంద్ర ప్రస్థానం వెకల్యం వృద్ధికి అడ్డు కాదని నిరూపించిన వైనం రాజస్తాన్‌లోని ఓ మారుమూల పల్లెటూరులో 26 ఏళ్ల క్రితం... ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు ఆడుకోవడానికి తోటి పిల్లల దగ్గరకు వెళ్లాడు. కానీ ఆ పిల్లలు ‘ఒరేయ్... నీకు ఒక్క చెయ్యే ఉందిరా. మాతో ఆడటం కుదరదు. వెళ్లిపో అని పంపించారు’. విధి వంచన కారణంగా చేతిని కోల్పోయిన ఆ పిల్లాడు... మిగిలిన పిల్లల మాటలతో స్థయిర్యం మాత్రం కోల్పోలేదు. ఒక్కడే ఒంటరిగా ఏం చేయాలో తెలియక... ఒక వెదురు బొంగును తీసుకుని విసరడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎవరికీ తెలియదు... భారత దేశ క్రీడారంగంలో కొత్త చరిత్రకు అది పునాది అవుతుందని. కట్ చేస్తే... ఇప్పుడు అదే వ్యక్తి కొత్త రికార్డు సృష్టించాడు. పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. భారత ఒలింపిక్స్ చరిత్రలోనూ ఇప్పటి వరకూ రెండు స్వర్ణాలు గెలిచిన అథ్లెట్ ఎవరూ లేరు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి మరో ఉదాహరణ దేవేంద్ర జజరియా. సాక్షి క్రీడావిభాగం ; భారత్‌కు అభినవ్ బింద్రా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం అందించడానికి నాలుగేళ్ల ముందే 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లో దేవేంద్ర స్వర్ణం గెలిచాడు. తర్వాత బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో దేవేందర్ ఈవెంట్ ఎఫ్-46 లేదు. ఎఫ్ అంటే ఫీల్డ్ అని అర్థం. 45 నుంచి 47 వరకు నంబర్ల ఈవెంట్లు శరీరంలో పై భాగంలో వైకల్యం ఉన్న వారికి నిర్వహిస్తారు. ఆ రెండు ఒలింపిక్స్‌లలో ఈవెంట్ లేకపోయినా... దేవేంద్ర శిక్షణ ఆపలేదు. ఈసారి రియోలో తన విభాగం ఉందని తెలిసిన తర్వాత ప్రాక్టీస్ మరింత పెంచాడు. గత ఒలింపిక్స్‌లో తన ఈవెంట్ లేదని తెలిసినా 12 ఏళ్ల పాటు ఓ అథ్లెట్ ఫిట్‌గా ఉండటం ఆషామాషీ కాదు. ఎనిమిదేళ్ల వయసులో ప్రమాదం: రాజస్తాన్‌లోని చురు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దేవేంద్ర ... ఎనిమిదేళ్ల వయసులో ఆడుకుంటూ ప్రమాదం బారిన పడ్డాడు. ఆటల్లో భాగంగా ఓ చెట్టు ఎక్కి... అక్కడ వేలాడుతున్న కరెంటు తీగను పట్టుకున్నాడు. దీంతో అందరూ పిల్లాడు చనిపోయాడనే అనుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్తే చేయి వరకు తీసేసి ప్రాణాలు కాపాడారు. ఒక్క చేత్తో బయటకు వెళ్లిన దేవేంద్రతో అక్కడి పిల్లలు ఆడుకునేవాళ్లు కాదు. దీంతో ఒక్కడే ఏం చేయాలో అర్థం కాక... వెదురు బొంగులు తీసుకుని విసురుతూ ఉండేవాడు. అలా జావెలిన్ త్రో ప్రస్థానం మొదలైంది. అండగా కుటుంబం: దేవేంద్ర చిన్నతనం నుంచి కూడా తల్లి జివానీ దేవి అతడిలో స్ఫూర్తిని నింపేది ‘నువ్వు ఎవరికంటే తక్కువ కాదు’ అని ధైర్యం నూరిపోసేది. రైల్వేస్ నిర్వహించిన ఓపెన్ అథ్లెటిక్ మీట్లో సాధారణ అథ్లెట్లతో పోటీ పడటంతో దేవేంద్ర ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత భారత స్పోర్ట్స అథారిటీ (సాయ్) హాస్టల్లో చేరడంతో శిక్షణ పద్ధతిగా సాగింది. మంజు అనే జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌తో దేవేంద్ర వివాహం జరిగింది. ‘పెళ్లి కాకముందు మా ఆమ్మ, పెళ్లయ్యాక నా భార్య కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. నా కోసం మంజు కబడ్డీని వదిలేసింది. శిక్షణ కోసం నేనెప్పుడూ ఇంటికి దూరంగానే ఉంటాను. ఇంటికి సంబంధించిన ఏ సమస్యలు కూడా ఈ ఇద్దరూ నా దాకా తీసుకురారు. నేను ఎక్కడ ఉన్నా నా ఆహారం, అవసరాలు మా నాన్న చూసుకునేవారు. కుటుంబం సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు’ అని దేవేంద్ర గర్వంగా చెబుతాడు. ప్రోత్సాహం బాగుంది: దేవేంద్ర విజయంలో ‘సాయ్’ కోచ్ సునీల్ తన్వర్ పాత్ర చాలా ఉంది. ఈసారి పారాలింపిక్స్‌కు ముందు భుజం గాయం కావడంతో ఆందోళన చెందినా... కోచ్ సునీల్ ప్రత్యేక శిక్షణతో సన్నాహాలకు ఇబ్బంది కలగలేదు. 2004లో స్వర్ణం గెలిచిన తర్వాత అర్జున అవార్డుతో, 2012లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం దేవేంద్రను గౌరవించింది. అలాగే భారత ప్రభుత్వం ఈసారి ఒలింపిక్స్‌కు ముందు ఏర్పాటు చేసిన ‘టాప్’ స్కీమ్‌లో దేవేంద్ర కూడా ఉన్నాడు. అలాగే గోస్పోర్‌ట్స ఫౌండేషన్ కూడా సహాయం చేసింది. కెన్యా అథ్లెట్ నుంచి స్ఫూర్తి: ఏప్రిల్ నుంచి జులై వరకు ఫిన్లాండ్లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ జులియస్ యెగో అనే కెన్యా త్రోయర్‌తో స్నేహం చేశాడు. అతని జీవితం నుంచి తనకు చాలా స్ఫూర్తి లభించిందని దేవేంద్ర చెప్పాడు. ‘యెగో జీవితం గురించి వింటే ఎవరికై నా కన్నీళ్లు వస్తారుు. అతని వైకల్యం కథ, విరిగిపోరుున మంచం మీద నిద్ర, యూట్యూబ్‌లో చూసి జావెలిన్ త్రో నేర్చుకోవడం ఇలా అనేక విషయాలు చెప్పాడు. అవన్నీ వింటే ఎవరికై నా స్ఫూర్తి వస్తుంది. నేను కచ్చితంగా స్వర్ణం గెలుస్తానని యెగో చెప్పేవాడు. నా విజయం వెనక ఉన్న బలమైన శక్తి, స్ఫూర్తి అతను’ అని దేవేంద్ర తెలిపాడు. ఆరేళ్ల కూతురికి ఇచ్చిన మాట పారాలింపిక్స్‌కు ముందు దేవేంద్ర తన ఆరేళ్ల కూతురు జియాతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. లోయర్ కిండర్ గార్టెన్ (ఎల్కేజీ) చదువుతున్న జియా తన క్లాస్ ఎగ్జామ్స్‌లో ఫస్ట్ వస్తే దేవేంద్ర కూడా స్వర్ణం గెలవాలనేది ఆ ‘డీల్’. ‘ఓ రోజు నా కూతురు ఫోన్ చేసి నాన్నా నేను ఫస్ట్వచ్చాను. ఇక నీవంతు అని గర్వంగా చెప్పింది. ఒలింపిక్ స్టేడియంలో అడుగుపెడుతుంటే నా కూతురు మాటలే నా చెవిలో మార్మోగాయి’ అని దేవేంద్ర సంబరంగా అంటున్నాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఈ ఈవెంట్ జరిగింది. ‘నా కూతురు నిద్ర లేవగానే ఈ విషయం చెప్పాలి. తన సంతోషాన్ని చూడాలి’ అని చెప్పాడు. దేవేంద్రకు రెండేళ్ల కుమారుడు కావ్యన్ ఉన్నాడు. ‘మా అబ్బాయికి నేను ఎలా ఉంటానో కూడా సరిగా తెలియదు. వాళ్ల అమ్మ ఫొటో చూపించి మీ నాన్న అని చెబుతుంది. ఈ రెండేళ్లలో నేను చాలా తక్కువ సందర్భాల్లో ఇంటికి వెళ్లాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కువ సమయం పిల్లలతో గడపాలి’ అని దేవేంద్ర చెప్పాడు. -
రికార్డు దూరం విసిరి.. పసిడి పట్టాడు!
-
రికార్డు దూరం విసిరి.. పసిడి పట్టాడు!
రియో డి జెనీరో: పారాలింపిక్స్-2016లో మరో భారత అథ్లెట్ మంగళవారం పసిడి సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో పాల్గొన్న దేవేంద్ర ఝఝారియా.. అంతకుముందు తన పేరిట ఉన్నప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి.. 62.15 మీటర్ల గత రికార్డును తిరగరాశాడు. 2004 అథెన్స్ పారాలింపిక్స్ లో దేవేంద్ర ఈ ఘనతను సాధించాడు. రియో పారాలింపిక్స్ లో దేవేంద్ర పసిడి గెలవడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈవెంట్స్ ముందురోజు దేవేంద్రతో మాట్లాడినప్పుడు కచ్చితంగా స్వర్ణం గెలుస్తావని చెప్పానని, అలాగే జరిగిందని ఆయన భార్య మంజు మీడియాకు తెలిపారు. పారాలింపిక్స్ లో రెండుసార్లు పసిడి గెలిచిన తొలి భారతీయుడిగా దేవేంద్రకు గుర్తింపు లభించడం ఆనందాన్ని మరింత రెట్టింపు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పారాలింపిక్స్-2016లో ఇప్పటివరకూ పురుషుల హై జంప్ లో తంగవేలు మరియప్పన్, మహిళల షాట్ పుట్ లో దీపా మాలిక్ లు పసిడి, వెండి పతకాలను సాధించిన విషయం తెలిసిందే. Devendra Jhajharia is now the only player in our @Paralympics/@Olympics history to have two individual #GOLD medals. pic.twitter.com/IyvoiMFzf7 — PCCAI (@pccai_in) September 13, 2016 -
తంగ మారి
సాక్షి, చెన్నై : రియో పారాలింపిక్ హైజంప్ విభాగంలో తమిళ తేజం మారియప్పన్ తంగవేలు బంగారం దక్కించుకున్న విషయం తెలిసిందే. తమ గ్రామం పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగే రీతిలో తన సత్తాను చాటిన మారియప్పన్ తంగ వేలును ఇక తంగ మారిగా పిలిచేందుకు పెరియవడగం పట్టి వాసులు నిర్ణయించారు. తంగం..తంగమే (బంగారం..బంగారమే) అంటూ తంగమారిగా ఈ రియో హీరో పేరు మార్చే పనిలో పడ్డారు. సేలం జిల్లా ఓమలూరు డివిజన్ పరిధిలోని పెరియవడగం పట్టిలో ఉన్న తంగ మారి తల్లిదండ్రులు తంగ వేలు, సరోజ, సోదరీ, సోదరులు ఆనందంలో ఊబ్బి తబ్బి అవుతున్నారు. తమ వాడికి ప్రశంసలతో పాటుగా కానుకలు వస్తుండటంతో ఇక, అద్దె ఇంటి నుంచి సొంత ఇంట్లోకి అడుగు పెట్టాలన్న కాంక్ష ఆ కుటుంబంలో పెరిగి ఉన్నది. అయితే, పెరియ వడగం పట్టిలోనే సొంత ఇళ్లు నిర్మించుకుంటామని, బయట ఎక్కడకు వెళ్లబోమని సరోజ వ్యాఖ్యానించారు. ‘తంగం’ వచ్చాకే సొంత ఇంటి నిర్మాణంపై దృష్టి పెడుతామన్నారు. తన కుమారుడితో ఫోన్లో మాట్లాడినట్టు, అతడి రూపంలో తమ కుటుంబ కష్టాలు కొంత మేరకు తీరనున్నదని ఆనందం వ్యక్తంచేశారు. ఇక, తనకు వస్తున్న కానుకల్లో కొంత భాగాన్ని పెరియవడగం పట్టి పాఠశాలకు వెచ్చించేందుకు తంగ మారి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయంగా ఆ స్కూల్ పీఈటీ రాజేంద్రన్ పేర్కొంటూ, స్కూల్ హోదా పెంపు, క్రీడా మైదానం అభివృద్ధి గురించి తనతో తంగం మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడని వ్యాఖ్యానించారు. ఈనెల 22న స్వగ్రామానికి మారి రానున్నాడని, అతడ్ని ఆహ్వానించే విధంగా భారీ ఏర్పాట్లు చేయనున్నామన్నారు. తమ గ్రామానికి ముందుగానే ఆయుధ పూజ వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ఆ గ్రామ యువత పేర్కొంటూ, తంగ మారి సౌమ్యుడు అని, సందేశాత్మక ఆంగ్ల చిత్రాలను ఎక్కువగా చూసే వాడని వివరించారు. హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలిన్ చిత్రాలను మరింతగా ఇష్టపడి చూసేవాడని, బీబీఈ తదుపరి ఎంబీఏ చేయాలన్న ఆశ అతడిలో ఉందని వ్యాఖ్యానించడం విశేషం. -
మరియప్పన్‌కు భారీ నజరానా
చెన్నై: పారాలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తంగవేలును ప్రత్యేకంగా అభినందించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలిత.. ఆ అథ్లెట్‌కు రూ. 2 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు పారాలింపిక్స్‌లో సత్తాచాటిన మరియప్పన్, వరుణ్ సింగ్ భాటిలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ పేజీలో అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా రియోకు వెళ్లేముందే అథ్లెట్లను ప్రొత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్స్ లో స్వర్ణం సాధిస్తే రూ.75 లక్షలు, అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలు జరుగుతున్న పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో పాల్గొన్న మరియప్పన్ 1.89 మీటర్లు జంప్ చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. -
మరియప్పన్ కు రూ. 75 లక్షలు..
రియో: బ్రెజిల్‌లోని రియో డి జనీరోలు జరుగుతున్న పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ మరియప్పన్ తంగవేలు రూ. 75 లక్షల నజరానాను కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకోనున్నాడు. దాంతో పాటు కాంస్య పతకం సాధించిన మరో అథ్లెట్ వరుణ్ భాటికి రూ. 30 లక్షల నగదు పురస్కారం దక్కనుంది. భారత అథ్లెట్లు పారాలింపిక్స్ కు వెళ్లేముందు వారిని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్స్ లో స్వర్ణ సాధిస్తే రూ.75 లక్షలు, అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు మరియప్పన్ కు రూ.75 లక్షలు, భాటికి రూ.30 లక్షలు నజరానా దక్కనుంది. భారత్ నుంచి ఈసారి 17 మందితో కూడిన బృందం ఈ గేమ్స్‌కు వెళ్లింది. పారా ఒలింపిక్స్ ఆరంభమైన రెండు రోజుల్లోనే భారత ఖాతాలో పతకాలు చేరడంపై ఆ అథ్లెట్లపై ప్రశంసల వర్షం కురస్తోంది. పారాలింపిక్స్‌లో సత్తాచాటిన మరియప్పన్, భాటిలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ పేజీలో అభినందనలు తెలియజేశారు.మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. రియోలో మరిన్ని పతకాలు సాధించి భారత కీర్తిని మరింత పెంచాలంటూ ఆకాంక్షించాడు. రియో పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మరో భారత అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం నెగ్గాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రీవె రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. -
రియోలో భారత్‌కు స్వర్ణం, కాంస్యం
పారాలింపిక్స్‌లో భారత్ రెండు పతకాలు కైవసం చేసుకుంది. రియో పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మరో భారత అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం నెగ్గాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రీవె రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ మరియప్పన్. కాగా, వ్యక్తిగత స్వర్ణం నెగ్గిన మూడో భారత అథ్లెట్ గా నిలిచాడు. గతంలో స్విమ్మింగ్, జావెలిన్ త్రో విభాగాలలో భారత్ వ్యక్తిగత స్వర్ణాలు కైవసం చేసుకుంది. పారాలింపిక్స్ లో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య 10కి చేరింది.