చైనా... చమక్ చమక్
107 స్వర్ణాలతో టాప్
ముగిసిన పారాలింపిక్స్
భారత్ మెరుగైన ప్రదర్శన
రియో డి జనీరో: పదకొండు రోజుల పాటు ఆసక్తిదాయకంగా సాగిన రియో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. ఈ గేమ్స్ నిర్వహణకు ముందు కాస్త అనిశ్చితి కొనసాగినా నిర్వాహకులు మాత్రం విజయవంతం చేయగలిగారు. అయితే చివరి రోజు ఇరాన్ సైక్లిస్ట్ దుర్మరణం అందరినీ కలిచివేసింది. ఇక పోటీల్లో చైనా పారా అథ్లెట్లు ఆధిపత్యం ప్రదర్శించారు. పతకాల పట్టికలో తమ దేశాన్ని అగ్రస్థానంలో నిలిపి ఒలింపిక్స్‌లో సాధించనిది ఇక్కడ సాధించి చూపారు. మొత్తంగా చైనా 239 పతకాల (107 స్వర్ణం, 81 రజతం, 51 కాంస్యం)తో అదరగొట్టగా... బ్రిటన్, ఉక్రెయిన్, అమెరికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇదిలావుండగా ఈ గేమ్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు కొన్ని అద్వితీయ రికార్డులతో అందరి మనసులు దోచుకున్నారు.
బ్రెజిల్ స్టార్ స్విమ్మర్ డానియల్ డయాస్ ఏకంగా నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో మెరిశాడు. తొలిసారిగా బీజింగ్ గేమ్స్‌లో బరిలోకి దిగిన తను ఇప్పటిదాకా 24 పతకాలు సాధించి మరో మైకేల్ ఫెల్ప్స్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక 1500మీ. రేసులో అబ్దెల్లతీఫ్ బాకా (అల్జీరియా) అరుదైన ఘనత సాధించాడు. ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో విజేతగా నిలిచిన మాథ్యూ సెంట్రోవిజ్‌కన్నా తక్కువ సమయంలోనే పరిగెత్తి రికార్డు సృష్టించాడు. అరుుతే లండన్ గేమ్స్‌లో 102 పతకాలతో రాణించిన రష్యా డోపింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కోవడంతో ఇందులో పాల్గొనలేకపోయింది.
మరోవైపు కఠిన పరిస్థితిలోనూ ఒలింపిక్స్, పారాలింపిక్స్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించి తమకు ప్రేరణగా నిలిచారని టోక్యో 2020 గేమ్స్ నిర్వహణ కమిటీ సీఈవో టొహిరో ముటో అన్నారు. గేమ్స్‌కు అనేక భయాలు ఉన్నా వాటిని అధిగమించిన తీరు అద్భుతమని కొనియాడారు. పెద్దగా అంచనాలు లేకుండానే వెళ్లిన భారత అథ్లెట్లు తమ పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రెండు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యంతో నాలుగు పతకాలు కొల్లగొట్టారు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో 43వ స్థానంలో నిలిచారు.