అటు నిషేధం... ఇటు బహుమతి
మాస్కో: డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇటీవలి రియో పారాలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రీడల ప్రారంభోత్సవంలో మాత్రం అనూహ్యంగా రష్యా పతాకం కనిపించింది. బెలారస్ క్రీడా, పర్యాటక శాఖకు చెందిన ప్రతినిధి ఆండ్రే ఫొమోచ్కిన్ ఆ దేశ అథ్లెట్లకు సంఘీభావంగా పతాకాన్ని చేతపట్టి పరేడ్‌లో పాల్గొన్నాడు. దీనికి ఎంతగానో సంతోషపడిన రష్యా అతడికి ఏకంగా ఉచితంగా అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ధృవీకరించారు.
అన్ని విషయాలను పూర్తిగా ఇప్పుడు చెప్పలేకపోయినా అపార్ట్‌మెంట్ ఇచ్చేది మాత్రం నిజమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఫొమోచ్కిన్ చర్యకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. నిషేధానికి గురైన దేశ పతాకాన్ని ప్రదర్శించినందుకు నిర్వాహకులు అతడి గుర్తింపును రద్దుచేసి స్వదేశానికి పంపారు.