స్వదేశానికి తంగం
పీఎం అభినందనలు
అమ్మకు కృతజ్ఞతలు
రియో పారాలింపిక్స్‌లో మెరిసిన తమిళ తంగం(బంగారం) గురువారం స్వదేశంలో అడుగు పెట్టాడు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అభినందనలు అందుకున్న తంగం తమిళనాడులోకి అడుగు పెట్టనున్నాడు.
సాక్షి, చెన్నై :రియో పారాలింపిక్స్ హైజంప్ విభాగంలో మారియప్పన్ తంగ వేలు బంగారం కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం తమిళనాట ఆనందోత్సాల్ని నింపాయి. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని పెరియవడగం పట్టి గ్రామంలో పేదరిక కుటుంబంలో జన్మించిన మారియప్పన్ ప్రస్తుతం తమిళనాట రియల్ హీరోగా, తంగ మారిగా అవతరించి ఉన్నాడు. తమిళనాడుకు , స్వస్థలానికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ తంగమారిని ఘనంగా ఆహ్వానించేందుకు సేలం పెరియవడగం పట్టిలో ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఎప్పుడెప్పుడు తమ వాడు స్వస్థలానికి వస్తాడో అన్న ఎదురు చూపుల్లో అక్కడి యువత ఉన్నారు.
ఆ మేరకు గురువారం ఉదయం రియో నుంచి స్వదేశంలోకి ఈ తంగం అడుగు పెట్టాడు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ నేతృత్వంలో ఘన స్వాగతమే లభించింది. రియోలో పతకాలు సాధించిన ఇతర క్రీడా కారులతో కలిసి ఢిల్లీలో ప్రస్తుతం మారియప్పన్ ఉన్నాడు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అభినందనలు అందుకున్నాడు. ఈసందర్భంగా తమిళ మీడియాతో మారియప్పన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి , సీఎం జయలలితకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అమ్మ జయలలిత క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నారని, ఆమె సహకారం మరువలేనిదని వ్యాఖ్యానించాడు. తాను బంగారం సాధించడం కోచ్‌కు మహదానందంగా ఉందని, ఆయన ఇచ్చిన శిక్షణతో మున్ముందు మరిన్ని పతకాల సాధన, 2020లో జపాన్ టోకియలో జరిగే ఒలింపిక్స్‌లో బంగారం లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.
ఇక, మారియప్పన్ స్వస్థలానికి ఎప్పుడు వస్తాడన్న సమాచారం సక్రమంగా అందక, అక్కడి వారు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండొచ్చని లేదా, బెంగళూరులో ఓ రోజు ఉండి శనివారం రావొచ్చంటూ పెరియవడగం పట్టి యువత ఎదురు చూపుల్లో ఉన్నారు. కాగా, మారియప్పన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన కేంద్ర మంత్రి విజయ్ గోయల్ తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా సీఎం జయలలిత తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఇలాంటి ప్రోత్సాహంతో మరెందరో క్రీడాకారులు తమ ప్రతిభను చాటగలరని పేర్కొన్నారు.