పతకం గెలిచేందుకు మంచి అవకాశం
♦ ప్రపంచ చాంపియన్‌షిప్‌పై శ్రీకాంత్
♦ గురుశిష్యుల్ని సత్కరించిన క్రీడల మంత్రి గోయెల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచేందుకు భారత షట్లర్లకు మంచి అవకాశాలున్నాయని కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. గ్లాస్గోలో జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ అర్హత సాధించారు. స్కాట్లాండ్‌లో ఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ చాంపియన్‌షిప్ జరగనుంది. ఇండోనేసియా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్, కోచ్ గోపీచంద్‌లను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ శనివారం తన నివాసంలో సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గ్యారంటీ అని చెప్పను. కానీ భారత ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. మ్యాచ్ జరిగే రోజు 100 శాతం రాణిస్తే గెలుపు మాత్రం మనదే. అప్పుడు పతకాన్నీ ఆశించవచ్చు’ అని అన్నాడు. మంత్రి గోయెల్ మాట్లాడుతూ... ‘శ్రీకాంత్ జాతి గర్వించే విజయాలు సాధించాడు. కోచ్ గోపీచంద్ దేశం గర్వపడే క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వీళ్లతో పాటు ప్రతిభ గల ఆటగాళ్లకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. వాళ్లకు 24 గంటలు మా శాఖ అందుబాటులో ఉంటుంది’ అని అన్నారు. ‘సాయ్’, క్రీడాశాఖ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని గోపీచంద్ పేర్కొన్నారు.