తంగ మారి
సాక్షి, చెన్నై : రియో పారాలింపిక్ హైజంప్ విభాగంలో తమిళ తేజం మారియప్పన్ తంగవేలు బంగారం దక్కించుకున్న విషయం తెలిసిందే. తమ గ్రామం పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగే రీతిలో తన సత్తాను చాటిన మారియప్పన్ తంగ వేలును ఇక తంగ మారిగా పిలిచేందుకు పెరియవడగం పట్టి వాసులు నిర్ణయించారు. తంగం..తంగమే (బంగారం..బంగారమే) అంటూ తంగమారిగా ఈ రియో హీరో పేరు మార్చే పనిలో పడ్డారు. సేలం జిల్లా ఓమలూరు డివిజన్ పరిధిలోని పెరియవడగం పట్టిలో ఉన్న తంగ మారి తల్లిదండ్రులు తంగ వేలు, సరోజ, సోదరీ, సోదరులు ఆనందంలో ఊబ్బి తబ్బి అవుతున్నారు.
తమ వాడికి ప్రశంసలతో పాటుగా కానుకలు వస్తుండటంతో ఇక, అద్దె ఇంటి నుంచి సొంత ఇంట్లోకి అడుగు పెట్టాలన్న కాంక్ష ఆ కుటుంబంలో పెరిగి ఉన్నది. అయితే, పెరియ వడగం పట్టిలోనే సొంత ఇళ్లు నిర్మించుకుంటామని, బయట ఎక్కడకు వెళ్లబోమని సరోజ వ్యాఖ్యానించారు. ‘తంగం’ వచ్చాకే సొంత ఇంటి నిర్మాణంపై దృష్టి పెడుతామన్నారు. తన కుమారుడితో ఫోన్లో మాట్లాడినట్టు, అతడి రూపంలో తమ కుటుంబ కష్టాలు కొంత మేరకు తీరనున్నదని ఆనందం వ్యక్తంచేశారు. ఇక, తనకు వస్తున్న కానుకల్లో కొంత భాగాన్ని పెరియవడగం పట్టి పాఠశాలకు వెచ్చించేందుకు తంగ మారి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈ విషయంగా ఆ స్కూల్ పీఈటీ రాజేంద్రన్ పేర్కొంటూ, స్కూల్ హోదా పెంపు, క్రీడా మైదానం అభివృద్ధి గురించి తనతో తంగం మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడని వ్యాఖ్యానించారు. ఈనెల 22న స్వగ్రామానికి మారి రానున్నాడని, అతడ్ని ఆహ్వానించే విధంగా భారీ ఏర్పాట్లు చేయనున్నామన్నారు. తమ గ్రామానికి ముందుగానే ఆయుధ పూజ వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ఆ గ్రామ యువత పేర్కొంటూ, తంగ మారి సౌమ్యుడు అని, సందేశాత్మక ఆంగ్ల చిత్రాలను ఎక్కువగా చూసే వాడని వివరించారు. హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలిన్ చిత్రాలను మరింతగా ఇష్టపడి చూసేవాడని, బీబీఈ తదుపరి ఎంబీఏ చేయాలన్న ఆశ అతడిలో ఉందని వ్యాఖ్యానించడం విశేషం.