సంకల్పమే సెల్యూట్ చేసేలా... | rio olympic devendra jhajhria win gold medal with world record | Sakshi
Sakshi News home page

సంకల్పమే సెల్యూట్ చేసేలా...

Published Thu, Sep 15 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

సంకల్పమే  సెల్యూట్ చేసేలా...

సంకల్పమే సెల్యూట్ చేసేలా...

అందరికీ స్ఫూర్తి దేవేంద్ర ప్రస్థానం  
 వెకల్యం వృద్ధికి అడ్డు కాదని నిరూపించిన వైనం

 
 రాజస్తాన్‌లోని ఓ మారుమూల పల్లెటూరులో 26 ఏళ్ల క్రితం... ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు ఆడుకోవడానికి తోటి పిల్లల దగ్గరకు వెళ్లాడు. కానీ ఆ పిల్లలు ‘ఒరేయ్... నీకు ఒక్క చెయ్యే ఉందిరా. మాతో ఆడటం కుదరదు. వెళ్లిపో అని పంపించారు’. విధి వంచన కారణంగా చేతిని కోల్పోయిన  ఆ పిల్లాడు... మిగిలిన పిల్లల మాటలతో స్థయిర్యం మాత్రం కోల్పోలేదు. ఒక్కడే ఒంటరిగా ఏం చేయాలో తెలియక... ఒక వెదురు బొంగును తీసుకుని విసరడం మొదలుపెట్టాడు. అప్పుడు  ఎవరికీ తెలియదు... భారత దేశ క్రీడారంగంలో కొత్త చరిత్రకు అది పునాది అవుతుందని.
 
 కట్ చేస్తే... ఇప్పుడు అదే వ్యక్తి కొత్త రికార్డు సృష్టించాడు. పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. భారత ఒలింపిక్స్ చరిత్రలోనూ ఇప్పటి వరకూ రెండు స్వర్ణాలు గెలిచిన అథ్లెట్ ఎవరూ లేరు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి మరో ఉదాహరణ దేవేంద్ర జజరియా.
 
 సాక్షి క్రీడావిభాగం ; భారత్‌కు అభినవ్ బింద్రా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం అందించడానికి నాలుగేళ్ల ముందే 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లో దేవేంద్ర స్వర్ణం గెలిచాడు. తర్వాత బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో దేవేందర్ ఈవెంట్ ఎఫ్-46 లేదు. ఎఫ్ అంటే  ఫీల్డ్ అని అర్థం. 45 నుంచి 47 వరకు నంబర్ల ఈవెంట్లు శరీరంలో పై భాగంలో వైకల్యం ఉన్న వారికి నిర్వహిస్తారు. ఆ రెండు ఒలింపిక్స్‌లలో ఈవెంట్ లేకపోయినా... దేవేంద్ర శిక్షణ ఆపలేదు. ఈసారి రియోలో తన విభాగం ఉందని తెలిసిన తర్వాత ప్రాక్టీస్ మరింత పెంచాడు. గత ఒలింపిక్స్‌లో తన ఈవెంట్ లేదని తెలిసినా 12 ఏళ్ల పాటు ఓ అథ్లెట్ ఫిట్‌గా ఉండటం ఆషామాషీ కాదు.
 
 ఎనిమిదేళ్ల వయసులో ప్రమాదం: రాజస్తాన్‌లోని చురు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దేవేంద్ర ... ఎనిమిదేళ్ల వయసులో ఆడుకుంటూ ప్రమాదం బారిన పడ్డాడు. ఆటల్లో భాగంగా ఓ చెట్టు ఎక్కి... అక్కడ వేలాడుతున్న కరెంటు తీగను పట్టుకున్నాడు. దీంతో అందరూ పిల్లాడు చనిపోయాడనే అనుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్తే చేయి వరకు తీసేసి ప్రాణాలు కాపాడారు. ఒక్క చేత్తో బయటకు వెళ్లిన దేవేంద్రతో అక్కడి పిల్లలు ఆడుకునేవాళ్లు కాదు. దీంతో ఒక్కడే ఏం చేయాలో అర్థం కాక... వెదురు బొంగులు తీసుకుని విసురుతూ ఉండేవాడు. అలా జావెలిన్ త్రో ప్రస్థానం మొదలైంది.
 
 అండగా కుటుంబం: దేవేంద్ర చిన్నతనం నుంచి కూడా తల్లి జివానీ దేవి అతడిలో స్ఫూర్తిని నింపేది ‘నువ్వు ఎవరికంటే తక్కువ కాదు’ అని ధైర్యం నూరిపోసేది. రైల్వేస్ నిర్వహించిన ఓపెన్ అథ్లెటిక్ మీట్‌లో సాధారణ అథ్లెట్లతో పోటీ పడటంతో దేవేంద్ర ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత భారత స్పోర్‌‌ట్స అథారిటీ (సాయ్) హాస్టల్‌లో చేరడంతో శిక్షణ పద్ధతిగా సాగింది. మంజు అనే జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌తో దేవేంద్ర వివాహం జరిగింది. ‘పెళ్లి కాకముందు మా ఆమ్మ, పెళ్లయ్యాక నా భార్య కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. నా కోసం మంజు కబడ్డీని వదిలేసింది. శిక్షణ కోసం నేనెప్పుడూ ఇంటికి దూరంగానే ఉంటాను. ఇంటికి సంబంధించిన ఏ సమస్యలు కూడా ఈ ఇద్దరూ నా దాకా తీసుకురారు. నేను ఎక్కడ ఉన్నా నా ఆహారం, అవసరాలు మా నాన్న చూసుకునేవారు. కుటుంబం సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు’ అని దేవేంద్ర గర్వంగా చెబుతాడు.
 
 ప్రోత్సాహం బాగుంది: దేవేంద్ర విజయంలో ‘సాయ్’ కోచ్ సునీల్ తన్వర్ పాత్ర చాలా ఉంది. ఈసారి పారాలింపిక్స్‌కు ముందు భుజం గాయం కావడంతో ఆందోళన చెందినా... కోచ్ సునీల్ ప్రత్యేక శిక్షణతో సన్నాహాలకు ఇబ్బంది కలగలేదు. 2004లో స్వర్ణం గెలిచిన తర్వాత అర్జున అవార్డుతో, 2012లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం దేవేంద్రను గౌరవించింది. అలాగే భారత ప్రభుత్వం ఈసారి ఒలింపిక్స్‌కు ముందు ఏర్పాటు చేసిన ‘టాప్’ స్కీమ్‌లో దేవేంద్ర కూడా ఉన్నాడు. అలాగే గోస్పోర్‌‌ట్స ఫౌండేషన్ కూడా సహాయం చేసింది.  
 
 కెన్యా అథ్లెట్ నుంచి స్ఫూర్తి: ఏప్రిల్ నుంచి జులై వరకు ఫిన్లాండ్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ జులియస్ యెగో అనే కెన్యా త్రోయర్‌తో స్నేహం చేశాడు. అతని జీవితం నుంచి తనకు చాలా స్ఫూర్తి లభించిందని దేవేంద్ర చెప్పాడు. ‘యెగో జీవితం గురించి వింటే ఎవరికై నా కన్నీళ్లు వస్తారుు. అతని వైకల్యం కథ, విరిగిపోరుున మంచం మీద నిద్ర, యూట్యూబ్‌లో చూసి జావెలిన్ త్రో నేర్చుకోవడం ఇలా అనేక విషయాలు చెప్పాడు. అవన్నీ వింటే ఎవరికై నా స్ఫూర్తి వస్తుంది. నేను కచ్చితంగా స్వర్ణం గెలుస్తానని యెగో చెప్పేవాడు. నా విజయం వెనక ఉన్న బలమైన శక్తి, స్ఫూర్తి అతను’ అని దేవేంద్ర తెలిపాడు.
 
ఆరేళ్ల కూతురికి ఇచ్చిన మాట
 పారాలింపిక్స్‌కు ముందు దేవేంద్ర తన ఆరేళ్ల కూతురు జియాతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. లోయర్ కిండర్ గార్టెన్ (ఎల్‌కేజీ) చదువుతున్న జియా తన క్లాస్ ఎగ్జామ్స్‌లో ఫస్ట్ వస్తే దేవేంద్ర కూడా స్వర్ణం గెలవాలనేది ఆ ‘డీల్’. ‘ఓ రోజు నా కూతురు ఫోన్ చేసి నాన్నా నేను ఫస్ట్‌వచ్చాను. ఇక నీవంతు అని గర్వంగా చెప్పింది. ఒలింపిక్ స్టేడియంలో అడుగుపెడుతుంటే నా కూతురు మాటలే నా చెవిలో మార్మోగాయి’ అని దేవేంద్ర సంబరంగా అంటున్నాడు.
 
 భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఈ ఈవెంట్ జరిగింది. ‘నా కూతురు నిద్ర లేవగానే ఈ విషయం చెప్పాలి. తన సంతోషాన్ని చూడాలి’ అని చెప్పాడు. దేవేంద్రకు రెండేళ్ల కుమారుడు కావ్యన్ ఉన్నాడు. ‘మా అబ్బాయికి నేను ఎలా ఉంటానో కూడా సరిగా తెలియదు. వాళ్ల అమ్మ ఫొటో చూపించి మీ నాన్న అని చెబుతుంది. ఈ రెండేళ్లలో నేను చాలా తక్కువ సందర్భాల్లో ఇంటికి వెళ్లాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కువ సమయం పిల్లలతో గడపాలి’ అని దేవేంద్ర చెప్పాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement