తండ్రి నిరాదరణ.. కటిక దారిద్ర్యం.. ఆపై స్వర్ణం!
రియో డీ జనీరో: నిన్న మొన్నటివరకు ఎవరికీ పెద్దగా తెలియని తమిళనాడుకు చెందిన తంగవేలు పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇందుకు కారణం రియో పారాలింపిక్స్లో స్వర్ణంతో సత్తా చాటడమే. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని 21 ఏళ్ల తంగవేలు నిరూపించాడు. కటిక దరిద్రాన్ని అనుభవించి నిలచిన తంగవేలు జీవితం ఇప్పుడు అందిరికీ స్ఫూర్తిదాయకం.
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని ఓ చిన్నగ్రామం తంగవేలుది. తంగవేలుకు ఐదు సంవత్సరాల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితంలో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. స్కూల్ కు వెళ్తుండగా తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తంగవేలు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని కుడి మోకాలు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అతని జీవితంలో అలుముకున్న చీకటిని జయించడానికి తల్లి విశ్వప్రయత్నమే చేసింది. మరియప్పన్ తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో ఆ భారం తల్లికి మరింత ఎక్కువైంది. ఒక గదిలో 500 రూపాయిలకు అద్దెకు ఉంటూనే కూరగాయలు వ్యాపారం చేసుకునే మరియప్పన్ తల్లి.. కుమారుని వైద్యం కోసం మూడు లక్షల అప్పు తీసుకుంది. అయితే ఆ అప్పుతీర్చడానికి అతని తల్లి పడని కష్టాలంటూ లేవు.
ఇదంతా ఒక ఎత్తైతే.. అతనిలోని ప్రతిభ గుర్తించింది మాత్రం కోచ్ సత్యనారాయణ. 2013 లో జరిగిన పారా అథ్లెటిక్స్ చాంపియన్స్షిప్లో తంగవేలు సత్తాచాటడంతో అతనిలో అపారమైన నైపుణ్యం ఉందని కోచ్ భావించాడు. దీనిలో భాగంగా అతన్ని ప్రత్యేక శిక్షణ కోసం బెంగళూరు తీసుకొచ్చాడు. అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గతేడాది జరిగిన సీనియర్ లెవల్ పోటీలో తంగవేలు టీ-42 కేటగిరీలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ట్యునిసియాలో జరిగిన క్వాలిఫికేషన్ పోటీల్లో సత్తా చాటి రియోకు అర్హత సాధించాడు. పారాలింపిక్స్లో పతకమే లక్ష్యంగా అక్కడకు వెళ్లిన తంగవేలు.. పసిడితో యావత్ భారతాన్ని ఆనందంలో ముంచెత్తాడు.