7 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు...
భారత బౌలర్ల గురించి ఈ టోర్నీ ఆరంభం నుంచి బాగా గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఇంత అద్భుతమైన బౌలింగ్ లైనప్ మనకుంది అంటే నమ్మలేని విధంగా నిలకడ చూపిస్తున్నారు. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఏడు జట్లను ఆలౌట్ చేయడం అంటే... వహ్... ఇంతకంటే ఏం కావాలి. ముఖ్యంగా పేసర్లు చెలరేగిపోతున్న తీరు నభూతో... ఎవరైనా ఒకరు ఇబ్బంది పడుతుంటే రెండో బౌలర్ వెంటనే బంతి అందుకుని తనని ఒత్తిడి నుంచి బయటకు తీసుకెళుతున్నాడు.
ఈ మ్యాచ్‌లో మన టాప్ స్టార్ షమీ మీద ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే ఎదురుదాడి జరిగింది. తమీమ్ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. వెంటనే మోహిత్ అందుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చూశాడు. ఇక తన రెండో స్పెల్‌లో షమీ మరింత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫామ్‌లో ఉన్న మహ్మదుల్లా, నిలకడగా ఆడుతున్న సర్కార్‌ల వికెట్లతో బంగ్లా వెన్ను విరిచాడు. ఇక ఉమేశ్ తన తొలి స్పెల్ ఐదు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. ఇలా ప్రతి బౌలర్ తన పాత్ర సమర్ధంగా పోషించాడు. మరో 2 మ్యాచ్‌లు ఇదే జోరు చూపితే చాలు.