టీమిండియా చేతిలో 0-1 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (నవంబర్ 25) జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేయగా, 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ మరో 17 బంతులు మిగిలుండగానే ఆడుతూపాడుతూ విజయం సాధించింది. టామ్ లాథమ్ (104 బంతుల్లో 145; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) భారీ అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
కాగా, ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేక దారుణంగా విఫలమైన టీమిండియా బౌలర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత పేలవమైన బౌలింగా అని మండిపడుతున్నారు. భారత బౌలర్ల ప్రదర్శన నానాటికీ మరీ తీసికట్టుగా మారుతుందని ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా.. కీలక దశలో ఒకే ఓవర్‌లో 25 పరుగులు సమర్పించుకుని, జట్టు ఓటమికి ప్రధాన కారణమైన శార్దూల్ ఠాకూర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. శార్దూల్‌ను బౌలర్ అనే వాడిని గూబ గుయ్ అనేలా వాయించాలని సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
8.1 ఓవర్లు వేసి 68 పరుగులు సమర్పించుకున్న అర్షదీప్‌ను సైతం ఏకి పారేస్తున్నారు. మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంట్రా బాబూ అని తలలుపట్టుకుంటున్నారు. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ అని గొప్పలు చెప్పుకున్న ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో మండిపడుతున్నారు. ఎన్ని మ్యాచ్‌లు అవకాశం ఇచ్చినా చహల్ తీరు మారడం లేదని, ఇతన్ని కూడా పక్కకు పెడితే బుద్ధి వస్తుందని అంటున్నారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ (4.2 ఎకానమీ)ను మినహాయించి భారత బౌలర్లందరిపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment