ఆసీస్ బలహీనతలపై దృష్టి పెట్టాలి
భారత బౌలర్లకు రమీజ్ రాజా సూచన
న్యూఢిల్లీ: ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాను దీటుగా ఎదుర్కోవాలంటే తమ బౌలర్ వహాబ్ రియాజ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని భారత బౌలర్లకు పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సూచించారు. ఆసీస్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో రియాజ్ అద్భుతమైన స్పెల్‌తో చెలరేగాడని గుర్తు చేశారు. ‘రియాజ్ బంతితో అద్భుతాలు చేశాడు. అతని వేగం, కచ్చితమైన బౌన్సర్లకు స్టార్లతో కూడిన ఆసీస్ లైనప్ వద్ద సమాధానం లేకపోయింది. పాక్ మ్యాచ్ అయితే ఓడిపోయిందేమోగానీ రియాజ్ బౌలింగ్ సూపర్బ్.
కాబట్టి భారత బౌలర్లు ఆసీస్ బలహీనతలపై దృష్టిపెట్టాలి’ అని రమీజ్ పేర్కొన్నారు. ఆసీస్‌తో మ్యాచ్ ఓడటానికి పాక్ ఫీల్డింగ్ వైఫల్యమే కారణమన్నారు. ‘పాక్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. ఆటగాళ్లలో చురుకుదనం కొరవడింది. దీనివల్ల కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లు కూడా జారవిడిచారు. ఉత్తమ ఫీల్డర్లను సరైన ప్రదేశాల్లో నిలబెట్టాలి. కానీ మిస్బా పాతకథే పునరావృతం చేశాడు. మంచి ఫీల్డర్‌ను తీసుకెళ్లి బౌండరీ లైన్ వద్ద పెట్టాడు. దీనివల్ల ఏం లాభం’ అని రమీజ్ విమర్శించారు. ప్రస్తుతం భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి నెలకొందన్నారు.