
తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం
నేడే చూడండి!
సచిన్ అభిమానుంలంతా నేడు (గురువారం) టీవీల ముందు కూర్చోవడం మంచిది. భారత్ రెండు వికెట్లు కోల్పోగానే మాస్టర్ బ్యాటింగ్‌కు వస్తాడు. ఓపెనర్లు ధావన్, విజయ్‌లతో పాటు ఫస్ట్‌డౌన్‌లో వచ్చే పుజారా... ఈ ముగ్గురూ కలిసి రోజంతా ఆడితే తప్ప సచిన్ ఈ రోజే బ్యాటింగ్‌కు రావడం ఖాయం. అది గంటలోపా... లేక సాయంత్ర సెషన్‌లోనా అనేది భారత యువ ‘టాప్ ఆర్డర్’ చేతుల్లో ఉంది.
సచిన్ మానియాతో ఊగిపోతున్న ఈడెన్ గార్డెన్స్‌లో ధోనిసేన అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. కొత్త కుర్రాడు మహ్మద్ షమీ సూపర్ స్పెల్‌తో చెలరేగడంతో తొలి రోజు భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆరంభంలో విండీస్ పటిష్ట స్థితిలో ఉన్నా మ్యాచ్ గడిచేకొద్ది చేతులెత్తేసింది. దీంతో తక్కువ స్కోరుకే ఆలౌటై కష్టాల్లో పడింది. మరోవైపు భారత ఓపెనర్లు జట్టుకు శుభారాంభాన్నిచ్చారు.
కోల్‌కతా: అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫేర్‌వెల్ సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. సచిన్ నామస్మరణతో మారుమోగుతున్న ఈ‘డెన్’లో తొలి టెస్టు ఆడుతున్న 23 ఏళ్ల మహ్మద్ షమీ మెరుపులు మెరిపించాడు. రివర్స్ స్వింగ్ బంతులతో మ్యాజిక్ చేస్తూ భారీ హిట్టర్లున్న ప్రత్యర్థి జట్టును వణికించాడు.
దీంతో బుధవారం వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు భారత్ ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్‌లో విఫలమైన స్యామీసేన తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. శామ్యూల్స్ (65) ఒంటరిపోరాటం చేయగా, చందర్‌పాల్ (36), పావెల్ (28) ఓ మోస్తరుగా ఆడారు.
ఓ దశలో 138/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్ 96 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది. షమీ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ధావన్ (21 బ్యాటింగ్), విజయ్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలో వరుసగా నిలబడి సచిన్‌కు గౌరవ అభివాదం చేశారు.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: గేల్ (సి) విజయ్ (బి) భువనేశ్వర్ 18; పావెల్ (సి) భువనేశ్వర్ (బి) షమీ 28; డారెన్ బ్రేవో రనౌట్ 23; శామ్యూల్స్ (బి) షమీ 65; చందర్‌పాల్ (బి) అశ్విన్ 36; రామ్‌దిన్ (బి) షమీ 4; స్యామీ (సి) భువనేశ్వర్ (బి) ఓజా 16; షిల్లాంగ్‌ఫోర్డ్ ఎల్బీడబ్ల్యూ (బి) సచిన్ 5; పెరుమాల్ (సి) అండ్ (బి) అశ్విన్ 14; బెస్ట్ నాటౌట్ 14; కొట్రీల్ (బి) షమీ 0; ఎక్స్‌ట్రాలు: (బైస్ 4, లెగ్‌బైస్ 7) 11; మొత్తం: (78 ఓవర్లలో ఆలౌట్) 234.
వికెట్లపతనం: 1-34; 2-47; 3-138; 4-138; 5-143; 6-172; 7-192; 8-211; 9-233; 10-234 బౌలింగ్: భువనేశ్వర్ 14-6-33-1; మహ్మద్ షమీ 17-2-71-4; అశ్విన్ 21-9-52-2; ఓజా 24-6-62-1; సచిన్ 2-1-5-1.
భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 21; విజయ్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: (12 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 37.
బౌలింగ్: బెస్ట్ 2-0-15-0; కొట్రీల్ 5-2-13-0; షిల్లాంగ్‌ఫోర్డ్ 4-2-8-0; పెరుమాల్ 1-0-1-0.
సెషన్-1
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు గేల్ (18), పావెల్ (28) శుభారంభాన్నివ్వలేకపోయారు. వికెట్‌పై ఉండే తేమను సద్వినియోగం చేసుకున్న భువనేశ్వర్ ఆరంభంలో చెలరేగిపోయాడు. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో హిట్టింగ్‌కు మారుపేరైన గేల్‌ను కట్టడి చేశాడు. రెండో ఎండ్‌లో షమీ కూడా ఓపెనర్లను ఇబ్బందులుపెట్టాడు. దీంతో విండీస్‌కు పరుగుల రాక మందగించింది. ఈ క్రమంలో భువీ... ఓ లో డెలివరితో గేల్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ధోని తన వ్యూహాన్ని మార్చి షమీ ఎండ్ మార్చాడు. ఫలితంగా షమీ ఓ చక్కని బంతితో పావెల్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో స్యామీసేన 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డారెన్ బ్రేవో (23)కు జత కలిసిన శామ్యూల్స్ నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
సెషన్-2
లంచ్ తర్వాత బ్రేవో నెమ్మదిస్తే శామ్యూల్స్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఓజా బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి గాడిలో పడ్డాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 19వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వీరి దూకుడుకు షమీ రివర్వ్ స్వింగ్‌తో అడ్డుకట్ట వేశాడు. 44వ ఓవర్‌లో ఓ షార్ప్ ఇన్ కట్టర్‌తో శామ్యూల్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.
దీంతో మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చందర్‌పాల్ క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించగా... తర్వాతి ఓవర్‌లో బ్రేవో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ (46)లో రామ్‌దిన్ (4)ను షమీ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన స్యామీ (16), షిల్లాంగ్‌ఫోర్డ్ (5) కూడా ఎక్కువసేపు నిలబడకపోయారు. దీంతో 192/7 స్కోరుతో విండీస్ టీ విరామానికి వెళ్లింది. మొత్తానికి ఈ సెషన్‌లో షమీ హవా నడిచింది.
సెషన్-3
ఓ ఎండ్‌లో సహచరులు చకచకా అవుటవుతున్నా రెండో ఎండ్‌లో చందర్‌పాల్ ఆచితూచి ఆడాడు. అయితే ఈ దశలో అశ్విన్ చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. వరుస విరామాల్లో పెరుమాల్ (14)తో పాటు నిలకడగా ఆడుతున్న చందర్‌పాల్‌ను అవుట్ చేసి విండీస్‌కు షాకిచ్చాడు. తర్వాత కొద్దిసేపటికే కొట్రీల్‌ను షమీ పెవిలియన్‌కు పంపడంతో 234 పరుగుల వద్ద కరీబియన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు నిలకడకు ప్రాధాన్యమిచ్చారు.
ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన ధావన్... కొట్రీల్ బౌలింగ్‌లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. బెస్ట్ బౌలింగ్‌లో విజయ్ వరుసగా రెండు బౌండరీలు సాధించడంతో భారత్ స్కోరుబోర్డు పరుగెత్తింది. తర్వాత నెమ్మదించిన ఈ జోడి సింగిల్స్, డబుల్స్‌పై దృష్టిపెట్టి బ్యాటింగ్‌ను రొటేట్ చేస్తూ రోజును ముగించింది. 12 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
సచిన్‌కు అంకితం
‘తొలి టెస్టులో సాధించిన నాలుగు వికెట్ల ఘనతను సచిన్‌కు అంకితమిస్తున్నా. మాస్టర్‌తో కలిసి ఆడాలన్న నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా పెద్ద విషయం. నేను సాధించిన గొప్ప ఘనత కూడా ఇదే. టి20, వన్డేల్లో ఆడిన నేను టెస్టులోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకున్నా. అదీ నెరవేరింది. బంతులను మార్చడం వల్ల రివర్స్ స్వింగ్ సులువుగా సాధ్యమైంది. తొలి బంతి చాలా మృదువుగా ఉండటంతో ఎక్కువ స్వింగ్‌ను రాబట్టలేకపోయా. కానీ బంతిని మార్చిన తర్వాత రివర్స్ స్వింగ్ లభించింది. మొదట తీసిన పావెల్ వికెట్ ఎప్పటికీ ప్రత్యేకమే. సవాళ్లను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటా.’
- షమీ (భారత పేసర్)
కెవ్వు కేక
సరిగ్గా మధ్యాహ్నం 1.36 నిమిషాలు.. అప్పటిదాకా ఈడెన్ గార్డెన్స్‌లో కాస్త స్తబ్ధుగానే కూర్చున్న ప్రేక్షకులు ఒక్కసారిగా సాచిన్... సాచిన్ అంటూ హోరెత్తిపోయారు. కెప్టెన్ ధోని.. బౌలింగ్ చేయమంటూ బంతిని సచిన్ వైపు విసరడమే ఈ అరుపులకు కారణం. అటు క్రీజులో ఉన్న విండీస్ బ్యాట్స్‌మెన్ కూడా ఆశ్చర్యపోయారు. 40 వేల ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య బౌలింగ్ ప్రారంభించిన సచిన్ తొలి బంతిని లెగ్ బ్రేక్‌గా వేయడంతో షిల్లింగ్‌ఫోర్డ్ డిఫెన్స్‌గా ఆడాడు. రెండో బంతి గూగ్లీకి లైగ్‌బైస్‌గా వెళ్లడంతో నాలుగు పరుగులు వచ్చాయి. రెండు బంతుల అనంతరం షిల్లింగ్‌ఫోర్డ్‌ను ఎల్బీగా అవుట్ చేయడంతో వేలాది గొంతుకలు మరోసారి మాస్టర్ నామస్మరణలో మునిగిపోయాయి. తొలి రోజే సచిన్ బ్యాటింగ్ విన్యాసాలు చూద్దామని ఈడెన్‌కు వచ్చిన ప్రేక్షకులు భారత్ ఫీల్డింగ్‌కు దిగడంతో నిరుత్సాహపడినా.. ఇలా బౌలింగ్‌తో మాస్టర్ వారి మనసు దోచుకున్నాడు.
కొనసాగుతున్న క్యాబ్ పొరపాట్లు
మాస్టర్ చివరి సిరీస్ పట్ల అత్యుత్సాహమో.. ఏమరుపాటో తెలీదు కానీ క్యాబ్ చేస్తున్న కొన్ని ఏర్పాట్లు వారి పరువు తీస్తున్నాయి. ఇప్పటికే స్టేడియంలో ఏర్పాటు చేసిన బిల్‌బోర్డులో సచిన్ పేరును సచినిగా పేర్కొంటూ అభాసుపాలైనా తీరు మారలేదు. తాజాగా తొలి రోజు ఆట లంచ్ సమయంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన సచిన్ సతీమణి అంజలి గురించి స్టేడియంలో ఉన్న భారీ స్క్రీన్ మీద ‘మిస్టర్ అంజలి టెండూల్కర్ అండ్ మాస్టర్ అర్జున్ టెండూల్కర్‌కు స్వాగతం’ అంటూ చూపించారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని దాన్ని సరిచేశారు.
బుక్‌లెట్ ప్రదానం
సచిన్ క్రికెట్ జీవితంపై అరుదైన ఫొటోగ్రాఫ్స్, జ్ఞాపకాలతో కూడిన బుక్‌లెట్‌ను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) విడుదల చేసింది. దీన్ని తొలి రోజు ఆట సందర్భంగా సచిన్‌కు అందించింది. తొలి పేజీపై కెరీర్ తొలినాళ్లలో రింగు రింగుల జుట్టుతో ఉన్న యువ టెండూల్కర్ చిత్రాన్ని జోగేన్ చౌధురి గీశారు. కుటుంబసభ్యులతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో దిగిన పలు ఫొటోలు ఇందులో ఉన్నాయి. అలాగే రిచర్డ్స్‌తో కలిసి చెస్ ఆడుతున్న ఫొటోను కూడా పొందుపరిచారు.
ఈడెన్‌లో హంగామా
కోల్‌కతా: ఉద్యోగులు తమ విధులకు సెలవు పెట్టారు.. పాఠశాల, కాలేజీ విద్యార్థులు తరగతులకు డుమ్మా కొట్టారు.. అందరి దారీ ఈడెన్ గార్డెన్స్ వైపే.. కోల్‌కతా అంతా మాస్టర్ ఫీవర్‌తో ఊగిపోయింది. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల చేతుల్లో సచిన్ టెండూల్కర్ భారీ చిత్రపటాలు కనిపించాయి. అందులో ‘ఆటను ఆస్వాదించు.. కలలను ఛేదించు.. స్వప్నాలను సాకారం చేసుకో’ అనే సచిన్ కొటేషన్‌ను కూడా పొందుపరిచారు. కొందరైతే త్రివర్ణ రంగులతో సచిన్ అనే పేరును తమ ముఖాలపై రాయించుకున్నారు. ఇరు జట్ల కెప్టెన్లు టాస్ వేసేందుకు వెళ్లినప్పుడు కూడా స్టేడియం అంతా సచిన్ పేరుతో మారుమ్రోగింది. అయితే టాస్ ఓడడంతో నిరాశచెందారు.
సచిన్ కోసం వెయిటింగ్
ఈడెన్ గార్డెన్స్‌లో 70 వేల సామర్థ్యమున్నా ప్రత్యక్షంగా వీక్షించింది మాత్రం 40 వేల మందే. టిక్కెట్లు కొనుక్కున్నా.. వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగిందనే వార్త తెలుసుకున్న చాలామంది మ్యాచ్‌కు దూరంగా ఉండిపోయారు. సగం సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. మాస్టర్ కోసం మరో రోజు వేచి చూద్దామని అభిమానులు భావించారు. నేడు (గురువారం) పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది.
బీసీసీఐ ‘థ్యాంక్యూ సచిన్’
కెరీర్‌లో చివరి సిరీస్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు బీసీసీఐ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ట్విట్టర్‌లో హాష్‌లాగ్‌తో థ్యాంక్యూ సచిన్ అని బీసీసీఐకి ట్వీట్ చేస్తే చాలు.. వెంటనే అభిమానులకు బోర్డు నుంచి సచిన్ ఫొటో ఒకటి వస్తుంది. అంతేకాకుండా ఓ మెసేజి, సచిన్ ఆటోగ్రాఫ్ కూడా తిరుగు ట్వీట్‌లో వచ్చి ఆశ్చర్యపరుచనుంది. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే బోర్డు ఈ ప్రచారాన్ని చేపట్టగా వెంటనే కోట్లాది సందేశాలు వెళ్లాయి.
మీకూ ఆటోగ్రాఫ్ ఉన్న ఫొటో కావాలా?
ట్విట్టర్‌లోకి లాగిన్ అయ్యి # thankyou sachin అని రాసి @BCCI కి ట్వీట్ చేయండి