
ఫైనల్లో సెంట్రల్ జోన్
మొహాలీ: పరుగుల వరద పారిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా సెంట్రల్ జోన్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.
మొహాలీ: పరుగుల వరద పారిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా సెంట్రల్ జోన్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. నార్త్ జోన్‌తో ‘డ్రా’గా ముగిసిన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ చివరి రోజు శనివారం రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైంది. మహేశ్ రావత్ (161 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 116) సెంచరీ చేయగా... కరణ్ శర్మ (66 బంతుల్లో 12 ఫోర్లతో 69), కుల్దీప్ యాదవ్ (105 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 56) అర్ధసెంచరీలతో కదంతొక్కారు.
అనంతరం 394 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్‌ల అంగీకారంతో మ్యాచ్‌ను పది ఓవర్ల ముందుగానే ముగించారు. ఈనెల 29న న్యూఢిల్లీలో మొదలయ్యే ఫైనల్లో సౌత్‌జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడుతుంది.
సంక్షిప్త స్కోర్లు
సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: 538, నార్త్ జోన్ తొలి ఇనింగ్స్: 457, సెంట్రల్ జోన్ రెండో ఇన్నింగ్స్: 312 (మహేశ్ రావత్ 116, కరణ్ శర్మ 69, కుల్దీప్ యాదవ్ 56, నమన్ ఓజా 40, అవానా 3/40, రిషి ధావన్ 2/52), నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్: 16/1.