టైటాన్స్ గెలిచిందోచ్
లక్నో: ప్రొ కబడ్డీ లీగ్‌లో 8 మ్యాచ్‌ల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో నెగ్గిన టైటాన్స్... ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఇందులో ఏడింట ఓడిపోగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. తాజాగా శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 37–32 స్కోరుతో యు ముంబాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండర్ సోంబిర్ ప్రత్యర్థి రైడర్లను వణికించాడు.
8 టాకిల్ పాయింట్లు సాధించాడు. రైడింగ్‌లో రాహుల్ చౌదరి అదరగొట్టాడు. 20 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను 13 పాయింట్లు చేశాడు. వీరిద్దరి ప్రతిభతో టైటాన్స్ జట్టు యు ముంబాను రెండు సార్లు ఆలౌట్ చేసింది. మిగతా వారిలో నీలేశ్ సాలుంకే, విశాల్ భరద్వాజ్ చెరో 3 పాయింట్లు సాధించారు. యు ముంబా జట్టులో రైడర్ అనూప్ కుమార్ (9) రాణించాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 36–29తో యూపీ యోధ జట్టుపై విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్, యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. ‘స్టార్ స్పోర్ట్స్–2’ చానల్ ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.