కోహ్లిని ఊరిస్తున్న టీ20 రికార్డులు | IND Vs NZ: Kohli Eyes Special 50 In Five Match T20I Series | Sakshi
Sakshi News home page

కోహ్లిని ఊరిస్తున్న టీ20 రికార్డులు

Published Thu, Jan 23 2020 11:17 AM | Last Updated on Thu, Jan 23 2020 11:33 AM

IND Vs NZ:  Kohli Eyes Special 50 In Five Match T20I series - Sakshi

ఆక్లాండ్: వరుస సిరీస్‌లు గెలుస్తూ మంచి జోరు మీదున్న టీమిండియా ఇప్పుడు మరో ద్వైపాక్షిక సిరీస్‌కు సన్నద్ధమైంది. న్యూజిలాండ్‌ పర‍్యటనలో భాగంగా శుక్రవారం తొలి టీ20తో సుదీర్ఘ సిరీస్‌ను భారత్‌ ఆరంభించనుంది. కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని రెండు టీ20  రికార్డులు ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో మరో ఎనిమిది సిక్స్‌లు కొడితే కోహ్లి యాభై సిక్సర్లు కొట్టిన రెండో కెప్టెన్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో 74 సిక్స్‌లు కొట్టిన కోహ్లి.. కెప్టెన్‌గా 50 సిక్స్‌లను చేరుకోవడానికి 8 సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. ఇటీవల కాలంలో సిక్సర్లను కూడా అలవోకగా కొడుతున్న కోహ్లి.. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఈ ఫీట్‌ను సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్ల కొట్టిన కెప్టెన్ల జాబితాలో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఇయాన్‌ మోర్గాన్‌(62) టాప్‌లో కొనసాగుతున్నాడు. 

ఇక పరుగుల విషయంలోనూ విరాట్ కోహ్లి మరో టీ20 రికార్డు నెలకొల్పే ఆస్కారం ఉంది. భారత్‌ తరఫున టీ20ల్లో కెప్టెన్‌గా ఎంఎస్ ధోని 1,112 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి1,032 పరుగులతో ఉన్నాడు. దాంతో ధోని రికార్డును కూడా కోహ్లి బ్రేక్‌ చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఇప్పటి వరకూ 1,273 పరుగులతో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. కోహ్లి మరో 80 పరుగులు చేస్తే ధోనీ రికార్డు, 241 పరుగులు చేస్తే డుప్లెసిస్‌ రికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం డుప్లెసిస్‌ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(1083) ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లి-విలియమ్సన్‌ల మధ్య ‘పరుగుల పోరు’ కొనసాగడం ఖాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement