ఆక్లాండ్: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో మార్టిన్ గప్టిల్(79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్(41; 59 బంతుల్లో 5 ఫోర్లు), రాస్ టేలర్(73 నాటౌట్; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించగా, బ్లండెల్(22), జెమీసన్(25 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు ఫర్వాలేదనిపించారు. ఇక ఐదుగురు బ్యాట్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అటు బౌలింగ్‌లోనూ ఇటు ఫీల్డింగ్‌లోను ఆకట్టుకున్న టీమిండియా.. కివీస్‌ను మూడొందల మార్కును చేరకుండా నియంత్రించింది. (ఇక్కడ చదవండి: జడేజా.. నువ్వు సూపరమ్మా!)
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను గప్టిల్-నికోలస్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన తర్వాత నికోలస్(41) ఔటయ్యాడు. చహల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, గప్టిల్ హాఫ్‌సెంచరీతో మెరిశాడు. నికోలస్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్లండెల్(22) ఎంతో సేపు ఆడలేదు. శార్దూల్ ఠాకూర్ వేసిన 27 ఓవర్ మూడో బంతికి బ్లండెల్ ఔటయ్యాడు. దాంతో 142 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్‌ను కోల్పోయింది.
ఆపై కాసేపటికి గప్టిల్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగుల వద్ద ఉండగా రనౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 30 ఓవర్ రెండో బంతిని రాస్ టేలర్ షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే దానికి సింగిల్‌కు రమ్మంటూ గప్టిల్‌ను పిలిచాడు. దాంతో ఇద్దరూ పరుగు కోసం ప్రయత్నిస్తుండగా శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకుని కీపర్ రాహుల్ విసిరాడు. దాంతో వెంటనే వికెట్లను గిరటేయడం, గప్టిల్ ఎటువంటి అనుమానం లేకుండా పెవిలియన్‌కు చేరుకోవడం జరిగిపోయాయి. (ఇక్కడ చదవండి: అయ్యో గప్టిల్.. ఎంత పొరపాటాయే!)
గప్టిల్ రనౌటైన కాసేపటికి కివీస్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను నష్టపోయింది. 34 ఓవర్‌లో తొలి బంతికి టామ్ లాథమ్(7) ను రవీంద్ర జడేజా ఎల్బీగా ఔట్ చేసి పెవిలియన్‌కు పంపి మంచి బ్రేక్ ఇవ్వగా. ఆపై మరుసటి ఓవర్ రెండో బంతికి జేమ్స్ నీషమ్(3)ను జడేజా రనౌట్ చేసి శభాష్ అనిపించాడు. గప్టిల్ రనౌట్‌లో భాగమైన రాస్ టేలర్.. మరో రనౌట్‌లో కూడా పాలుపంచుకున్నాడు. నవదీప్ సైనీ వేసిన 35 ఓవర్ రెండో బంతిని రాస్ టేలర్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లోకి షార్ట్ ఆడాడు. దాంతో సింగిల్‌కు యత్నించగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా డైరెక్ట్ త్రో విసిరి స్ట్రైకర్స్ ఎండ్‌లోని బెయిల్స్ పడగొట్టాడు. నీషమ్ క్రీజ్‌లోకి రావడానికి చాలా దూరంలో ఉండగానే జడేజా వేసిన అద్భుతమైన త్రోకు కివీస్ మరో మూల్యాన్ని చెల్లించుకుంది. దాంతో టీమిండియా సంబరాలు చేసుకోగా, రెండో రనౌట్‌తో కివీస్ శిబిరంలో ఆందోళన రేకెత్తించింది.
ఆపై గ్రాండ్ హోమ్(5)ను శార్దూల్ ఔట్ చేయగా, మార్క్‌చాప్‌మన్(1)ను చహల్ పెవిలియన్‌కు పంపాడు. ఇక సౌతీ(3)ని చహల్ ఔట్ చేయగా,టేలర్ కడవరకూ క్రీజ్‌లో ఉండి హాఫ్ సెంచరీ సాధించాడు. 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం నమోదు చేయడంతో కివీస్ స్కోరు బోర్డు కాస్త గాడిలో పడింది. అతనికి జెమీసన్ నుంచి సహకారం లభించడంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. తొమ్మిదో వికెట్‌కు టేలర్-జెమీసన్‌లు అజేయంగా 76 పరుగులు జత చేయడంతో కివీస్ పోరాడే లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. టీమిండియా బౌలర్లలో చహల్ మూడు వికెట్లు సాధించగా, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. (ఇక్కడ చదవండి: గప్టిల్ నయా రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment