విజయాన్ని చీకటి కమ్మేసింది! | indai miss the win to first test match | Sakshi
Sakshi News home page

విజయాన్ని చీకటి కమ్మేసింది!

Published Tue, Nov 21 2017 12:26 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

indai miss the win to first  test match - Sakshi - Sakshi - Sakshi

ఈడెన్‌ గార్డెన్స్‌లో దురదృష్టం భారత జట్టుతో భుజం కలిపి నడిచింది. టెస్టు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ రోజు నేనున్నానంటూ మ్యాచ్‌ వెంట వచ్చిన చీకటిదే చివరకు పైచేయి అయింది. మరి కొద్ది సేపట్లో విజయానందంలో మునగాల్సిన జట్టు నిరాశగా పోరును ముగించాల్సి వచ్చింది. ముచ్చటగా మూడు వికెట్లు తీస్తే చాలు... తొలి టెస్టులో టీమిండియా గెలుపు ఖాయమనుకున్న సమయంలో వెలుతురులేమితో ఆట ఆగిపోయింది. ఈ దశలో 75/7 స్కోరుతో ఓటమికి చేరువైన లంక ఊపిరి పీల్చుకుంది. దాంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసిపోయింది.వర్షం బారిన పడి సగానికి పైగా ఓవర్లు తుడిచి పెట్టుకుపోయిన మ్యాచ్‌ ఆఖరి రోజు ఆటను విరాట్‌ కోహ్లి ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేశాడు. సహచరులు విఫలమైనా... అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ కెరీర్‌లో 50వ సెంచరీ సాధించి ప్రత్యర్థికి 231 పరుగుల లక్ష్యంతో సవాల్‌ విసిరాడు. భువనేశ్వర్, షమీ రివర్స్‌ స్వింగ్‌ దెబ్బకు తల్లడిల్లిన లంక ఏ దశలోనూ గెలుపు గురించి ఆలోచించలేకపోయింది. అయితే తొలి బంతి నుంచి అనూహ్య రీతిలో సాగిన టెస్టుకు ఐదో రోజు ఉత్కంఠభరిత ముగింపు  లభించడం విశేషం.   

కోల్‌కతా: టపటపా వికెట్లు పడిపోతున్నాయి... ఒక వైపు భారత జట్టు ఆటగాళ్లలో ఆనందం కనిపిస్తుంటే మరోవైపు లంక జట్టులో ఆందోళన పెరిగిపోయింది. ఆటను కావాలని మరింత ఆలస్యం చేసే ప్రయత్నం, బంతి కనిపించడం లేదనే ఫిర్యాదు ఒకవైపు... అసహనంతో దానికి అభ్యంతరం చెప్పిన జట్టు మరోవైపు... అరుదైన రీతిలో భారత్, లంక ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, అంపైర్ల జోక్యం... తొలి టెస్టులో చివరి రోజు ఘట్టాలు ఇవి! చివరకు ఇరు జట్లు సమంగా నిలిచాయి. భారత్, శ్రీలంక మధ్య ఇక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 231 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన శ్రీలంక.. మ్యాచ్‌ ముగిసే సమయానికి 26.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ 4, షమీ 2 వికెట్లు తీశారు. దాదాపు మరో 20 ఓవర్ల ఆట మిగిలి ఉన్నా... వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 352 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (119 బంతుల్లో 104 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) టెస్టుల్లో 18వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 8 కీలక వికెట్లు తీసిన భువనేశ్వర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రెండో టెస్టు ఈ నెల 24 నుంచి నాగపూర్‌లో జరుగుతుంది.  

మళ్లీ లక్మల్‌ దెబ్బ...
ఓవర్‌నైట్‌ స్కోరు 171/1తో చివరి రోజు ఆట కొనసాగించిన భారత్‌ తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లాగే పదునైన బంతులతో చెలరేగిన లక్మల్‌ మొదటి గంటలో భారత్‌ను దెబ్బ తీశాడు. ఆదివారం స్కోరుకు మరో ఆరు పరుగులు మాత్రమే జోడించిన రాహుల్‌ (125 బంతుల్లో 79; 8 ఫోర్లు) లక్మల్‌ బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఒకే ఓవర్లో లక్మల్‌ మళ్లీ చెలరేగాడు. అతని అద్భుతమైన బౌన్సర్‌ను ఆడలేక పుజారా (22) స్లిప్‌లో క్యాచ్‌ ఇవ్వగా... రహానే (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. రహానే రివ్యూ చేసినా లాభం లేకపోయింది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన జడేజా (9) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. దాంతో లంచ్‌ సమయానికి భారత్‌ స్కోరు 251/5కి చేరింది.  

విరాట్‌ జోరు...
లంచ్‌ తర్వాత 80 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండ్‌లో అశ్విన్‌ (7), సాహా (5)లను షనక వెంటవెంటనే అవుట్‌ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో 58 పరుగులతో (93 బంతుల్లో) ఉన్న కోహ్లి ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీలంక కొత్త బంతిని తీసుకోగానే అతను దూకుడు ప్రదర్శిస్తూ లక్మల్, షనక ఓవర్లలో బౌండరీలతో చెలరేగిపోయాడు. కోహ్లికి డీఆర్‌ఎస్‌ రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. అతను 72 పరుగుల వద్ద ఉన్నప్పుడు లక్మల్‌ బౌలింగ్‌లో అంపైర్‌ ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించారు. అయితే కోహ్లి రివ్యూ కోరగా... రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లుగా తేలింది. ఎనిమిదో వికెట్‌కు కోహ్లితో 40 పరుగులు జోడించిన తర్వాత భువనేశ్వర్‌ (8) వెనుదిరిగాడు. చివరకు లక్మల్‌ బౌలింగ్‌లోనే ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టి కోహ్లి తన సెంచరీని పూర్తి చేసుకోగానే భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సాహా అవుటయ్యాక కోహ్లి 26 బంతుల్లో 46 పరుగులు చేయడం విశేషం.  

భువీ జోరుకు...
231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన శ్రీలంక భువనేశ్వర్, షమీ బౌలింగ్‌ ధాటికి కకావికలమైంది. వీరిద్దరి అద్భుత బౌలింగ్‌కు తోడు లంక బ్యాట్స్‌మెన్‌ స్వయంకృతం కూడా ఆ జట్టును ప్రమాదంలో పడేసింది. భువీ వేసిన తొలి ఓవర్లో దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి సమరవిక్రమ (0) వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో కరుణరత్నే (1) కూడా సరిగ్గా ఇదే తరహాలో అవుట్‌ కావడంతో టీ విరామానికి లంక 2 వికెట్లకు 8 పరుగుల వద్ద నిలిచింది. చివరి సెషన్‌లో కూడా భారత బౌలింగ్‌ జోరు కొనసాగింది. తిరిమన్నె (7)ను అవుట్‌ చేసి భువీ మరో దెబ్బ కొట్టగా, ఉమేశ్‌ చక్కటి బంతితో మాథ్యూస్‌ (12)ను ఎల్బీగా అవుట్‌ చేయడంతో లంక మరో కీలక వికెట్‌ కోల్పోయింది. ముందుగా అంపైర్‌ తిరస్కరించినా కోహ్లి రివ్యూతో ఈ వికెట్‌ భారత్‌ ఖాతాలో చేరింది. ఈ దశలో చండిమాల్‌ (20), డిక్‌వెలా (36 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి జట్టును రక్షించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు 54 బంతుల్లోనే 47 పరుగులు జత చేశారు. అయితే షమీ అద్భుత బంతితో చండిమాల్‌ను బౌల్డ్‌ చేసి ఈ జోడీని విడదీయగా, అదే స్కోరు వద్ద డిక్‌వెలాను భువీ అవుట్‌ చేశాడు. తన తర్వాతి ఓవర్లో అతను పెరీరా (0) ఆట కూడా ముగించాడు. ఈ దశలో శ్రీలంక ఓటమి ఖాయమనిపించింది. అయితే ఏడు బంతుల తర్వాత ‘లైట్‌ రీడింగ్‌’ ప్రమాణాల ప్రకారం తగినంత వెలుతురు లేదంటూ అంపైర్లు ఆట నిలిపివేయడంతో లంక బతికిపోయింది.  

సెంచరీల ‘హాఫ్‌ సెంచరీ’
విరాట్‌ కోహ్లి పరుగుల ప్రవాహం ఎల్లలు దాటి పరవళ్లు తొక్కుతూనే ఉంది. ఇప్పటికే తన పేరిట పలు రికార్డులు లిఖించుకున్న భారత కెప్టెన్‌ ఇప్పుడు అరుదైన జాబితాలో తనూ భాగమయ్యాడు. సోమవారం లంకపై సాధించిన శతకంతో అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లు కలిపి) 50 సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్‌ (100) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడు విరాట్‌ కాగా... ఓవరాల్‌గా ఎనిమిదో ఆటగాడు. ఇతర ఆటగాళ్ళలో రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా–71 సెంచరీలు), సంగక్కర (శ్రీలంక–63), జాక్‌ కలిస్‌ (దక్షిణాఫ్రికా–62), హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా–54), జయవర్ధనే (శ్రీలంక–54), బ్రియాన్‌ లారా (విండీస్‌–53 సెంచరీలు) మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు. తన 348వ ఇన్నింగ్స్‌లో 50వ సెంచరీని అందుకున్న కోహ్లి, ఆమ్లా (348)తో సమానంగా అందరికంటే వేగంగా ఈ రికార్డు నమోదు చేశాడు. 2017లో కోహ్లికి ఇది 9వ సెంచరీ కావడం విశేషం.   

పుజారా ‘ఐదు రోజుల షో’
భారత బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా కోల్‌కతా టెస్టులో ఆసక్తికర ఘనతను నమోదు చేశాడు. ఒక టెస్టులో ఐదు రోజులు కూడా బ్యాటింగ్‌ చేసిన 9వ ఆటగాడిగా అతను నిలిచాడు. భారత్‌ తరఫున గతంలో ఎంఎల్‌ జయసింహ, రవిశాస్త్రి గతంలో ఐదు రోజుల పాటు ఏదో ఒక దశలో బ్యాటింగ్‌ చేశారు. ఈ ముగ్గురు కూడా ఈడెన్‌ గార్డెన్స్‌లో దీనిని సాధించడం విశేషం. బాయ్‌కాట్‌ (ఇంగ్లండ్‌), కిమ్‌ హ్యూస్‌ (ఆస్ట్రేలియా), అలెన్‌ లాంబ్‌ (ఇంగ్లండ్‌), గ్రిఫిత్‌ (వెస్టిండీస్‌), ఫ్లింటాఫ్‌ (ఇంగ్లండ్‌), అల్విరో పీటర్సన్‌ (దక్షిణాఫ్రికా) ఐదు రోజులు క్రీజ్‌లో గడిపిన ఇతర ఆటగాళ్లు. శ్రీలంకతో టెస్టులో తొలి రోజు 8 పరుగుల వద్ద నిలిచిన పుజారా, రెండో రోజు 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో రోజు 52 పరుగుల వద్ద అవుటైన అతను, నాలుగో రోజు 2 పరుగుల స్కోరుతో అజేయంగా ఉన్నాడు. చివరి రోజు బ్యాటింగ్‌ కొనసాగించి 22 పరుగుల వద్ద అవుటయ్యాడు.   

►1  సొంతగడ్డపై భారత స్పిన్నర్లు ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం ఇదే తొలిసారి కాగా మన పేసర్లు స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లో 17 వికెట్లు పడగొట్టడం కూడా మొదటిసారి కావడం విశేషం.   

మనకు అందుబాటులో ఉన్న సమయంలోనే ఫలితం రాబట్టడం ముఖ్యం. ఐదు రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. తొలి రెండు రోజులు వెనుకబడ్డ మేం మా అసలు సత్తాను ప్రదర్శించాల్సి వచ్చింది. ఇలాంటి పిచ్‌పై పట్టుదలగా ఆడితే తప్ప నిలవలేం. మొత్తంగా మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నాం. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో వేగం పెరిగింది. అవకాశం లభించిన ప్రతీసారి భువీ తనను తాను నిరూపించుకున్నాడు. అతను ప్రతీ టెస్టులో ఉండాల్సిన ఆటగాడు. ముఖ్యంగా విదేశాల్లో అతని పాత్ర కీలకం. లంక కొత్త బంతిని తీసుకోగానే ఎదురు దాడి చేయాలని  నిర్ణయించుకున్నాను. 50 సెంచరీలు సాధించడం సంతోషంగా ఉంది. సెంచరీలకంటే కూడా కీలక సమయంలో బాధ్యతతో బాగా ఆడటమే నాకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది. నేను ఆటనుంచి తప్పుకునే వరకు కూడా నా ఆలోచనా ధోరణి ఇలాగే ఉంటుంది.    
– కోహ్లి, భారత కెప్టెన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement