సిరీస్ గెలుస్తారా?
బెంగళూరు: బంగ్లాదేశ్ 'ఎ' జట్టుతో జరుగుతున్నఅనధికార మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను సాధించాలని భారత్' ఎ' జట్టు పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. ఆ తరువాత శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఓటమి పాలైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు నాసిర్ హుస్సేన్(102) సెంచరీ చేయడంతో రెండో వన్డేలో భారత్ కు ఓటమి తప్పలేదు. దీంతో సిరీస్ 1-1 తో సమం అయ్యింది. ఇరు జట్లు మధ్య కీలకమైన మూడో వన్డే ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ 'ఎ' జట్టు భావిస్తుండగా.. బంగ్లాదేశ్ కూడా రెండో వన్డేలో ఫలితాన్నే పునరావృతం చేయాలని యోచిస్తోంది. ఉన్ముక్ చంద్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత 'ఎ' జట్టు తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్ లో గుర్ కీరత్ సింగ్ ఆల్ రౌండ్ షో అదరగొట్టాడు. గుర్ కీరత్ సింగ్ 65 పరుగులు చేయడమే కాకుండా..తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లను సాధించాడు. దీంతో భారత'ఎ' జట్టు 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కాగా, రెండో వన్డేలో టాస్ ఓడిన బంగ్లా 'ఎ' జట్టు 252 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ స్కోరు ఛేదించే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు తడబడ్డారు. ఉన్ముక్త్ చంద్(56) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మనీష్ పాండే(34), గురుకీరత్ సింగ్(34), మయాంక్ అగర్వాల్(24) లు ఓ మాదిరిగా రాణించినా విజయాన్ని సాధించి పెట్టలేకపోయారు. ఈ తరుణంలో రేపు జరిగే మ్యాచ్ లో బంగ్లా' ఎ'ను కంగుతినిపించాలంటే భారత్ 'ఎ' జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంది.