రాణించిన భారత కుర్రాళ్లు
బెంగళూరు: బంగ్లాదేశ్'ఎ' తో జరుగుతున్న మూడు రోజుల అనధికార మ్యాచ్ లో భారత కుర్రాళ్లు ఆకట్టుకున్నారు. రెండో రోజు ఆటలో భాగంగా 161/1 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం బ్యాటింగ్ చేపట్టిన భారత 'ఎ' జట్టు దూకుడుగా ఆడింది. భారత 'ఎ' జట్టు 411/5 వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి బంగ్లా'ఎ'కు సవాల్ విసిరింది.
భారత 'ఎ' జట్టులో శిఖర్ ధవన్(150;146 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్ లు) కు తోడుగా కరుణ్ నాయర్(71), విజయ్ శంకర్(86) ఆకట్టుకున్నారు. భారత్ స్కోరు 411 పరుగుల వద్ద ఉండగా విజయ్ శంకర్ ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో భారత 'ఎ' జట్టు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ చేసే సమయానికి నమాన్ ఓజా(25) క్రీజ్ లో ఉన్నాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అనాముల్ హక్ (0), సౌమ్య సర్కారు(19) లు పెవిలియన్ కు చేరి బంగ్లాకు షాకిచ్చారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 'ఎ' రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. ప్రస్తుతం 148 పరుగులు వెనుకబడ్డ బంగ్లా చేతిలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 228 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.