ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లోభాగంగా ఆస్ట్రేలియా -ఏతో ఇక్కడ బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 244 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఫించ్(20), మార్ష్(11) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మెడిన్‌సన్(7), మ్యాక్స్‌వెల్(12) విఫలం కావడంతో ఆసీస్‌కు కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్ జట్టులో పోరాట స్ఫూర్తి లోపించడంతో వరుస వికెట్లు చేజార్చుకుని ఓటమి పాలైంది. చివర్లో పెయిన్(47) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 193 పరుగులకే పరిమితమైన ఆసీస్‌కు చుక్కెదురైంది.
భారత బౌలర్లలో నందీమ్‌కు మూడు వికెట్లు, మహ్మద్ షమీకు రెండు వికెట్లు లభించగా, సురేష్ రైనా, పాండే, రసూల్ కు తలో వికెట్టు దక్కింది. అంతకుముందు బ్యాటింగ్ దిగిన భారత్ 49.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ శిఖర్ థావన్(62) పరుగులతో ఆకట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్ ఆటగాడు దినేష్ కార్తీక్(73) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడానికి దోహదపడ్డాడు.
సోమవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.