'యువ' సేన శుభారంభం
హరారే: లక్ష్యం చిన్నదే.. కానీ టీమిండియా ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించలేదు. అంతా 'యువ'కులే.. కానీ ఎటువంటి నిర్లక్ష్యానికి చోటివ్వలేదు. వెరసి జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ ఆకట్టుకున్న ధోని అండ్ గ్యాంగ్ తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జింబాబ్వేకు భారత షాకిచ్చింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100 నాటౌట్;115 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్) శతకంతో రాణించగా, అంబటి రాయుడు(62 నాటౌట్;120 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
జింబాబ్వే విసిరిన 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆదిలో ఓపెనర్ కరుణ్ నాయర్(7) వికెట్ను కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ కేఎల్ రాహుల్కు జతకలిసిన అంబటి రాయుడు ఇన్నింగ్స్ను నెమ్మదిగా ముందుకు నడిపించాడు. వీరిద్దరూ ఏమాత్రం ఏమరపాటుకు గురి కాకుండా సుదీర్ఘ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్, అంబటి రాయుడు హాఫ్ సెంచరీలు సాధించారు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేయడానికి 58 బంతులను ఎదుర్కొంటే, అంబటి రాయుడు అర్థ శతకాన్ని నమోదు చేయడానికి 97 బంతులు వరకూ వేచి చూశాడు. ఈ జోడి 162 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో టీమిండియా 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా విజయానికి రెండు పరుగులు అవసరమైన తరుణంలో రాహుల్ సిక్సర్ సాధించి శతకం సాధించడం విశేషం.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 168 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. జింబాబ్వే జట్టులో చిగుంబరా(41)మినహా ఎవరూ ఆకట్టుకోలేదు టాస్ గెలిచిన ధోని తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే ఆటగాళ్లలో మూర్(3), మసకద్జా(14) , చిబాబా(13) స్వల్ప విరామాల్లో నిష్క్రమించడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.
అనంతరం సిబందా(5), ఎర్విన్(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. ఆపై చిగుంబరాకు జత కలిసిన సికిందర్ రాజా(23) జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడీ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జింబాబ్వే వికెట్లకు కాసేపు బ్రేక్ పడింది. కాగా, సికిందర్ రాజా ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాక, మరోసారి జింబాబ్వే తడబడింది. అయితే చిగుంబరా తొమ్మిదో వికెట్గా వరకూ క్రీజ్ లో ఉండటంతో జింబాబ్వే సాధారణ స్కోరును నమోదు చేయగల్గింది.టీమిండియా బౌలర్లలో బూమ్రా నాలుగు వికెట్లు సాధించగా, బరిందర్ శ్రవణ్, కులకర్ణిలు తలో రెండు వికెట్లు, స్పిన్నర్లు అక్షర్ పటేల్, చాహల్లు చెరో వికెట్ లభించింది.