చరిత్ర సృష్టిస్తాం
ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటామన్న ధోని
టోర్నీకి సరిగ్గా ఏడాది గడువు
దుబాయ్: ప్రపంచకప్‌ను వరుసగా రెండోసారి సాధించి, ఈ ఘనత వహించిన మూడో జట్టుగా చరిత్ర సృష్టిస్తామని భారత కెప్టెన్ ధోని అన్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న ప్రపంచకప్‌కు సరిగ్గా ఏడాది గడువున్న నేపథ్యంలో శుక్రవారం ధోని మాట్లాడాడు. తాము మూడేళ్ల క్రితం ముంబైలో ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్న క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయని, అదే స్ఫూర్తితో టైటిల్‌ను నిలబెట్టుకుంటామని అన్నాడు.
ఇప్పటిదాకా క్లైవ్ వెస్టిండీస్ (1975, 1979), ఆస్ట్రేలియా (1999, 2003, 2007) మాత్రమే డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి మరోసారి ప్రపంచకప్‌ను అందుకున్నాయి. ‘ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటిదాకా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మాత్రమే టైటిల్ నిలబెట్టుకోగలిగాయి. కానీ, మాకున్న నాణ్యమైన జట్టుతో ఆ ఘనత సాధించిన మూడో జట్టుగా నిలవగలమన్న విశ్వాసముంది’ అని ధోని అన్నాడు.