![India A in control against New Zealand A on day one of unofficial Test - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/24/sri.jpg.webp?itok=XoAS7mQ7)
సాక్షి, విజయవాడ: స్పిన్నర్లు షాబాజ్ నదీమ్, కరణ్ శర్మ న్యూజిలాండ్ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను తొలి రోజే కుప్పకూల్చారు. దీంతో శనివారం మొదలైన తొలి అనధికారిక టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 63 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఏసీఏ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ నాలుగు రోజుల టెస్టులో ఒక దశలో 72 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని కివీస్‌ను భారత్ ‘ఎ’ బౌలర్లు అనూహ్యంగా దెబ్బ మీద దెబ్బతీశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ నదీమ్ (4/39), లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ (4/58) చెరో నాలుగు వికెట్లు తీయగా, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 2 కీలక వికెట్లు పడగొట్టాడు.
కివీస్ బ్యాట్స్‌మెన్‌లో జార్జ్ వొర్కర్ 33, జీత్ రావల్ 34 పరుగులు చేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ ‘ఎ’ మొదటి రోజు ఆట నిలిచే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (38 బ్యాటింగ్), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు