ఈసారి భారత స్టార్‌కు మంచి అవకాశం | India had a good chance this time | Sakshi
Sakshi News home page

ఈసారి భారత స్టార్‌కు మంచి అవకాశం

Published Mon, Aug 5 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

ఈసారి భారత స్టార్‌కు మంచి అవకాశం

ఈసారి భారత స్టార్‌కు మంచి అవకాశం

జూనియర్ ప్రపంచ చాంపియన్ టైటిల్... సూపర్ సిరీస్ టోర్నీలోనూ విజయాలు... కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకం... ఒలింపిక్స్‌లో కాంస్యం... దాదాపు అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలు సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖాతాలో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం లోటుగా కనిపిస్తోంది. గత మూడు పర్యాయాలు ఈ హైదరాబాద్ అమ్మాయి పతకానికి విజయం దూరంలో ఉండిపోయింది. నాలుగోసారైనా క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించి ‘చాంపియన్’గా నిలుస్తుందో? లేదో? వేచిచూడాలి.
 
 గ్వాంగ్‌జూ (చైనా): ఈ ఏడాదిలో ఒక్క టైటిల్‌ను గెలువలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో పరీక్షకు సిద్ధమైంది. సోమవారం మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పతకం సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం పకడ్బందీగా సిద్ధమైన సైనాకు ఈసారి అనుకూలమైన ‘డ్రా’నే పడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న సైనాకు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఊరిస్తోంది. హైదరాబాద్ (2009), పారిస్ (2010), లండన్ (2011)లలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సైనా క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించింది.
 
 ఈ ప్రతిష్టాత్మక పోటీల నిబంధనల ప్రకారం సెమీఫైనల్స్‌కు చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఇప్పటివరకు ఈ పోటీల చరిత్రలో భారత్‌కు వచ్చిన రెండు పతకాలు కాంస్యాలే కావడం గమనార్హం. 1983లో ప్రకాశ్ పదుకొనే పురుషుల సింగిల్స్‌లో... 2011లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు.
 
 బుధవారం బరిలోకి...
 సోమవారం ఈ పోటీలు ప్రారంభమవుతున్నా సైనా మాత్రం తన తొలి మ్యాచ్‌ను బుధవారం ఆడనుంది. నాలుగోసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న ఈ హైదరాబాద్ అమ్మాయికి తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఓల్గా గొలోవనోవా (రష్యా) లేదా అలీసియా జైత్సావా (బెలారస్)లలో ఒకరితో సైనా ఆడుతుంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే మూడో రౌండ్‌లో ఆమెకు 15వ సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్) లేదా జేమీ సుబంధి (మలేసియా) ఎదురవుతారు.
 
 ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే క్వార్టర్ ఫైనల్లో సైనాకు ప్రత్యర్థిగా ఎనిమిదో సీడ్ మినత్సు మితాని (జపాన్) లేదా సయాకా తకహాషి (జపాన్) లేదా 13వ సీడ్ యోన్ జూ బే (దక్షిణ కొరియా) లేదా త్సాజ్ కా చాన్ (హాంకాంగ్)లలో ఒకరుంటారు.
 
 ఈ అవరోధాన్ని అధిగమించి సెమీఫైనల్‌కు చేరుకుంటే సైనాకు కనీసం కాంస్యం ఖాయమవుతుంది. అంతా సజావుగా సాగితే సెమీఫైనల్లో సైనాకు టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా) ఎదురయ్యే అవకాశముంటుంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా), నాలుగో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధుకు కూడా తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. రెండో రౌండ్‌లో యశ్వందరి (ఇండోనేసియా) లేదా ఇమబెపు (జపాన్)లలో ఒకరితో సింధు ఆడుతుంది.
 
 తొలిసారి భారీ బృందం
 ఈ పోటీల చరిత్రలో భారత్ తొలిసారి ఐదు విభాగాల్లో (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) రెండేసి ఎంట్రీలను పంపించే అర్హతను సంపాదించింది. భారత్ నుంచి మొత్తం 11 మంది పోటీపడుతుండగా ఇందులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులే కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు... పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్... పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కోనా తరుణ్... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి రాష్ట్రానికి చెందినవారు.
 
 కశ్యప్ ఁ రౌల్
 తొలి రోజున భారత నంబర్‌వన్, ప్రపంచ 13వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 98వ ర్యాంకర్ రౌల్ మస్త్ (ఎస్తోనియా)తో; వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్)తో అజయ్ జయరామ్ పోటీపడతారు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో తరుణ్-అశ్విని పొన్నప్ప జంట హషిమోటో-మియూకి మయెదా (జపాన్) జోడితో; మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-అపర్ణ బాలన్ జోడి లారెన్ స్మిత్-గాబ్రియెలా వైట్ (ఇంగ్లండ్) జంటతో ఆడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement