మరో సిరీస్పై ధోని సేన దృష్టి!
హరారే:జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత యువ జట్టు.. టీ 20 సిరీస్ ను కూడా తన ఖాతాలో వేసుకోవడంపై దృష్టి పెట్టింది. మూడు టీ 20ల సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో బుధవారం సాయంత్రం గం.4.30 ని.లకు చివరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలవడంతో ఆఖరి టీ 20పై ఆసక్తి నెలకొంది. మరోవైపు తన పర్యటనను విజయంతో ముగించాలని ధోని సేన పట్టుదలగా ఉంది. జింబాబ్వే పర్యటన ద్వారా పలువురు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. వీరిలో కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్, బరిందర్ శరణ్, చాహల్లు తమ సత్తా చాటగా, ఫజల్, ఉనాద్కట్లు విఫలమయ్యారు. దాదాపు భారత యువ జట్టు మెరుగ్గా ఉండటంతో రేపటి విజయం ఖాయంగానే కనబడుతోంది.
తొలి టీ 20లో రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైన ధోని సేన.. రెండో టీ 20లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో తన బలాన్ని చాటుకుంది. దీంతో చివరి టీ 20 కూడా ఏకపక్షంగానే ముగించాలని భారత జట్టు యోచిస్తోంది. మరోవైపు తొలి టీ 20లో అనూహ్య విజయాన్ని సాధించిన జింబాబ్వే.. మరో మ్యాచ్లో గెలిచి ధోని సేనకు షాకివ్వాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్లు తమ తమ వ్యూహ రచనల్లో మునిగిపోయాయి. ఇదిలా ఉండగా, రేపటి మ్యాచ్లో టాస్ కీలకం కానుంది. తొలుత టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.
జట్లు అంచనా
భారత జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్, ధవల్ కులకర్ణి, బూమ్రా, బరిందర్ శరణ్, చాహల్
జింబాబ్వే జట్టు: క్రీమర్(కెప్టెన్), చిబాబా, మసకద్జా, మూర్, సికిందర్ రాజా, ముతోంబోడ్జి, వాలర్, చిగుంబరా, మద్జ్వివా, తిరిపానో, ముజారాబాని