అమ్మాయిల ‘గురి’ అదిరింది
- ఫైనల్లో భారత మహిళల ఆర్చరీ జట్టు
- రియో ఒలింపిక్స్‌కూ అర్హత
- పురుషుల జట్టుకు నిరాశ
- ప్రపంచ చాంపియన్‌షిప్
కొపెన్‌హగెన్ (డెన్మార్క్): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రికర్వ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన నాకౌట్ పోటీల్లో భారత్ అజేయంగా నిలిచింది. దీపిక కుమారి, లక్ష్మీరాణి మాఝీ, రిమిల్ బురిలీలతో కూడిన భారత మహిళల జట్టు తొలి రౌండ్‌లో 5-3తో జర్మనీపై విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో భారత్ 6-2తో కొలంబియాను... సెమీఫైనల్లో 5-4తో జపాన్‌ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
జపాన్‌తో పోరులో నిర్ణీత రౌండ్‌ల తర్వాత స్కోరు 4-4తో సమం కావడంతో టైబ్రేక్‌ను నిర్వహించగా... భారత్ 30-27తో విజయాన్ని దక్కించుకుంది. 82 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 2011లో జరిగిన పోటీల్లో తొలిసారి ఫైనల్ చేరిన భారత్ ఆతిథ్య ఇటలీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఈసారి ఫైనల్లో రష్యాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో రష్యా 5-4తో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై సంచలన విజయం సాధించింది. ఇక ఒలింపిక్స్‌కు అర్హత పొందడం భారత మహిళల జట్టుకిది వరుసగా నాలుగోసారి. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించిన భారత జట్లు... 2012 లండన్ ఒలింపిక్స్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాయి.
మరోవైపు రాహుల్ బెనర్జీ, జయంత తాలుక్‌దార్, మంగళ్‌సింగ్ చంపియాలతో కూడిన భారత రికర్వ్ పురుషుల జట్టు 4-5తో రెండో సీడ్ ఇటలీ చేతిలో ఓడిపోయి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయింది. కాంపౌండ్ టీమ్ విభాగంలోనూ భారత జట్లకు నిరాశ ఎదురైంది. తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ, పూర్వాషా షిండే, లిల్లీ చానులతో కూడిన భారత మహిళల జట్టు తొలి రౌండ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. నిర్ణీత రౌండ్‌ల తర్వాత రెండు జట్లు 223-223 స్కోరుతో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌ను నిర్వహించగా భారత్ 27-29తో ఓడిపోయింది. అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, కన్వల్‌ప్రీత్ సింగ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. 224-232తో ఆతిథ్య డెన్మార్క్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో భారత్ 226-223తో రష్యాను ఓడించింది. బుధవారం వ్యక్తిగత విభాగాల్లో పోటీలు జరుగుతాయి.