రికర్వ్ టీమ్ విభాగంలో నెగ్గిన స్వర్ణ పతకాలతో కోమలిక, అంకిత, దీపిక (ఎడమ నుంచి) సెల్ఫీ
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పాల్గొంటున్న చివరి టోర్నమెంట్‌లో భారత మహిళా మేటి ఆర్చర్ దీపిక కుమారి అదరగొట్టింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నమెంట్‌లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది. ముందుగా తన భాగస్వాములు అంకిత భకత్, కోమలిక బరిలతో కలిసి మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో పసిడి పతకం దక్కించుకున్న 27 ఏళ్ల దీపిక మిక్స్‌డ్ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. అనంతరం వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ దీపిక అద్భుతంగా రాణించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ఒకే ప్రపంచకప్ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.
అనా వాజ్‌క్వెజ్, ఐదా రోమన్, వలెన్సియాలతో కూడిన మెక్సికో మహిళల జట్టుతో జరిగిన రికర్వ్ టీమ్ ఫైనల్లో భారత బృందం 5–1తో నెగ్గింది. ఏప్రిల్‌లో గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ దీపిక, అంకిత, కోమలిక బృందం స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం విశేషం.రికర్వ్ మిక్స్‌డ్ ఫైనల్లో దీపిక కుమారి–అతాను దాస్ జంట 5–3తో గ్యాబీ ష్కాలెసర్–ఎస్జెఫ్ వాన్ డెన్ బెర్గ్ (నెదర్లాండ్స్) జోడీని ఓడించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6–0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)పై గెలిచి విజేతగా నిలిచింది. దీపిక వరుసగా మూడు సెట్‌లు (29–26; 29–28; 28–27) గెలిచి ప్రత్యర్థికి తేరుకునే అవకాశమే ఇవ్వలేదు. సెమీఫైనల్లో దీపిక 6–2తో అనా వాజ్‌క్వెజ్ (మెక్సికో)ను ఓడించింది.
మూడు స్వర్ణాలు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మున్ముందూ ఇదే తరహాలో నా ప్రదర్శన ఉండాలి. ప్రపంచకప్ టోర్నీలకు దూరంగా ఉన్న కొరియా, చైనా, జపాన్, చైనీస్ తైపీ క్రీడాకారిణుల నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్రమైన పోటీ ఉంటుంది. నా ఆటలోని లోపాలను సరిదిద్దుకుంటూ టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తా.
– దీపిక కుమారి
భార్యభర్తలు అతాను, దీపిక స్వర్ణ చుంబనం
Comments
Please login to add a commentAdd a comment