Three gold medals
-
వన్షజ్, దేవిక, రవీనా పసిడి పంచ్...
ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో పురుషుల 63.5 కేజీల విభాగంలో హరియాణా కుర్రాడు వన్షజ్... మహిళల 52 కేజీల విభాగంలో పుణే అమ్మాయి దేవిక ఘోర్పడే, 63 కేజీల విభాగంలో రవీనా పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్స్‌లో వన్షజ్ 5–0తో దెముర్ కజై (జార్జియా)పై, దేవిక 5–0తో లౌరెన్ మెకీ (ఇంగ్లండ్)పై, రవీనా 4–3తో మేగన్ డెక్లెయిర్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. పురుషుల 54 కేజీల ఫైనల్లో ఆశిష్ 1–4తో యుటా సకాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. -
దీపిక ధమాకా
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పాల్గొంటున్న చివరి టోర్నమెంట్లో భారత మహిళా మేటి ఆర్చర్ దీపిక కుమారి అదరగొట్టింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నమెంట్లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది. ముందుగా తన భాగస్వాములు అంకిత భకత్, కోమలిక బరిలతో కలిసి మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో పసిడి పతకం దక్కించుకున్న 27 ఏళ్ల దీపిక మిక్స్డ్ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. అనంతరం వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ దీపిక అద్భుతంగా రాణించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ఒకే ప్రపంచకప్ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. అనా వాజ్క్వెజ్, ఐదా రోమన్, వలెన్సియాలతో కూడిన మెక్సికో మహిళల జట్టుతో జరిగిన రికర్వ్ టీమ్ ఫైనల్లో భారత బృందం 5–1తో నెగ్గింది. ఏప్రిల్‌లో గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ దీపిక, అంకిత, కోమలిక బృందం స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం విశేషం.రికర్వ్ మిక్స్డ్ ఫైనల్లో దీపిక కుమారి–అతాను దాస్ జంట 5–3తో గ్యాబీ ష్కాలెసర్–ఎస్జెఫ్ వాన్ డెన్ బెర్గ్ (నెదర్లాండ్స్) జోడీని ఓడించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6–0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)పై గెలిచి విజేతగా నిలిచింది. దీపిక వరుసగా మూడు సెట్లు (29–26; 29–28; 28–27) గెలిచి ప్రత్యర్థికి తేరుకునే అవకాశమే ఇవ్వలేదు. సెమీఫైనల్లో దీపిక 6–2తో అనా వాజ్క్వెజ్ (మెక్సికో)ను ఓడించింది. మూడు స్వర్ణాలు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మున్ముందూ ఇదే తరహాలో నా ప్రదర్శన ఉండాలి. ప్రపంచకప్ టోర్నీలకు దూరంగా ఉన్న కొరియా, చైనా, జపాన్, చైనీస్ తైపీ క్రీడాకారిణుల నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్రమైన పోటీ ఉంటుంది. నా ఆటలోని లోపాలను సరిదిద్దుకుంటూ టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తా. – దీపిక కుమారి భార్యభర్తలు అతాను, దీపిక స్వర్ణ చుంబనం -
భారత్ ‘స్వర్ణ’ గురి
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో సోమవారం భారత షూటర్లు అదరగొట్టారు. ఏకంగా మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ (భారత్) జోడీ 16–12తో గొల్నూష్–జావేద్ ఫరూఖ్ (ఇరాన్) జంటపై నెగ్గి పసిడి పతకం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ (భారత్) ద్వయం 16–10తో డెనిస్ ఎస్టర్–ఇస్తవన్ పెనీ (హంగేరి) జోడీని ఓడించి బంగారు పతకం దక్కించుకుంది. పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో గుర్జోత్, మేరాజ్ అహ్మద్‌ఖాన్, అంగద్ వీర్‌బజ్వాలతో కూడిన భారత జట్టు 6–2తో నాసిర్, అలీ అహ్మద్, రషీద్ లతో కూడిన ఖతర్ జట్టుపై గెలిచి స్వర్ణ పతకం సాధించింది. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో పరీనాజ్, కార్తీకి సింగ్, గనీమత్‌లతో కూడిన భారత జట్టు 4–6తో జోయా, రినాటా, ఓల్గాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
రాహుల్‌కు 3 స్వర్ణాలు
యమునానగర్ (హరియాణా): జాతీ య జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ ఆటగాడు రాగాల వెంకట రాహుల్ సత్తా చాటాడు. ఈ పోటీల్లో రాహుల్ 85 కేజీల కేటగిరీలో మూడు స్వర్ణాలు గెలిచాడు. స్నాచ్‌లో 140 కేజీల బరువెత్తి స్వర్ణం నెగ్గిన అతను, క్లీన్ అండ్ జర్క్‌లో 170 కిలోలు ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా మొత్తం 310 కేజీల బరువు ఎత్తిన రాహుల్ స్వర్ణం దక్కించుకున్నాడు.