న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో సోమవారం భారత షూటర్లు అదరగొట్టారు. ఏకంగా మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ (భారత్) జోడీ 16–12తో గొల్నూష్–జావేద్ ఫరూఖ్ (ఇరాన్) జంటపై నెగ్గి పసిడి పతకం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో ఇలవేనిల్–దివ్యాంశ్ (భారత్) ద్వయం 16–10తో డెనిస్ ఎస్టర్–ఇస్తవన్ పెనీ (హంగేరి) జోడీని ఓడించి బంగారు పతకం దక్కించుకుంది.
పురుషుల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో గుర్జోత్, మేరాజ్ అహ్మద్‌ఖాన్, అంగద్ వీర్‌బజ్వాలతో కూడిన భారత జట్టు 6–2తో నాసిర్, అలీ అహ్మద్, రషీద్ లతో కూడిన ఖతర్ జట్టుపై గెలిచి స్వర్ణ పతకం సాధించింది. మహిళల స్కీట్ ఈవెంట్ ఫైనల్లో పరీనాజ్, కార్తీకి సింగ్, గనీమత్‌లతో కూడిన భారత జట్టు 4–6తో జోయా, రినాటా, ఓల్గాలతో కూడిన కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment