Womens archery team
-
దీపిక ధమాకా
పారిస్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు పాల్గొంటున్న చివరి టోర్నమెంట్లో భారత మహిళా మేటి ఆర్చర్ దీపిక కుమారి అదరగొట్టింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నమెంట్లో దీపిక ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐదు గంటల వ్యవధిలో దీపిక నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింటా విజయం సాధించింది. ముందుగా తన భాగస్వాములు అంకిత భకత్, కోమలిక బరిలతో కలిసి మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో పసిడి పతకం దక్కించుకున్న 27 ఏళ్ల దీపిక మిక్స్డ్ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి విజేతగా నిలిచింది. అనంతరం వ్యక్తిగత రికర్వ్ విభాగంలోనూ దీపిక అద్భుతంగా రాణించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ఒకే ప్రపంచకప్ టోర్నీలో మూడు స్వర్ణాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. అనా వాజ్క్వెజ్, ఐదా రోమన్, వలెన్సియాలతో కూడిన మెక్సికో మహిళల జట్టుతో జరిగిన రికర్వ్ టీమ్ ఫైనల్లో భారత బృందం 5–1తో నెగ్గింది. ఏప్రిల్‌లో గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలోనూ దీపిక, అంకిత, కోమలిక బృందం స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం విశేషం.రికర్వ్ మిక్స్డ్ ఫైనల్లో దీపిక కుమారి–అతాను దాస్ జంట 5–3తో గ్యాబీ ష్కాలెసర్–ఎస్జెఫ్ వాన్ డెన్ బెర్గ్ (నెదర్లాండ్స్) జోడీని ఓడించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో దీపిక 6–0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)పై గెలిచి విజేతగా నిలిచింది. దీపిక వరుసగా మూడు సెట్లు (29–26; 29–28; 28–27) గెలిచి ప్రత్యర్థికి తేరుకునే అవకాశమే ఇవ్వలేదు. సెమీఫైనల్లో దీపిక 6–2తో అనా వాజ్క్వెజ్ (మెక్సికో)ను ఓడించింది. మూడు స్వర్ణాలు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మున్ముందూ ఇదే తరహాలో నా ప్రదర్శన ఉండాలి. ప్రపంచకప్ టోర్నీలకు దూరంగా ఉన్న కొరియా, చైనా, జపాన్, చైనీస్ తైపీ క్రీడాకారిణుల నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్రమైన పోటీ ఉంటుంది. నా ఆటలోని లోపాలను సరిదిద్దుకుంటూ టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తా. – దీపిక కుమారి భార్యభర్తలు అతాను, దీపిక స్వర్ణ చుంబనం -
రియోకు చేరిన మహిళా ఆర్చరీ జట్టు
రియో డీ జనీరో: మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న రియో ఒలింపిక్స్‌లో భాగంగా భారత మహిళా ఆర్చరీ జట్టు బ్రెజిల్లో అడుగుపెట్టింది. ఇంకా ఒలింపిక్స్ ప్రారంభానికి నాలుగు వారాలు సమయం ఉన్నా భారత్ నుంచి మహిళా ఆర్చరీ జట్టు ముందుగా రియోకు చేరుకుని ప్రాక్టీస్ లో నిమగ్నమైంది. దీనిలో భాగంగా ప్రస్తుతం కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న మహిళా ఆర్చర్లు యోగా సాధన చేస్తున్నారు. ఈసారి రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి నలుగురు ఆర్చర్లు మాత్రమే అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మహిళ ఆర్చర్లలో బొంబేలా దేవి, దీపికా కుమారి, లక్ష్మీరాణి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, పురుషుల కేటగిరీలో అతాను దాసు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మహిళా ఆర్చరీ త్రయం టీమ్ ఈవెంట్లో కూడా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న మాజీ నంబర్ వన్ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో పతకం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. గతేడాది కోపెన్‌హగన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన దీపికా.. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు చేజిక్కించుకుంది. మరోవైపు దీపికా వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉండటం కూడా ఆమె పతకంపై ఆశలను పెంచుతోంది. -
అమ్మాయిల ‘గురి’ అదిరింది
- ఫైనల్లో భారత మహిళల ఆర్చరీ జట్టు - రియో ఒలింపిక్స్‌కూ అర్హత - పురుషుల జట్టుకు నిరాశ - ప్రపంచ చాంపియన్‌షిప్ కొపెన్‌హగెన్ (డెన్మార్క్): అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రికర్వ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన నాకౌట్ పోటీల్లో భారత్ అజేయంగా నిలిచింది. దీపిక కుమారి, లక్ష్మీరాణి మాఝీ, రిమిల్ బురిలీలతో కూడిన భారత మహిళల జట్టు తొలి రౌండ్లో 5-3తో జర్మనీపై విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో భారత్ 6-2తో కొలంబియాను... సెమీఫైనల్లో 5-4తో జపాన్ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. జపాన్‌తో పోరులో నిర్ణీత రౌండ్ల తర్వాత స్కోరు 4-4తో సమం కావడంతో టైబ్రేక్‌ను నిర్వహించగా... భారత్ 30-27తో విజయాన్ని దక్కించుకుంది. 82 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 2011లో జరిగిన పోటీల్లో తొలిసారి ఫైనల్ చేరిన భారత్ ఆతిథ్య ఇటలీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఈసారి ఫైనల్లో రష్యాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో రష్యా 5-4తో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై సంచలన విజయం సాధించింది. ఇక ఒలింపిక్స్‌కు అర్హత పొందడం భారత మహిళల జట్టుకిది వరుసగా నాలుగోసారి. 2004 ఏథెన్స్, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించిన భారత జట్లు... 2012 లండన్ ఒలింపిక్స్‌లో మాత్రం తొలి రౌండ్లోనే వెనుదిరిగాయి. మరోవైపు రాహుల్ బెనర్జీ, జయంత తాలుక్దార్, మంగళ్‌సింగ్ చంపియాలతో కూడిన భారత రికర్వ్ పురుషుల జట్టు 4-5తో రెండో సీడ్ ఇటలీ చేతిలో ఓడిపోయి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయింది. కాంపౌండ్ టీమ్ విభాగంలోనూ భారత జట్లకు నిరాశ ఎదురైంది. తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ, పూర్వాషా షిండే, లిల్లీ చానులతో కూడిన భారత మహిళల జట్టు తొలి రౌండ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు జట్లు 223-223 స్కోరుతో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌ను నిర్వహించగా భారత్ 27-29తో ఓడిపోయింది. అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, కన్వల్‌ప్రీత్ సింగ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. 224-232తో ఆతిథ్య డెన్మార్క్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. తొలి రౌండ్లో భారత్ 226-223తో రష్యాను ఓడించింది. బుధవారం వ్యక్తిగత విభాగాల్లో పోటీలు జరుగుతాయి.