రియోకు చేరిన మహిళా ఆర్చరీ జట్టు
రియో డీ జనీరో: మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న రియో ఒలింపిక్స్లో భాగంగా భారత మహిళా ఆర్చరీ జట్టు బ్రెజిల్లో అడుగుపెట్టింది. ఇంకా ఒలింపిక్స్ ప్రారంభానికి నాలుగు వారాలు సమయం ఉన్నా భారత్ నుంచి మహిళా ఆర్చరీ జట్టు ముందుగా రియోకు చేరుకుని ప్రాక్టీస్ లో నిమగ్నమైంది. దీనిలో భాగంగా ప్రస్తుతం కోచ్ల పర్యవేక్షణలో శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న మహిళా ఆర్చర్లు యోగా సాధన చేస్తున్నారు.
ఈసారి రియో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి నలుగురు ఆర్చర్లు మాత్రమే అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మహిళ ఆర్చర్లలో బొంబేలా దేవి, దీపికా కుమారి, లక్ష్మీరాణి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, పురుషుల కేటగిరీలో అతాను దాసు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
మహిళా ఆర్చరీ త్రయం టీమ్ ఈవెంట్‌లో కూడా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న మాజీ నంబర్ వన్ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో పతకం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. గతేడాది కోపెన్‌హగన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన దీపికా.. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు చేజిక్కించుకుంది. మరోవైపు దీపికా వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉండటం కూడా ఆమె పతకంపై ఆశలను పెంచుతోంది.