భారత కుర్రాళ్లు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడారు.. అయితేనేం ఫిఫా ప్రపంచకప్‌లో దేశం తరపున మొట్ట మొదటి గోల్‌తో చరిత్రలో భాగమయ్యారు.. డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్ జీక్సన్ సింగ్ ఈ అద్భుతానికి కారకుడయ్యాడు. కార్నర్ కిక్‌ను తన అద్భుత హెడర్‌తో చేసిన గోల్‌తో ఫుట్‌బాల్ అభిమానులు పులకరించారు. ప్రత్యర్థి జట్లు తమకన్నా ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తరుణంలో ఒక్క గోల్ అయినా చేస్తారా...అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ కొలంబియాతో ఆడిన తీరు నిజంగా అపూర్వం. అయితే పలుమార్లు గోల్స్ అవకాశాలు వచ్చినా అనుభవలేమితో కోల్పోవడం నిరాశ కలిగించింది. ఓవరాల్‌గా తమ తొలి మ్యాచ్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ గణనీయమైన మార్పు కనిపించిన కుర్రాళ్లు భారత ఫుట్‌బాల్ భవిష్యత్‌పై నమ్మకాన్ని పెంచారు.
న్యూఢిల్లీ: ప్రారంభ మ్యాచ్‌లో అమెరికాతో ఎదురైన బలహీనతలను అధిగమించిన భారత కుర్రాళ్లు ఈసారి ఆకట్టుకున్నారు. దీంతో ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో గెలిచేందుకు కొలంబియా చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు ఈ మ్యాచ్‌ను భారత్ 1–2తో ఓడినా తమ కలను మాత్రం విజయవంతంగా నెరవేర్చుకుంది. మిడ్‌ఫీల్డర్ జీక్సన్ సింగ్ 82వ నిమిషంలో చేసిన గోల్.. ఫిఫా టోర్నీలోనే భారత్‌కు తొలి గోల్‌గా నిలిచింది. ఓటమితో నిరాశపరిచినా స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశాభిమానుల మనస్సులు మాత్రం గెలుచుకున్నారు. కొలంబియా తరఫున రెండు గోల్స్‌ను జువాన్ పెనలోజా (49, 83వ నిమిషాల్లో) సాధించాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. అమెరికాపై రాణించిన కోమల్ తాటల్ ఈసారి బెంచీకే పరిమితమయ్యాడు. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిన భారత్ తమ తదుపరి రౌండ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను 12న భారత జట్టు ఘనాతో ఆడుతుంది.
హోరాహోరీ
ప్రథమార్ధంలో ఇరు జట్ల నుంచి హోరాహోరీ ప్రదర్శన ఎదురైంది. ఆరంభంలో భారత్ వెనకబడ్డా ఆ తర్వాత పుంజుకుంది. 5వ నిమిషంలోనే కొలంబియా గోల్ కోసం ప్రయత్నించినా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. అయితే బంతిని మాత్రం పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. తొలి పది నిమిషాలపాటు బంతిపై పట్టు సాధించేందుకు భారత ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. రైట్ ఫ్లాంక్ నుంచి కొలంబియా అటాకింగ్ గేమ్‌కు దిగినా భారత్ అడ్డుకోగలిగింది. అయితే 16వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసేందుకు అద్భుత అవకాశం దక్కింది. అభిజిత్ చరిత్ర సృష్టించినట్టే అనిపించినా అతడు కొట్టిన షాట్ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లడంతో నిరాశ తప్పలేదు. 37వ నిమిషంలో కొలంబియా ఆటగాడు కాంపాజ్ హెడర్‌ను భారత గోల్ కీపర్ ధీరజ్ మెరుపు వేగంతో అందుకోవడంతో జట్టు ఊపిరిపీల్చుకుంది. 42వ నిమిషంలోనూ ధీరజ్ ఇదే రీతిన ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకోగలిగాడు. మరోవైపు ఇంజ్యూ రీ సమయంలో రాహుల్‌కు లభించిన మరో సువర్ణావకాశం గోల్ పోస్టు బార్‌కు తగిలి విఫలమైంది.
భారత్ తొలి గోల్
ద్వితీయార్ధం ఆరంభమైన వెంటనే కొలంబియా జోరు కనబరిచింది. 49వ నిమిషంలో పెనలోజా ఎడమ కాలితో సంధించిన షాట్.. టాప్ కార్నర్ ద్వారా భారత గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది. అయితే 55వ నిమిషంలో రాహుల్ స్కోరును సమం చేసినట్టుగా కనిపించినా అతడు కొట్టిన హెడర్ షాట్ వైడ్‌గా వెళ్లింది. అయితే భారత అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తొలి ప్రపంచకప్ గోల్ 82వ నిమిషంలో నమోదైంది. సంజీవ్ స్టాలిన్ నుంచి వచ్చిన కార్నర్ షాట్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి హెడర్ ద్వారా గురి తప్పకుండా జీక్సన్ చేసిన గోల్‌తో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అటు స్కోరు 1–1తో సమమైంది. కానీ ఈ ఆనంద క్షణాలను కొలంబియా మరుసటి నిమిషంలోనే ఆవిరి చేసింది. గోల్ కీపర్ ధీరజ్‌ను బోల్తా కొట్టిస్తూ పెనలోజా ఎడమవైపు నెట్‌లోనికి బంతిని పంపడంతో ఒక్కసారిగా స్టేడియం నిశ్శబ్దంగా మారింది. గ్రూప్ ‘ఎ’లో జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా జట్టు 1–0తో ఘనాను ఓడించింది. గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌ల్లో మాలి జట్టు 3–0తో టర్కీని.. పరాగ్వే 4–2తో న్యూజిలాండ్‌ను ఓడించాయి.
Comments
Please login to add a commentAdd a comment