Under-17 World Cup football tournament
-
కొత్త చాంపియన్ ఎవరు?
కోల్‌కతా: జూనియర్ యూరోపియన్ జట్లు ప్రపంచకప్ సాకర్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. శనివారం ఇక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగే అండర్–17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో స్పెయిన్ తలపడనుంది. ఇక్కడ ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ అవతరించడం ఖాయం. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడవటంతో ఫైనల్ మ్యాచ్‌కు 66 వేల మంది ప్రేక్షకులు పోటెత్తనున్నారు. ఈ టోర్నీలో సంచలన ఆటతీరుతో దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌కు ఇదే తొలి ఫైనల్. గత ప్రపంచకప్‌లలో క్వార్టర్ ఫైనలే ఆ జట్టు మెరుగైన ప్రదర్శన. అయితే స్పెయిన్‌కు ఇది నాలుగో ఫైనల్. 1991, 2003, 2007లలో తుదిపోరు దాకా వచ్చినా... ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఈసారి మాత్రం ఈ ఫైనల్ అవకాశాన్ని, టైటిల్‌ను వదులుకోకూడదని గట్టిగా భావిస్తోంది. ఈ ఏడాది పరిస్థితులు కూడా స్పెయిన్‌ను ఊరిస్తున్నాయి. మే నెలలో క్రొయేషియాలో జరిగిన అండర్–17 యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడగా పెనాల్టీ షూటౌట్లో స్పెయిన్ గెలిచింది. శనివారం కూడా ఈ విజయబావుటాను పునరావృతం చేయాలనే లక్ష్యంతో స్పెయిన్ బరిలోకి దిగుతోంది. ఫైనల్లో అందరి కళ్లు ఇంగ్లండ్ స్ట్రయికర్ రియాన్ బ్రూస్టర్పైనే కేంద్రీకృతమయ్యాయి. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో ఇంగ్లండ్ తలరాతనే మార్చిన ఘనత బ్రూస్టర్ది. క్వార్టర్స్ దాటని ఆ జట్టు ఈసారి ఫైనల్ చేరిందంటే కచ్చితంగా అది బ్రూస్టర్ మాయాజాలమే. ఫైనల్లోనూ తన జోరును కొనసాగించి ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టాలని అతను తహతహలాడుతున్నాడు. నేటి ఫైనల్ రాత్రి 8 గంటల నుంచి ‘సోనీ టెన్–2’లో ప్రత్యక్ష ప్రసారం -
‘ఆ సత్తా భారత్‌కు ఉంది’
కోల్‌కతా: అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తోన్న భారత్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రశంసల వర్షం కురిపించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘ఫిఫా’ టోర్నీల హెడ్ జైమే యార్జా మాట్లాడుతూ భారత్ ఆతిథ్యం అద్వితీయమన్నారు. సమీప భవిష్యత్తులో సీనియర్ సాకర్ ప్రపంచకప్‌ను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందని కితాబిచ్చారు. ‘ఈ టోర్నీ ఎంతటి విజయవంతమైందో వేలాది అభిమానుల హాజరు చూపుతోంది. కోట్లాది ప్రేక్షకుల టీవీ రేటింగ్ తెలుపుతోంది. అత్యధిక సంఖ్యలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను చూసిన జూనియర్ ప్రపంచకప్‌గా ఘనతకెక్కింది. మ్యాచ్‌లు సాగిన తీరు, ఘనమైన నిర్వహణ, వాడిన సాంకేతిక నైపుణ్యం అన్ని అత్యున్నతంగా ఉన్నాయి. ఓ అద్భుతమైన టోర్నమెంట్‌ను భారత్ ఆవిష్కరించింది. ఇపుడు భారత్ కూడా ఫుట్‌బాల్ దేశమైంది’ అని యార్జా తెలిపారు. భారత జట్టు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పోరాడిందని కితాబిచ్చారు. ఏఐఎఫ్ఎఫ్ చీఫ్ ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ 2019లో జరిగే అండర్–20 ప్రపంచకప్‌కు బిడ్ వేస్తామని చెప్పారు. -
నాకౌట్ ఆశలు అంతంతే!
న్యూఢిల్లీ: ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో గురువారమే భారత పోరాటం ముగిసే అవకాశముంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా రెండుసార్లు మాజీ చాంపియన్ ఘనాతో భారత్ నేడు అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో 0–3తో అమెరికా చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో కొలంబియా చేతిలో 1–2తో పరాజయం పాలైంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి అమెరికా నాకౌట్ దశకు అర్హత పొందగా... కొలంబియా, ఘనా మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ చివరిదైన నాలుగో స్థానంలో ఉంది. ఒకవేళ ఘనాపై భారత్ గెలిచినా ఆతిథ్య జట్టు నాకౌట్‌కు చేరే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఘనాపై భారత్ కనీసం నాలుగు గోల్స్ తేడాతో గెలిచి... అమెరికా చేతిలో కొలంబియా కూడా భారీ తేడాతో ఓడిపోతే టీమిండియాకు నాకౌట్ అవకాశాలు ఉంటాయి. పాయింట్లపరంగా ఒకవేళ రెండు జట్లు సమఉజ్జీగా ఉంటే మెరుగైన గోల్స్ సగటు ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ప్రస్తుతం భారత్ గోల్స్ సగటు (–4) ఉండగా... కొలంబియా, ఘనా సగటు సున్నాగా ఉంది. ఆరు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (12)... ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచిన మెరుగైన నాలుగు జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. మరోవైపు కొలంబియా చేతిలో భారత్ ఓడిపోయినా అద్భుత ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది. అదే పట్టుదలతో ఘనాపై కూడా ఆడుతూ భారత్ అద్భుతం చేస్తుందేమో వేచి చూడాలి. ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్: మరోవైపు బుధవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2–1తో జపాన్ను ఓడించి... గ్రూప్ ‘ఎఫ్’లో ఇంగ్లండ్ 3–2తో మెక్సికోపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇతర మ్యాచ్‌ల్లో హోండురస్ 5–0తో న్యూ కాలడోనియాపై, ఇరాక్ 3–0తో చిలీపై గెలిచాయి. ►రాత్రి గం. 8.00 నుంచి సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం -
ఓడినా... ‘చరిత్ర’ సృష్టించారు
భారత కుర్రాళ్లు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడారు.. అయితేనేం ఫిఫా ప్రపంచకప్‌లో దేశం తరపున మొట్ట మొదటి గోల్‌తో చరిత్రలో భాగమయ్యారు.. డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్ జీక్సన్ సింగ్ ఈ అద్భుతానికి కారకుడయ్యాడు. కార్నర్ కిక్‌ను తన అద్భుత హెడర్‌తో చేసిన గోల్‌తో ఫుట్‌బాల్ అభిమానులు పులకరించారు. ప్రత్యర్థి జట్లు తమకన్నా ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తరుణంలో ఒక్క గోల్ అయినా చేస్తారా...అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ కొలంబియాతో ఆడిన తీరు నిజంగా అపూర్వం. అయితే పలుమార్లు గోల్స్ అవకాశాలు వచ్చినా అనుభవలేమితో కోల్పోవడం నిరాశ కలిగించింది. ఓవరాల్‌గా తమ తొలి మ్యాచ్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ గణనీయమైన మార్పు కనిపించిన కుర్రాళ్లు భారత ఫుట్‌బాల్ భవిష్యత్‌పై నమ్మకాన్ని పెంచారు. న్యూఢిల్లీ: ప్రారంభ మ్యాచ్‌లో అమెరికాతో ఎదురైన బలహీనతలను అధిగమించిన భారత కుర్రాళ్లు ఈసారి ఆకట్టుకున్నారు. దీంతో ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో గెలిచేందుకు కొలంబియా చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు ఈ మ్యాచ్‌ను భారత్ 1–2తో ఓడినా తమ కలను మాత్రం విజయవంతంగా నెరవేర్చుకుంది. మిడ్‌ఫీల్డర్ జీక్సన్ సింగ్ 82వ నిమిషంలో చేసిన గోల్.. ఫిఫా టోర్నీలోనే భారత్‌కు తొలి గోల్‌గా నిలిచింది. ఓటమితో నిరాశపరిచినా స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశాభిమానుల మనస్సులు మాత్రం గెలుచుకున్నారు. కొలంబియా తరఫున రెండు గోల్స్‌ను జువాన్ పెనలోజా (49, 83వ నిమిషాల్లో) సాధించాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. అమెరికాపై రాణించిన కోమల్ తాటల్ ఈసారి బెంచీకే పరిమితమయ్యాడు. అయితే వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడిన భారత్ తమ తదుపరి రౌండ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను 12న భారత జట్టు ఘనాతో ఆడుతుంది. హోరాహోరీ ప్రథమార్ధంలో ఇరు జట్ల నుంచి హోరాహోరీ ప్రదర్శన ఎదురైంది. ఆరంభంలో భారత్ వెనకబడ్డా ఆ తర్వాత పుంజుకుంది. 5వ నిమిషంలోనే కొలంబియా గోల్ కోసం ప్రయత్నించినా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. అయితే బంతిని మాత్రం పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. తొలి పది నిమిషాలపాటు బంతిపై పట్టు సాధించేందుకు భారత ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. రైట్ ఫ్లాంక్ నుంచి కొలంబియా అటాకింగ్ గేమ్‌కు దిగినా భారత్ అడ్డుకోగలిగింది. అయితే 16వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసేందుకు అద్భుత అవకాశం దక్కింది. అభిజిత్ చరిత్ర సృష్టించినట్టే అనిపించినా అతడు కొట్టిన షాట్ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లడంతో నిరాశ తప్పలేదు. 37వ నిమిషంలో కొలంబియా ఆటగాడు కాంపాజ్ హెడర్‌ను భారత గోల్ కీపర్ ధీరజ్ మెరుపు వేగంతో అందుకోవడంతో జట్టు ఊపిరిపీల్చుకుంది. 42వ నిమిషంలోనూ ధీరజ్ ఇదే రీతిన ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకోగలిగాడు. మరోవైపు ఇంజ్యూ రీ సమయంలో రాహుల్‌కు లభించిన మరో సువర్ణావకాశం గోల్ పోస్టు బార్‌కు తగిలి విఫలమైంది. భారత్ తొలి గోల్ ద్వితీయార్ధం ఆరంభమైన వెంటనే కొలంబియా జోరు కనబరిచింది. 49వ నిమిషంలో పెనలోజా ఎడమ కాలితో సంధించిన షాట్.. టాప్ కార్నర్ ద్వారా భారత గోల్‌పోస్టులోకి దూసుకెళ్లింది. అయితే 55వ నిమిషంలో రాహుల్ స్కోరును సమం చేసినట్టుగా కనిపించినా అతడు కొట్టిన హెడర్ షాట్ వైడ్‌గా వెళ్లింది. అయితే భారత అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తొలి ప్రపంచకప్ గోల్ 82వ నిమిషంలో నమోదైంది. సంజీవ్ స్టాలిన్ నుంచి వచ్చిన కార్నర్ షాట్‌ను అమాంతం గాల్లోకి ఎగిరి హెడర్ ద్వారా గురి తప్పకుండా జీక్సన్ చేసిన గోల్‌తో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అటు స్కోరు 1–1తో సమమైంది. కానీ ఈ ఆనంద క్షణాలను కొలంబియా మరుసటి నిమిషంలోనే ఆవిరి చేసింది. గోల్ కీపర్ ధీరజ్‌ను బోల్తా కొట్టిస్తూ పెనలోజా ఎడమవైపు నెట్‌లోనికి బంతిని పంపడంతో ఒక్కసారిగా స్టేడియం నిశ్శబ్దంగా మారింది. గ్రూప్ ‘ఎ’లో జరిగిన మరో మ్యాచ్‌లో అమెరికా జట్టు 1–0తో ఘనాను ఓడించింది. గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌ల్లో మాలి జట్టు 3–0తో టర్కీని.. పరాగ్వే 4–2తో న్యూజిలాండ్‌ను ఓడించాయి. -
భారత్ మ్యాచ్‌లు ఢిల్లీలో!
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లో జరిగే అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టు ఆడే మ్యాచ్‌ల వేదికలో మార్పు చోటు చేసుకుంది. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్‌లను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆడాల్సింది. తాజా మార్పు ప్రకారం భారత్ ఆడే మ్యాచ్‌లను న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులను భారత ఫుట్‌బాల్ సమాఖ్య కోరింది.