న్యూఢిల్లీ: ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గురువారమే భారత పోరాటం ముగిసే అవకాశముంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా రెండుసార్లు మాజీ చాంపియన్ ఘనాతో భారత్ నేడు అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో 0–3తో అమెరికా చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో కొలంబియా చేతిలో 1–2తో పరాజయం పాలైంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి అమెరికా నాకౌట్ దశకు అర్హత పొందగా... కొలంబియా, ఘనా మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ చివరిదైన నాలుగో స్థానంలో ఉంది. ఒకవేళ ఘనాపై భారత్ గెలిచినా ఆతిథ్య జట్టు నాకౌట్‌కు చేరే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఘనాపై భారత్ కనీసం నాలుగు గోల్స్ తేడాతో గెలిచి... అమెరికా చేతిలో కొలంబియా కూడా భారీ తేడాతో ఓడిపోతే టీమిండియాకు నాకౌట్ అవకాశాలు ఉంటాయి.
పాయింట్లపరంగా ఒకవేళ రెండు జట్లు సమఉజ్జీగా ఉంటే మెరుగైన గోల్స్ సగటు ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ప్రస్తుతం భారత్ గోల్స్ సగటు (–4) ఉండగా... కొలంబియా, ఘనా సగటు సున్నాగా ఉంది. ఆరు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (12)... ఆ తర్వాత మూడో స్థానంలో నిలిచిన మెరుగైన నాలుగు జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. మరోవైపు కొలంబియా చేతిలో భారత్ ఓడిపోయినా అద్భుత ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది. అదే పట్టుదలతో ఘనాపై కూడా ఆడుతూ భారత్ అద్భుతం చేస్తుందేమో వేచి చూడాలి.
ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్: మరోవైపు బుధవారం జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2–1తో జపాన్‌ను ఓడించి... గ్రూప్ ‘ఎఫ్’లో ఇంగ్లండ్ 3–2తో మెక్సికోపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇతర మ్యాచ్‌ల్లో హోండురస్ 5–0తో న్యూ కాలడోనియాపై, ఇరాక్ 3–0తో చిలీపై గెలిచాయి.
►రాత్రి గం. 8.00 నుంచి సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment