కోల్‌కతా: జూనియర్ యూరోపియన్ జట్లు ప్రపంచకప్ సాకర్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. శనివారం ఇక్కడి సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగే అండర్–17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో స్పెయిన్ తలపడనుంది. ఇక్కడ ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ అవతరించడం ఖాయం. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడవటంతో ఫైనల్ మ్యాచ్‌కు 66 వేల మంది ప్రేక్షకులు పోటెత్తనున్నారు. ఈ టోర్నీలో సంచలన ఆటతీరుతో దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌కు ఇదే తొలి ఫైనల్. గత ప్రపంచకప్‌లలో క్వార్టర్ ఫైనలే ఆ జట్టు మెరుగైన ప్రదర్శన. అయితే స్పెయిన్‌కు ఇది నాలుగో ఫైనల్. 1991, 2003, 2007లలో తుదిపోరు దాకా వచ్చినా... ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఈసారి మాత్రం ఈ ఫైనల్ అవకాశాన్ని, టైటిల్‌ను వదులుకోకూడదని గట్టిగా భావిస్తోంది. ఈ ఏడాది పరిస్థితులు కూడా స్పెయిన్‌ను ఊరిస్తున్నాయి. మే నెలలో క్రొయేషియాలో జరిగిన అండర్–17 యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడగా పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్ గెలిచింది.
శనివారం కూడా ఈ విజయబావుటాను పునరావృతం చేయాలనే లక్ష్యంతో స్పెయిన్ బరిలోకి దిగుతోంది. ఫైనల్లో అందరి కళ్లు ఇంగ్లండ్ స్ట్రయికర్ రియాన్ బ్రూస్టర్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో ఇంగ్లండ్ తలరాతనే మార్చిన ఘనత బ్రూస్టర్‌ది. క్వార్టర్స్ దాటని ఆ జట్టు ఈసారి ఫైనల్ చేరిందంటే కచ్చితంగా అది బ్రూస్టర్ మాయాజాలమే. ఫైనల్లోనూ తన జోరును కొనసాగించి ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టాలని అతను తహతహలాడుతున్నాడు. నేటి ఫైనల్ రాత్రి 8 గంటల నుంచి ‘సోనీ టెన్–2’లో ప్రత్యక్ష ప్రసారం
కొత్త చాంపియన్ ఎవరు?
Published Sat, Oct 28 2017 12:44 AM | Last Updated on Sat, Oct 28 2017 12:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment