FIFA Women's World Cup Spain vs England- Olga Carmona: జట్టును విశ్వవిజేతగా నిలిపి స్పెయిన్‌లో సంబరాలకు కారణమైన మహిళా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ ఓల్గా కర్మోనా.. వ్యక్తిగతంగా తీరని శోకంలో మునిగిపోయింది. టైటిల్ సాధించామనే సంతోషంలో ఉండగానే తండ్రి ఇకలేడనే విషాదకర వార్త వినాల్సి వచ్చింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓల్గా తండ్రి శుక్రవారమే మరణించారు.
నైతిక స్థైర్యానిచ్చి..
అయితే, ఓల్గా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ విషయాన్ని ఆమె వద్ద దాచారు. కెరీర్ పరంగా అత్యంత ముఖ్యమైన మ్యాచ్ ఆడాల్సి ఉన్న తరుణంలో తండ్రి చనిపోయాడన్న వార్తను ఆమెకు తెలియనీయలేదు. అంతేకాదు.. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు శనివారమే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆమెకు నైతిక స్థైర్యానిచ్చారు. ఒకే ఒక్క గోల్‌తో స్పెయిన్‌ను జగజ్జేతగా నిలిపిన ఓల్గా సంబరాలు చేసుకున్న తర్వాత.. ఈ విషాదకర వార్తను ఆమెకు తెలియజేశారు.
నువ్వు గర్వపడతావని తెలుసు నాన్నా
ఈ నేపథ్యంలో తండ్రిని తలచుకుంటూ ఓల్గా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ‘‘ఎవరూ సాధించలేనిది గెలిచి.. అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచేలా నాకు శక్తిని అందించావు. నువ్వు ఎక్కడున్నా నీ చల్లని చూపులు నా మీద ఉంటాయని తెలుసు. నన్ను చూసి నువ్వు గర్వపడతావని తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి నాన్నా’’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది.
అంచనాలు లేకుండా బరిలో దిగి
కాగా ఏమాత్రం అంచనాలు లేకుండా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు చివరకు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆట 29వ నిమిషంలో ఓల్గా కర్మోనా చేసిన గోల్‌తో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది.
జగజ్జేతగా నిలిపి..
ఆట 68వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ రూపంలో రెండో గోల్ చేసే అవకాశం వచ్చింది. అయితే జెన్నీ హెర్మోసో కొట్టిన పెనాల్టీ షాట్‌ను ఇంగ్లండ్ గోల్‌కీపర్ మేరీ ఈర్ప్స్ ఎడమ వైపునకు డైవ్ చేస్తూ అడ్డుకుంది. మూడో ప్రయత్నంలో తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జట్టు స్కోరు సమం చేసేందుకు చివరి నిమిషం వరకు తీవ్రంగా శ్రమించింది.
కానీ స్పెయిన్ డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. నిర్ణీత 90 నిమిషాల తర్వాత ఇంజ్యూరీ టైమ్ రూపంలో మరో 15 నిమిషాలు అదనంగా ఆడించారు. ఈ ఉత్కంఠభరిత నిమిషాలను అధిగమిస్తూ స్పెయిన్ తమ ఆధిక్యాన్ని కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
రెండో ప్లేయర్‌గా..
స్వీడన్‌తో జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ తరఫున 89వ నిమిషంలో ఓల్గా కర్మోనా రెండో గోల్ చేసి తమ జట్టును ఫైనల్‌కు చేర్చింది. 2015లో కర్లీ లాయిడ్ (అమెరికా) తర్వాత ఒకే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో, ఫైనల్లో గోల్ చేసిన ప్లేయర్‌గా ఓల్గా కర్మోనా గుర్తింపు పొందింది.
చదవండి: జైలర్ సినిమా చూశాడు.. దుమ్ము రేపాడు! అట్లుంటది సంజూతో
Y sin saberlo tenía mi Estrella antes de que empezase el partido. Sé que me has dado la fuerza para conseguir algo único. Sé que me has estado viendo esta noche y que estás orgulloso de mí. Descansa en paz, papá 🌟❤️🩹 pic.twitter.com/Uby0mteZQ3
— Olga Carmona (@7olgacarmona) August 20, 2023
Comments
Please login to add a commentAdd a comment