
పెర్త్: ఆసీస్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నలుగురు పేసర్లతో పోరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. పెర్త్ వికెట్‌పై పచ్చిక ఎక్కువగా ఉన్న కారణంగా పేసర్ల వైపే టీమిండియా మొగ్గుచూపింది. గాయపడిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి రాగా, రోహిత్ శర్మ స్థానంలో హనుమ విహారికి అవకాశం దక్కింది. అయితే పెర్త్ టెస్టులో రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించకపోవడం టీమిండియా చేసిన పొరపాటుగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.
‘పెర్త్ టెస్టు కోసం టీమిండియా జట్టు ఎంపిక బాలేదు. ప్రధానంగా జడేజాకు స్థానం కల్పించకపోవడం కచ్చితంగా తప్పే. జడేజాను తీసుకోకుండా భారత్ పొరపాటు చేసిందని అనుకుంటున్నాను. కేవలం అతను బౌలింగ్‌లోనే కాదు. బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గానూ రాణించేవాడు. దీంతో భారత్‌కు రెండో టెస్టులో మరి కాసేపు ఇన్నింగ్స్ కొనసాగించేందుకు అవకాశం ఉండేది. ఈ ఎంపిక ఆస్ట్రేలియాకు ఓ రకంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి' అని వాన్ పేర్కొన్నాడు.