
న్యూఢిల్లీ: భారత్ నుంచి నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)కు ఎంపికైన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన సత్నామ్ సింగ్ భమారా డోపీగా తేలాడు. దక్షిణాసియా క్రీడలకు సన్నాహక శిబిరం సందర్భంగా బెంగళూరులో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సత్నామ్ శాంపిల్స్‌ను సేకరించింది. వీటిలో ‘ఎ’ శాంపిల్‌ను పరీక్షించగా ఈ 23 ఏళ్ల పంజాబ్ ప్లేయర్ నిషిద్ధ ఉత్రే్పరకాన్ని తీసుకున్నట్లుగా పరీక్షలో వెల్లడైంది. దీంతో నవంబర్ 19 నుంచి భమారాపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ‘నాడా’ ప్రకటించింది. అయితే దీనిని సత్నామ్ సింగ్ ఖండించాడు. తాను ఎప్పుడూ నిషిద్ధ ఉత్రే్పరకాలు తీసుకోలేదని, తీసుకోబోనని వ్యాఖ్యానించాడు. ‘నాడా’కు చెందిన ‘డోపింగ్ నిరోధక క్రమశిక్షణా ప్యానల్ (ఏడీడీపీ)’ తన వాదనను వినాలంటూ 7 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న సత్నామ్ అభ్యర్థన చేశాడు. ఒకవేళ ఏడీడీపీ అతన్ని డోపీగా నిర్ధారిస్తే ఏకంగా 4 సంవత్సరాల సస్పెన్షన్ విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment