Satnam Singh Bhamara
-
సత్నాం సింగ్‌పై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) జట్టుకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఘనతకెక్కిన సత్నాం సింగ్ భమారా డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో 25 ఏళ్ల భమారాపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణా ప్యానెల్ గురువారం ప్రకటించింది. బెంగళూరులో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనే సత్నాం సింగ్ డోపీగా తేలడంతో రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేశారు. దీన్ని సవాలు చేసిన సత్నాం డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (ఏడీడీపీ)తో విచారణ జరిపించాలని ‘నాడా’ను కోరాడు. ఈ విచారణలో సత్నాం ‘వాడా’ నిషేధిత ఉత్ప్రేరకం హైజినమైన్ను తీసుకున్నట్లు తేలిందని ‘నాడా’ గురువారం నిర్ధారించింది. గతేడాది నవంబర్ నుంచే శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొన్న జాతీయ సంస్థ 19 నవంబర్ 2021 వరకు అతను ఎలాంటి టోర్నీల్లో ఆడరాదంటూ నిషేధం విధించింది. ఐదేళ్ల క్రితం ఎన్బీఏ డెవలప్మెంట్ లీగ్‌లో టెక్సాస్ లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన భమారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా చాంపియన్‌షిప్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్, 2019 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
‘డోపీ’ సత్నామ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్ నుంచి నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)కు ఎంపికైన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన సత్నామ్ సింగ్ భమారా డోపీగా తేలాడు. దక్షిణాసియా క్రీడలకు సన్నాహక శిబిరం సందర్భంగా బెంగళూరులో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సత్నామ్ శాంపిల్స్‌ను సేకరించింది. వీటిలో ‘ఎ’ శాంపిల్‌ను పరీక్షించగా ఈ 23 ఏళ్ల పంజాబ్ ప్లేయర్ నిషిద్ధ ఉత్రే్పరకాన్ని తీసుకున్నట్లుగా పరీక్షలో వెల్లడైంది. దీంతో నవంబర్ 19 నుంచి భమారాపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ‘నాడా’ ప్రకటించింది. అయితే దీనిని సత్నామ్ సింగ్ ఖండించాడు. తాను ఎప్పుడూ నిషిద్ధ ఉత్రే్పరకాలు తీసుకోలేదని, తీసుకోబోనని వ్యాఖ్యానించాడు. ‘నాడా’కు చెందిన ‘డోపింగ్ నిరోధక క్రమశిక్షణా ప్యానల్ (ఏడీడీపీ)’ తన వాదనను వినాలంటూ 7 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న సత్నామ్ అభ్యర్థన చేశాడు. ఒకవేళ ఏడీడీపీ అతన్ని డోపీగా నిర్ధారిస్తే ఏకంగా 4 సంవత్సరాల సస్పెన్షన్ విధిస్తారు. -
‘చోటూ’ బన్‌గయా సూపర్ హీరో
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లాలో మారుమూల గ్రామం బల్లోకే. ఈ గ్రామ జనాభా 700. అందరూ వ్యవసాయం చేస్తారు. ఈ గ్రామంలో జన్మించిన సత్నామ్ ఎత్తు 7 అడుగుల 2 అంగుళాలు. అయితే ఈ ఆజానుబాహుడిని ఆ ఊరిలో అందరూ ‘చోటూ’ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ ఊళ్లో అతనికంటే ఎత్తుగా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారట. సత్నామ్ తండ్రి బల్బీర్ సింగ్ ఎత్తు కూడా 7.2 అడుగులు. ఆయన గోధుమలు పండిస్తారు. తొమ్మిదేళ్ల వయసు వరకు సత్నామ్‌కు బాస్కెట్‌బాల్ అంటే ఏంటో తెలియదు. ఆ తర్వాత స్కూల్లో ఈ ఆట గురించి తెలిసి ఆసక్తి పెంచుకున్నాడు. ఆ గ్రామంలో ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో 12 ఏళ్ల వయసులో సమీప పట్టణంలోని అకాడమీలో చేర్పించారు. కానీ అక్కడ కూడా సదుపాయాలు లేవు. అయినా కష్టపడ్డాడు. తనలో ఉన్న నైపుణ్యానికి ఎత్తు అదనపు బలంగా మారింది. అంతే... జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ పెద్దలను ఆకర్షించాడు. దీంతో 2010లో ఫ్లోరిడాలోని ఐఎంజీ రిలయన్స్ అకాడమీలో మూడు నెలల శిక్షణ కోసం మరో 29 మందితో కలిసి వెళ్లే అవకాశం లభించింది. ఇది తన తలరాతను మార్చింది. అక్కడ సత్నామ్ నైపుణ్యం చూసి ఇక మళ్లీ భారత్‌కు పంపించలేదు. అక్కడే ఐఎంజీ అకాడమీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చిన్న చిన్న లీగ్‌లు ఆడాడు. ఇప్పుడు అనూహ్యంగా ఎన్బీఏలో అడుగుపెడుతున్నాడు. ఈ ఘనతతో భారత బాస్కెట్‌బాల్‌లో చోటూ సూపర్ హీరోగా మారాడు. యావో మింగ్ మాదిరిగా..! భారత్ అంటే క్రికెట్... ఇక్కడ బాస్కెట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేదు. పాఠశాలలు, కళాశాలల్లో అక్కడక్కడా కనిపించినా పెద్దగా పట్టించుకోరు. కానీ అమెరికాలో ఈ క్రీడ అంటే పిచ్చి. ఎన్బీఏ మ్యాచ్‌ల కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తారు. మైకేల్ జోర్డాన్ లాంటి దిగ్గజం ఆడిన ఆ సర్క్యూట్లో మన దేశం నుంచి ఓ క్రీడాకారుడు ఆడతాడనేది ఇప్పటిదాకా ఊహకు అందని విషయం. ఈ సీజన్లో భుల్లర్ అనే భారత సంతతి ఆటగాడు (కెనడా) ఎన్బీఏలో ఆడాడు. ఇప్పుడు సత్నామ్ కేవలం 19 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం. బాస్కెట్‌బాల్ ఇప్పటికే ఆడుతున్న యువకులంతా సత్నామ్ స్ఫూర్తిగా మరింత కష్టపడతారు. గతంలో చైనాలోనూ బాస్కెట్‌బాల్‌కు ఆదరణ లేదు. అయితే అక్కడి నుంచి యావో మింగ్ వెళ్లి ఎన్బీఏలో ఆడిన తర్వాత ఆ దేశంలో విపరీతంగా ఆదరణ పెరిగింది. ఇవ్వాళ చైనా ఆసియాలో పెద్ద శక్తిగా ఎదిగింది. యావో మింగ్ తరహాలోనే సత్నామ్ కూడా భారత్‌లో ఆట రాతను మారిస్తే అంతకంటే కావల్సింది ఏముంటుంది. -సాక్షి క్రీడావిభాగం -
సత్నామ్ సంచలనమ్!
♦ ఎన్బీఏ లీగ్‌లోకి ఎంపికైన తొలి భారత ఆటగాడిగా చరిత్ర ♦ డల్లాస్ మావెరిక్స్ జట్టుకు ఎంపిక న్యూయార్క్ : భారత్‌కు చెందిన యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్నామ్ సింగ్ భమరా కొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని ప్రఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లీగ్‌లో ఆడేందుకు ఈ 19 ఏళ్ల క్రీడాకారుడు ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు సత్నామ్. గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన ఎన్బీఏ డ్రాఫ్ట్‌లో ఇతడిని ‘డల్లాస్ మావెరిక్స్’ జట్టు ఎంపిక చేసుకుంది. అలాగే దశాబ్ద కాలంలో కళాశాల లేక ప్రొఫెషనల్ అనుభవం లేని ఆటగాడు ఎన్బీఏకు ఎంపికవడం కూడా ఇదే తొలిసారి. 2005లో డ్రాఫ్ట్ అర్హత నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్‌లోకి రావాలంటే ఓ ఆటగాడు హైస్కూల్లో ఏడాదిపాటు ఎన్బీఏ ‘డి’ లీగ్‌లో ఆడాలి. లేదా విదేశాల్లో ప్రొఫెషనల్‌గా ఆడిన అనుభవమైనా ఉండాలి. కానీ ఇవేమీ సత్నామ్ సింగ్‌కు లేవు. అతడికున్న అత్యున్నత అనుభవమల్లా భారత జాతీయ జట్టుకు ఆడటమే. సత్నామ్‌ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని డల్లాస్ జట్టు యజమాని మార్క్ క్యూబన్ అన్నారు. ఇప్పుడు తమ జట్టుకు భారత్ రూపంలో వంద కోట్లకు పైగా అభిమానులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రశంసల వర్షం : సత్నామ్ సింగ్‌పై భారత్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘ఈ వార్త తెలిసి చాలా సంతోషపడ్డాను. ఓ భారత ఆటగాడికి ఇది పెద్ద ఘనత. అందరూ గర్వించదగ్గ విషయం. రాబోయే సీజన్‌తో పాటు కెరీర్లో మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నాను. కచ్చితంగా భారత్ అంతా అతడి వెనుకే ఉంటుంది’ అని సచిన్ అన్నాడు. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, గుత్తా జ్వాల, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ జట్లు సత్నామ్‌కు అభినందనలు తెలిపాయి. ఇది కలా.. నిజమా అనే స్థితిలో ఉన్నాను. కానీ నేను ఎన్బీఏలో చోటు సాధించాననే విషయం వాస్తవం. భగవంతుడి దయతో నా కల నిజం చేసుకున్నాను. ఈ సమయంలో నా కుటుంబం, తొలి కోచ్ సుబ్రమణ్యంలను తలచుకోకుండా ఉండలేను. ఈ ఫీట్‌తో భారత్ నుంచి కూడా చాలా మంది వర్ధమాన ఆటగాళ్లు నాలాగే పెద్ద ఆశయాలు పెట్టుకునేందుకు అవకాశం కలిగింది. కచ్చితంగా రాబోయే రోజుల్లో బాస్కెట్‌బాల్‌కు భారత్‌లో ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు క్రికెట్‌ను ఆభిమానించినట్టే ఈ ఆటను కూడా చూస్తారు. - సత్నామ్ -
ఎన్బీఏలో తొలి భారతీయుడికి స్థానం
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన సత్నం సింగ్ భామర అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలో ప్రాచుర్యమైన ఎన్బీఏలో స్థానం సంపాదించిన తొలి భారతీయుడిగా సత్నం రికార్డు సృష్టించాడు. డల్లాస్ మావెరిక్స్ టీమ్‌లో సత్నంను తీసుకున్నారు. ఏడు అడుగులకుపైగా ఎత్తు ఉన్న సత్నం పంజాబ్‌లోని బర్నాలకు చెందినవాడు. 2011లో ఆసియా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సత్నం భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ జట్టు తరపున ఆడిన పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గత ఐదేళ్లుగా సత్నం అమెరికాలోని ఫ్లోరిడాలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఎన్బీఏలో ఇంతకుముందు భారత సంతతి వ్యక్తి సిమ్ భుల్లర్ ఆడాడు. కాగా భుల్లర్ కెనడాలో జన్మించాడు.